తిరుమలగిరి(సాగర్), మార్చి 11: స్థానిక తహసీల్దార్‌కు హెచ్చార్సీ అరెస్టు వారెంటు జారీ చేయడంతో జిల్లా రెవెన్యూ శాఖలో కలకలం రేపింది. దీంతో హెచ్చార్సీ ఆదేశాలను తేలికగా తీసుకోకూడదనే సందేశం అధికారులకు వెళ్లింది. భూ వివాదంలో పక్షపాత వైఖరి అవలంబించడం, హెచ్చార్సీ ఆదేశాలను బేఖాతరు చేయడం ఓ అధికారి చేసి రెండు తీవ్రమైన తప్పులు. కమిషన్ అరెస్టు వారెంట్ జారీ చేయడం జిల్లాలోని రెవెన్యూ అధికారులకు ఓ హెచ్చరిక. భూ వివాదాల్లో అన్యాయం జరిగితే బాధితులు హెచ్చార్సీని ఆశ్రయించవచ్చని, కమిషన్ ఆదేశాలను అధికారులు తప్పక పాటించాల్సి ఉంటుందని అర్ధమైంది.
ఆదేశాలు బేఖాతర్..
హెచ్చార్సీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ నివేదిక సమర్పించని తహసీల్దార్ అనిల్‌పై కమిషన్ తీవ్రంగా స్పందించింది. అధికారి నిర్లక్ష్యం అంగీకార యోగ్యం కాదని స్పష్టం చేస్తూ అరెస్టు వారెంట్ జారీ చేసింది. తహసీల్దార్‌ను అరెస్ట్ చేసి కమిషన్ ఎదుట హాజరు పరచాలని పోలీసులకు ఆదేశం వెళ్లింది. మండలంలో రంగుండ్ల గ్రామానికి చెందిన ఆంగోతు నిమ్మకు ఆంగోతు రాము, ఆంగోతు బాలాజీ కుమారులు. వారు తమ భూ వివాదాన్ని పరిష్కరించాలని 2023లో అప్పటి తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ వివాదాన్ని పరిష్కరించకపోవడంతో పలుమార్లు తహసీల్దార్ కార్యాలయం చుట్టు తిరిగినా సమస్య పరిష్కారం కాకపోవడంతో బాధితులు హెచ్చార్సీని ఆశ్రయించారు. దీంతో హెచ్చార్సీ, నివేదికను సమర్పించాలని తహసీల్దార్‌ను ఆదేశించింది. తహసీల్దార్ నిర్ధేశించిన గడువు లోగా నివేదిక ఇవ్వకపోవడంతో కమిషన్ ఆగ్ర హం వ్యక్తం చేసింది. 2026 ఫిబ్రవరి 18వ తేదీ ఉదయం 11గంటలకు హెచ్చార్సీ ఎదుట నివేదికను సమర్పించాలని తహసీల్దార్‌కు గత ఏడాది డిసెంబర్ 19న షరతులతో కూడిన ఉత్తర్వులను హెచ్ఆర్సీ ఆదేశించింది. అయితే నివేదిక సమర్పించడంలో తహసీల్దార్ నిర్లక్ష్యం ప్రదర్శించారు. దీంతో ఈ నెల 13వ తేదీ ఉదయం 11గంటలకు తహసీల్దార్‌ను అరెస్టు చేసి కమిషన్ ఎదుట హాజరు పరచాలని హెచ్చార్సీ నల్లగొండ జిల్లా ఎస్పీని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
బాధితులు ఎక్కడున్నారో..
భూ వివాదాన్ని తహసీల్దార్ పరిష్కరించకపోవడంతో ఆంగోతు నిమ్మకు చెందిన నలుగురు కుమారుల్లో ఇద్దరు ఆంగోతు రాము, ఆంగోతు బాలాజీ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో ఆంగోతు బాలాజీ చనిపోయాడు. ఆంగోతు రాము క్యాన్సర్‌తో బాధపడుతూ మంచాన పడ్డారు. ఆంగోతు బాలాజీకి భార్య, పిల్లలు ఉన్నారు. ఆంగోతు రాముకు ఒక కుమారుడు ఉన్నట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ విషయంపై గ్రామంలో కొందరు గ్రామస్తులు మాట్లాడుతూ ఆంగోతు నిమ్మకు సంబంధించి సుమారు 50ఎకరాల భూమి ఉండేదని, కాని కొందరు నాయకులు నిమ్మను ప్రలోభ పెట్టి సుమారు 20ఎకరాలకు పైగా ఆక్రమించుకున్నారని నిమ్మ మనుమళ్లు ఆరోపిస్తున్నారు. తమ తాతకు ఇద్దరు భార్యలని, మొదటి భార్య లాకి కుమారుడు బిచ్యా, రెండో భార్య భీకి ముగ్గురు కుమారులు రాము, బాలాజీ, లక్ష్మణ్ ఉన్నారన్నారు. మొదటి భార్య కుమారుడికి ఏడెకరాల భూమి ఇస్తే, రెండో భార్య ముగ్గురు కుమారులకు కలిపి 18 ఎకరాల భూమి పంచినట్లు తెలిపారు. మిగతా భూమిని గ్రామంలోని బడా నాయకులు ఆక్రమించుకున్నారని నిమ్మ మనుమడు ఆంగోతు లక్పతి ఆరోపించారు. గత రికార్డులను పరిశీలించి మా తాత పేరు మీద ఉన్న భూమిని ఎవరెవరు కబ్జా చేశారో, కబ్జాదారుల నుంచి విడిపించి మా తాత వారసులకు ఇవ్వాలని రెవెన్యూ అధికారులకు, ప్రజాప్రతినిధులను వేడుకుంటున్నారు.
నేను ఎలాంటి తప్పు చేయలేదు
నేను 2024లో ఇన్చార్జి తహసీల్దార్‌గా బాధ్యతలు చేపట్టా. నాటి నుంచి నేటి వరకు ఏ ఒక్క ఫిర్యాదు దారుడు నన్ను కలిసి వారి సమస్య వివరించినా క్షుణ్ణంగా పరిశీలించి విచారణ జరిపి, న్యాయం చేస్తానని హామీ ఇచ్చా. 2023లో వచ్చిన ఫిర్యాదుకు, ఈ అరెస్టు వారెంట్‌కు, నాకు ఎలాంటి సంబంధం లేదు. అరెస్టు వారెంట్ రావడం బాధ కలిగించింది. వారెంట్ సమయంలోగా సంబంధిత వివరాలతో హెచ్చార్సీ ఎదుట హాజరవుతా.
-అనీల్, తహసీల్దార్, తిరుమలగిరి, సాగర్