– తన పుట్టినరోజున హాస్టల్ విద్యార్థులతో కలిసి అల్పాహారం
కోదాడ, ఆగస్టు 14 : తల్లిదండ్రులు ఎన్నో ఆశలు ఆకాంక్షలతో తమ పిల్లల భవిష్యత్ కోసం కష్టపడతారని, చెడు అలవాట్లకు దూరంగా నిర్దేశించిన లక్ష్యాలతో ఇష్టపడి చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. శుక్రవారం తన పుట్టినరోజు సందర్భంగా కోదాడలో ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహంలో విద్యార్థులతో కలిసి అల్పాహారం భుజించారు. ఈ సందర్భంగా వారిని ఆత్మీయంగా పలకరిస్తూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తాను కూడా చిలుకూరులో హైస్కూల్ స్థాయిలో ప్రభుత్వ హాస్టల్లోనే ఉండి చదువుకుని ఈ స్థాయికి వచ్చానని, అందువల్ల ఇక్కడి కష్టసుఖాలు ఎంటో వ్యక్తిగతంగా తెలిసిన వాడినని తెలిపారు.
ఆర్థికంగా వెనకబడిన కుటుంబాలని ఉండి వచ్చిన విద్యార్థులు కనుక తల్లిదండ్రుల కలలను నెరవేర్చాలన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, అబ్దుల్ కలాం లాంటి వారికి ఆర్థిక పరిస్థితులు లేనప్పటికీ కష్టపడి చదువుకుని దేశానికి ప్రతిష్ట తెచ్చిన విషయాన్ని విద్యార్థులకు గుర్తు చేశారు. సమాజాభివృద్ధిలో తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహించాలని, అవకాశం ఉన్నంత మేరకు నిరుపేద వర్గాలకు దోహద పడాలన్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నయీమ్, కౌన్సిలర్ చీమ నరేశ్, నాయకులు తుమ్మలపల్లి భాస్కర్, కరీముల్లా, బాబా, ఉపేందర్, ఇతర నాయకులు పాల్గొన్నారు. కాగా బీఆర్ఎస్వీ నియోజకవర్గ నాయకుడు వంశీ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.

ఇష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి : మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్