KTR | వెలుగుమట్ల పేదల భూముల పకనే కాంగ్రెస్ మంత్రుల విల్లాలు ఉన్నాయి. ఆ విల్లాలకు వ్యూ అడ్డు వస్తుందనే కారణంతో పేదల ఇండ్లు కూల్చారు. మంత్రుల బినామీలైన సురేశ్, కిశోర్, దామోదర్‌రావుకు చెందిన రియల్ ఎస్టేట్ లాభాల కోసమే ఈ విధ్వంసం సృష్టించారు.
-కేటీఆర్
హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై ఎమ్మెల్యేలుగా గెలిచి, కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న దానం నాగేందర్, కడియం శ్రీహరికి స్పీకర్ క్లీన్చిట్ ఇవ్వడంపై బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ నిర్ణయం కేవలం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే కాకుండా, ఓటర్ల తీర్పును ఘోరంగా అవమానించడమేనని మండిపడ్డారు. దానం నాగేందర్ బీఆర్ఎస్ బీ-ఫారంపై ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచి, కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసినా ఆయనపై అనర్హత వేటు వేయకపోవడం ఆశ్చర్యకరమని అన్నారు. అన్ని ఆధారాలు ఎన్నికల సంఘం వద్ద స్పష్టంగా ఉన్నప్పటికీ, ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రజాస్వామ్య చరిత్రలో ఒక ‘చీకటి రోజు’ అని అభివర్ణించారు. స్పీకర్ నిర్ణయం వెనుక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ తీవ్ర ఒత్తిడి ఉన్నదని కేటీఆర్ ఆరోపించారు.
‘రాహుల్ గాంధీకిగానీ, కాంగ్రెస్ పార్టీకిగానీ ఫిరాయింపుల గురించి మాట్లాడే కనీస నైతిక హకు లేదు. రాహుల్‌గాంధీకి కొంచెమైనా సిగ్గు, గౌరవం ఉంటే.. ఈ అప్రజాస్వామిక చర్యలపై ప్రజలకు సమాధానం చెప్పాల’ని డిమాండ్ చేశారు. తెలంగాణభవన్‌లో బుధవారం మాజీ మంత్రులు పువ్వాడ అజయ్, జోగు రామన్న, కర్నె ప్రభాకర్, తాతా మధు, విప్ వివేకానందగౌడ్, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, రాగిడి లక్ష్మారెడ్డి, తలసాని సాయికిరణ్యాదవ్తో కలిసి మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. పార్టీ ఫిరాయింపు కేసులో స్పీకర్ కార్యాలయం నుంచి ఆర్డర్ కాపీ ఇవ్వడానికి ఎందుకు భయపడుతున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. పార్టీ మారిన పది మందితో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని సవాల్ చేశారు. పది మంది అనర్హత పిటిషన్లపై ఇచ్చిన తీర్పు కాపీ రాగానే హైకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి న్యాయస్థానంలోనే దీనిపై తేల్చుకుంటామని, ప్రజలు ఇచ్చిన తీర్పును కాలరాసే అధికారం ఎవరికీ లేదని హెచ్చరించారు.
ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రజాస్వామ్య చరిత్రలో ఒక చీకటిరోజు. స్పీకర్ నిర్ణయం వెనుక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ తీవ్ర ఒత్తిడి ఉన్నది. రాహుల్‌గాంధీకి కొంచెమైనా సిగ్గు, గౌరవం ఉంటే.. ఈ అప్రజాస్వామిక చర్యలపై ప్రజలకు సమాధానం చెప్పాలి.
-కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ ఇచ్చిన తీర్పు అత్యంత అప్రజాస్వామికమని, దారుణమని కేటీఆర్ మండిపడ్డారు. రాహుల్‌గాంధీ ఆడిస్తున్న ఆటలో భాగంగానే తెలంగాణ స్పీకర్ ప్రసాద్‌కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. అసెంబ్లీ స్పీకర్‌పై రాహుల్‌గాంధీ నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉన్నదని, రాహుల్‌గాంధీ కూడా రాష్ట్రం నుంచి వస్తున్న అడ్డగోలు సంచుల కట్టల కోసం ఇలాంటి అనైతిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. శాసనసభ స్పీకర్ చేతుల్లో ఏమీ లేదని, మొత్తం కాంగ్రెస్ పార్టీనే ఈ ఫిరాయింపుల వ్యవహారాన్ని దగ్గరుండి నడిపించిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది ప్రజాస్వామ్యంపై, భారత రాజ్యాంగంపై దాడి అని, దీని వెనుక ఉన్న ప్రధాన నేరస్తుడు, ఆ నేరపూరిత ఆలోచన రాహుల్‌గాంధీదేనని, ఆయనే అసలు దోషి అని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాహుల్ అనుమతి లేకుండా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఇంతటి దారుణమైన నిర్ణయం తీసుకునే సాహసం చేయలేరని స్పష్టంచేశారు. స్వతంత్ర భారత చరిత్రలో ఏ స్పీకర్ కూడా ఇంత అద్భుతమైన నిర్ణయం తీసుకోలేదని ఎద్దేవా చేశారు.
అందుకే తాము స్పీకర్‌ను చప్పట్లతో, శాలువాలతో సతరిస్తామని అన్నారు. కాంగ్రెస్ నిర్ణయంతో రాహుల్‌గాంధీ జోకర్‌గా నిలిచిపోయారని అన్నారు. ఇలాంటి జోకర్లకు తెలంగాణ ప్రజలే సమాధానం చెప్తారని హెచ్చరించారు. ‘పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. పార్టీ ఫిరాయిస్తే ఆటోమేటిక్ డిస్వాలిఫికేషన్ అని రాహుల్‌గాంధీ చెప్పారు. తెలంగాణ వచ్చి న్యాయ పత్రాల గురించి ఉపన్యాసాలు దంచారు. ఈ రోజు స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై ఏం సమాధానం చెప్తారు? ఒక పార్టీ బీఫారంపై గెలిచిన ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ బీఫారంతో ఎంపీగా పోటీ చేసిన తర్వాత కూడా ఆ వ్యక్తిని అనర్హుడిగా ప్రకటించకుండా, విచారణ పేరుతో సాగదీసి ఆ ఎమ్మెల్యేకు అనుకూలంగా తీర్పు చెప్పడం అంటే అత్యంత దుర్మార్గం. అన్ని ఆధారాలు ఉన్నా అనర్హత పిటిషన్‌ను తిరసరించారంటే, కచ్చితంగా ఆయనను, ఆయనను నడిపిస్తున్న కాంగ్రెస్ నేతలను సతరించాల్సిందే’ అని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది ప్రజాస్వామ్యంపై, భారత రాజ్యాంగంపై దాడి. దీని వెనుక ఉన్న ప్రధాన నేరస్తుడు, ఆ నేరపూరిత ఆలోచన రాహుల్‌గాంధీదే. ఆయనే అసలు దోషి.
-కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్

పార్టీ ఫిరాయింపుల సంస్కృతి గురించి మాట్లాడే నైతిక హకు రాహుల్గాంధీకిగానీ, కాంగ్రెస్ పార్టీకిగానీ లేనే లేదని కేటీఆర్ స్పష్టంచేశారు. రాహుల్‌గాంధీ నాయనమ్మ ఇందిరాగాంధీ హర్యానాలో మొదలుపెట్టిన ఫిరాయింపుల రాజకీయం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు పాకిందని చెప్పారు. ఆయా రాం.. గయారాం సంస్కృతి సృష్టికర్త కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. 2004లో అప్పటి ఉమ్మడి రాష్ట్రం లో బీఆర్ఎస్ తరఫున 26 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే, 10 మందిని తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ కాదా? అని ప్రశ్నించారు. ఫిరాయింపులపై దానం నాగేందర్, కడియం శ్రీహరి చేసిన కామెంట్స్ చూస్తే నవ్వు వస్తున్నదని అన్నారు.
కడియం ఈరోజు పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కానీ, ఎలాంటి పరిస్థితుల్లో ఆయన బీఆర్ఎస్లోకి వచ్చారో అందరికీ తెలుసని, బీఆర్ఎస్ ఇచ్చిన గౌరవం, పదవులు ఏమిటో ఆయనే ప్రశ్నించుకోవాలని చురకలంటించారు. కడియం శ్రీహరికి బీఆర్ఎస్ చేసిన అన్యా యం ఏంటి? ఆయన 2013లో వచ్చినప్పుడు కేసీఆర్ ఆయనను ఎంపీని చేశారని గుర్తుచేశారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం, ఆపై ఎమ్మెల్సీ, ఆ తర్వాత ఎమ్మెల్యేని చేశారని, ఆయన కూతురికి ఎంపీ టికెట్ ఇచ్చారని తెలిపారు. ‘ఈ వయసులో ఇలాంటి మురికి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? ఇంత సిగ్గులేకుండా ఎందుకు బతకాలి? మీరు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు? నేను ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నాను, నాయకత్వంతోనే ఉన్నాను అని మీరు చెప్పారు. అందుకే అడుగుతున్నాను. ఈ థర్డ్ క్లాస్ మాటలు ఎందుకు?’ అని చురకలంటించారు.
హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో ఖైరతాబాద్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి స్పీకర్ గడ్డం ప్రసాద్‌రావు క్లీన్చిట్ ఇవ్వడం చూస్తే రాజ్యాంగాన్ని ఖననం చేసినట్టుగా భావించాల్సి ఉంటుందని రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ బీ-ఫామ్ మీద గెలిచిన ఎమ్మెల్యే, తరువాత కాంగ్రెస్ పార్టీ బీ-ఫారం మీద ఎంపీగా పోటీ చేసినప్పటికీ అనర్హత వేటు వేయకపోవడం ప్రజాస్వామ్య వ్యవస్థపై మాయని మచ్చగా నిలిచిందని ఆయన ఆరోపించారు. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు బాహాటంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం గర్హనీయమని పేర్కొన్నారు.
హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో ఖైరతాబాద్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ క్లీన్చిట్ ఇవ్వడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే అవుతుందని బీసీ కమిషన్ మాజీ సభ్యుడు సీహెచ్ ఉపేంద్ర బుధవారం ఒక ప్రకటనలో విమర్శించారు. స్పీకర్ నిర్ణయం ఆయన పదవికి మచ్చ తెచ్చే విధంగా, ఆయన గౌరవానికే భంగం కలిగించే విధంగా ఉన్నదని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు దానం, కడియం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొన్నప్పటికీ స్పీకర్ ఈ విధంగా తీర్పు ఇవ్వడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడే రాజకీయ నాయకులను వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు.