నీలగిరి, ఆగస్టు 8: వర్షాభావ పరిస్థితుల కారణంగా ప్రస్తుతం నాగార్జునసాగర్‌లో ఉన్న నీరు తాగునీటికే సరిపోతుందని, ఎట్టి పరిస్థితుల్లో వ్యవసాయానికి ఇవ్వలేమని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టంచేశారు. పైనుంచి వరద వచ్చే అవకాశం లేనందున రైతులు వరి వేయకుండా ఆరుతడి పంటలు వేసుకునేలా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.
ఒకవేళ నాగార్జునసాగర్ నిండినా చెరువులు నింపే పరిస్థితి లేదన్నారు. శనివారం నల్లగొండ కలెక్టరేట్లో జిల్లాస్థాయి సాగునీటి సలహా మండలి సమావేశంలో మంత్రి మాట్లాడారు. ప్రస్తుతం సాగర్ డెడ్ స్టోరేజ్‌లో ఉన్నదని, శ్రీశైలం నుంచి నీళ్లు వచ్చినా సాగుకు ఇచ్చే పరిస్థితి లేదని చెప్పారు. ఉన్న నీళ్లు జూన్ 2027 వరకు తాగునీటికే సరిపోతాయని చెప్పారు. ఏఎమ్మార్పీ కూడా సగమే నిండిందని గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదన్నారు. రాబోయే రోజుల్లో సూపర్ ఎల్ నినో కారణంగా దక్షిణ తెలంగాణలో పరిస్థితులెలా ఉంటాయో తెలియదన్నారు.