కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) బుధవారం విడుదల చేసిన నివేదికలో ఆందోళనకర నిజాలు వెలుగుచూశాయి. తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక స్థితి అప్పుల మూటపై సాగుతున్నదని, పన్ను ఆదాయాలు స్వల్పంగా పెరిగినా, అంతకుమించిన రెవెన్యూ వ్యయం అవుతున్నదని తేలింది. రోజువారీ ఆర్థిక వ్యవహారాలకు అప్పులపై ఆధారపడాల్సి వస్తున్నదని బయటపడింది. ఐదు నెలల్లో రాష్ట్ర ఆదాయం 32 శాతం ఉంటే, నికర అప్పు 58.65 శాతంగా నమోదైంది.
హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక స్థితి అప్పుల మూటపై సాగుతున్నది. పన్ను ఆదాయాలు స్వల్పంగా పెరిగినా, అంతకుమించి రెవెన్యూ వ్యయం అవుతున్నది. వచ్చే పన్ను ఆదాయానికి, వెచ్చించే ప్రభుత్వ ఖర్చులకు పొంతన కుదరడం లేదు. రెవెన్యూ ఖాతాలో భారీ లోటు నమోదైంది. మూలధన వ్యయం బడ్జెట్ అంచనాలతో పోలిస్తే ఇంకా తకువ స్థాయిలోనే ఉన్నది. పెన్షన్ల భారం, వడ్డీ చెల్లింపులు గణనీయంగా కొనసాగుతున్నాయి. ఈ విషయాలు ఆగస్టు నెల కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికలో వెల్లడయ్యాయి. బుధవారం విడుదలైన కాగ్ తాజా నివేదికలో ఆందోళనకర నిజాలు వెలుగుచూశాయి. 2026-27 బడ్జెట్లో మొత్తం రెవెన్యూ రాబడులను రూ.2,41,263.59 కోట్లుగా అంచనా వేశారు. కానీ ఆగస్టు నాటికి రూ.77,535.89 కోట్లు మాత్రమే సమకూరాయి. అంటే ఐదు నెలల్లో బడ్జెట్ అంచనాల్లో 32.14 శాతం మేర ఆదాయం వచ్చింది. అదే సమయంలో ఆగస్టు నాటికి ప్రభుత్వం తీసుకున్న నికర అప్పులు రూ.34,285 కోట్లకు చేరాయి. అంటే వార్షిక అప్పు లక్ష్యం 58.65 శాతానికి చేరింది. ఆగస్టు నాటికి మూలధన రాబడులు రూ.34, 304.66 కోట్లు కాగా, రూ.34, 285.21 కోట్లు నికర రుణాలు కావడం విశేషం. వార్షిక బడ్జెట్లో నికర రుణాల అంచనా రూ.58, 458.71 కోట్లు కాగా, ఆగస్టు నాటికే 58.65 శాతం మేర సమకూర్చారు. రాబడులు పెరుగుతున్నా రెవెన్యూ లోటు పూడ్చడం, ఖర్చును కొనసాగించడం కోసం అప్పులపై ఆధారపడాల్సి వస్తున్నది. కాగ్ నివేదిక ప్రకారం.. ఐదు నెలల్లో రాష్ట్ర ఆదాయం 32 శాతం ఉంటే, నికర అప్పు 58.65 శాతంగా నమోదైంది.
రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరైన పన్నుల ద్వారా ఆగస్టు నాటికి రూ.69, 097.42 కోట్లు వచ్చాయి. వార్షిక బడ్జెట్ అంచనా రూ.1,81,367.39 కోట్లలో ఇది 38.10 శాతం. జీఎస్టీ ద్వారా రూ.24, 750.77 కోట్లు, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.7,574.79 కోట్లు, సేల్స్ ట్యాక్స్ ద్వారా రూ.15,779.59 కోట్లు, ఎక్సైజ్ ద్వారా రూ.8,535.24 కోట్లు సమకూరాయి. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా రూ.8,945.85 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ అంశంలో బడ్జెట్ లక్ష్యం శాతం 40.32 నుంచి 37.11కు తగ్గింది. పన్నేతర ఆదాయాన్ని రూ.35,730.20 కోట్లుగా అంచనా వేశారు. అది ఆగస్టు నాటికి రూ.5,475.65 కోట్లు, అంటే 15.32 శాతం మాత్రమే వచ్చాయి. అయితే గత ఏడాది ఇదే కాలంలో రూ.1,578.44 కోట్లే రావడంతో వసూళ్లు గణనీయంగా పెరిగాయి. బడ్జెట్ లక్ష్యాన్ని అందుకోవాలంటే మిగిలిన నెలల్లో భారీ ఆదాయాన్ని సమీకరించాల్సి ఉంటుంది.
2026-27లో మూలధన వ్యయానికి రూ.47,267.28 కోట్లు కేటాయించగా.. ఆగస్టు నాటికి రూ.12,412.53 కోట్లు ఖర్చయ్యాయి. ఇది బడ్జెట్లో 26.26 శాతం మాత్రమే. వేతనాలను మినహాయించిన మూలధన ఖాతా వ్యయం రూ.46,308.85 కోట్ల బడ్జెట్ అంచనాకుగాను రూ.12,039. 04 కోట్లు మాత్రమే నమోదైంది. గత ఏడాది మూలధన వ్యయం రూ.13,921.18 కోట్లు ఉండటం గమనార్హం. రెవెన్యూ అవసరాలు, వడ్డీలు, పెన్షన్లు పెరుగుతున్న సమయంలో మౌలిక వసతులు, ఆస్తుల సృష్టికి ఉపయోగపడే మూలధన వ్యయం మాత్రం బడ్జెట్ లక్ష్యానికి చాలా దూరంగా ఉన్నది.
రెవెన్యూ రాబడులు, రుణాలు తదితరాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత కూడా ప్రభుత్వ ఆర్థిక పరిస్థితికి మరో సూచిక ప్రైమరీ డెఫిసిట్. ఆగస్టు నాటికి రూ.21,110.73 కోట్ల ప్రైమరీ లోటు నమోదైంది. 2026-27 బడ్జెట్లో ప్రైమరీ లోటు రూ.37,154.32 కోట్లుగా అంచనా వేయగా, ఐదు నెలల్లోనే 56.82 శాతం స్థాయికి చేరింది. పీఎస్యూల ద్వారా సమీకరించిన నిధులు, ప్రభుత్వ గ్యారెంటీలు, పబ్లిక్ అకౌంట్ వివరాలు ప్రభుత్వం నుంచి అందలేదని కాగ్ వెల్లడించింది. ఆగస్టు నాటికి రాబడులు రూ.1,11, 840.55 కోట్లు కాగా, వ్యయం రూ.1,04, 789.23 కోట్లుగా నమోదైంది. పైకి చూస్తే రాబడుల కంటే మొత్తం వ్యయం తకువగానే కనిపిస్తున్నది. ఈ లెకల్లో మూలధన రాబడులు, అప్పులు కూడా భాగంగానే ఉన్నాయి. అందువల్ల మొత్తం రాబడులు-వ్యయాల మధ్య వ్యత్యాసాన్ని చూసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉందని చెప్పడం సాధ్యం కాదు. అసలు ఒత్తిడి రెవెన్యూ ఖాతాలో కనిపిస్తున్నది. అకడ ఆదాయం రూ.77,535.89 కోట్లు ఉండగా, ఖర్చు రూ.92,376.70 కోట్లకు చేరింది. అంటే రెవెన్యూ ఆదాయం 32.14 శాతం ఉంటే.. రెవెన్యూ వ్యయం 39.41 శాతంగా నమోదు కావడం ఆర్థిక నిర్వహణ లోపాన్ని కాగ్ నివేదిక ఎత్తిచూపింది.

రాష్ట్ర బడ్జెట్లో రూ.6,857.76 కోట్ల రెవెన్యూ మిగులు ఉంటుందని ప్రతిపాదించారు. కానీ, ఆగస్టు నాటికే పరిస్థితి పూర్తి విరుద్ధంగా మారింది. రెవెన్యూ రాబడులు రూ.77,535.89 కోట్లు కాగా, రెవెన్యూ వ్యయం రూ.92,376.70 కోట్లకు చేరింది. ఫలితంగా రూ.14,840.81 కోట్ల రెవెన్యూ లోటు నమోదైంది. బడ్జెట్ అంచనాతో పోలిస్తే ఇది -216.41 శాతంగా నమోదైనట్టు కాగ్ నివేదిక స్పష్టంచేసింది. అంటే ఆదాయం కంటే రెవెన్యూ ఖర్చు గణనీయంగా ఎకువగా ఉన్నది. రాష్ట్ర రెవెన్యూ వ్యయంలో గమనించదగ్గ అంశాల్లో పెన్షన్ల భారం ఒకటి. 2026-27 బడ్జెట్లో పెన్షన్ల కోసం రూ.14,736.56 కోట్లు కేటాయించగా.. ఆగస్టు నాటికే రూ.12,487.73 కోట్లు ఖర్చయ్యాయి. బడ్జెట్లో 84.74 శాతం ఐదు నెలల్లోనే వినియోగమైంది. గత ఏడాది ఇదే కాలంలో ఈ శాతం 58.75 మాత్రమే. మిగిలిన నెలల్లో పెన్షన్ చెల్లింపు కోసం అదనపు ఆర్థిక ఒత్తిడి అంశాన్ని నివేదిక ఎత్తిచూపింది.
