గిరిజన బంధువు కేసీఆర్.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ఎన్నో పథకాలు అమలు
స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆదివాసీ, గిరిజనుల అభ్యున్నతి కోసం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బాటలు వేశారు. వినూత్నమైన ఆలోచనలు, విప్లవాత్మక పథకాలతో గిరిజన సంక్షేమానికి శ్రీకారం చుట్టారు. నిధుల కేటాయింపునకే కాదు.. వెచ్చించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. విద్య, ఉపాధి రంగాల్లో పెద్దపీట వేశారు.
- ఆదివాసీ సంక్షేమానికి రూ.37వేల కోట్లు ఖర్చు… 6లక్షల మందికి పోడుపట్టాలు
- గ్రామపంచాయతీలుగా తండాలు.. 10శాతానికి రిజర్వేషన్ పెంపు.. సర్వతోముఖాభివృద్ధికి ప్రత్యేక పథకాలు
- చేవెళ్ల డిక్లరేషన్ కాంగ్రెస్ దగా.. హామీలు అమలు చేయని దౌర్భాగ్యం.. ఉన్న భూములను లాక్కుంటున్న వైనం
స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆదివాసీ, గిరిజనుల అభ్యున్నతి కోసం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బాటలు వేశారు. వినూత్నమైన ఆలోచనలు, విప్లవాత్మక పథకాలతో గిరిజన సంక్షేమానికి శ్రీకారం చుట్టారు. నిధుల కేటాయింపునకే కాదు.. వెచ్చించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. విద్య, ఉపాధి రంగాల్లో పెద్దపీట వేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన నాటి నుంచి అడుగడుగునా గిరిజన విద్రోహ విధానాలను అమలు చేస్తున్నది. చేవెళ్ల డిక్లరేషన్ పేరిట ఎస్టీలకు ఇచ్చిన 12 హామీలను అమలు చేయడం అటుంచితే.. ఉన్న పథకాలకే మంగళం పలుకుతున్నది. నిధులను విడుదల చేయకుండా నిర్వీర్యం చేస్తున్నది. అదీగాక అరాచకాలకు పాల్పడుతున్నది. భూములనే లాక్కుంటున్నది.
– హైదరాబాద్, సెప్టెంబర్15 (నమస్తే తెలంగాణ)
గిరిజనాభివృద్ధికి కేసీఆర్ సర్కార్ చేసిన కృషి
రాష్ట్రవ్యాప్తంగా 500 జనాభా కలిగిన ప్రతి తండా, ఆదివాసీ గూడేన్ని ప్రత్యేక గ్రామ పంచాయతీగా ప్రకటించారు. మొత్తంగా 1326 తండాలు, 525 గూడెలను పంచాయతీలుగా నిర్ణయించారు. తద్వారా ఆయా వర్గాలకు చెందిన వారినే స్వయంపాలకులుగా చేశారు. అభివృద్ధికి బాటలు వేశారు.
- గిరిజనులకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ శాతాన్ని 6 నుంచి 10శాతానికి పెంచారు. 2022లో అసెంబ్లీలో తీర్మానించారు. ఉద్యోగ, విద్య, ఉపాధి రంగాల్లో అమలుకు శ్రీకారం చుట్టారు.

- హైదరాబాద్ నడిబొడ్డున అత్యంత ఖరీదైన స్థలాన్ని కేటాయించి బంజారాల, ఆదివాసీల ఆత్మగౌరవాన్ని సమున్నతంగా చాటేలా రూ.50కోట్లతో సంత్ సేవాలాల్ బంజారా భవన్, కుమ్రం భీం ఆదివాసీ భవన్లను నిర్మించారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.71 కోట్ల 95లక్షల వ్యయంతో 32ఆదివాసీ, బంజారాభవన్‌లను నిర్మించారు. 35నియోజకవర్గాల్లో రూ.47 కోట్లతో బంజారా భవన్ల నిర్మాణానికి ఉత్తర్వులు జారీ చేశారు.
- జోడేఘాట్‌లో కుమ్రంభీం, భద్రాచలం, మేడారం, సంక్షేమ భవన్లో గిరిజన, ఆదివాసీ మ్యూజియాలను నిర్మించారు.
- గోండ్, నాయక్‌పోడ్ పెయింటింగ్స్, కోయ, కోలం, నాయకపోడ్ దారు, వెదురు కళా రూపాలు, బంజారా ఎంబ్రాయిడరీ, నగల రూపకల్పనకు ప్రాచుర్యం కల్పించింది. గిరిజన పరిశోధనా సంస్థ ద్వారా గిరిజనుల కళాకారులకు శిక్షణ ఇప్పించడంతోపాటు, దేశవ్యాప్తంగా 116 ట్రైఫెడ్ విక్రయశాలల్లో తెలంగాణ గిరిజన హస్తకళా ఖండాలను విక్రయించేందుకు చర్యలు చేపట్టింది.
- గిరిజనుల విద్యాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యమిచ్చింది. బాలబాలికలకు వేర్వేరుగా మొత్తంగా ఎస్టీల కోసం 183 గురుకులాలను నెలకొల్పింది. రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలను నెలకొల్పింది. 5వ తరగతి నుంచి డిగ్రీ వరకు ఉచితంగా విద్యను అందిస్తున్నది.
- ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ గురుకులాలను నిర్వహించడంతోపాటు రాష్ట్రం ఏర్పాటు నుంచి 2023వరకు ఎస్టీలకు 2091కోట్లను వెచ్చించింది. హాస్టల్ విద్యార్థులకు నెలకు రూ.500చొప్పున ప్యాకెట్ మనీ అందించింది.

- 24సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ల ద్వారా ఏటా 1140 మంది విద్యార్థులకు ఐఐటీ, జేఈఈ, నీట్ తదితర జాతీయ పోటీ పరీక్షలను తర్ఫీదునిచ్చింది. తద్వారా 700మందికిపైగా ఎంబీబీఎస్ సీట్లు, 400మంది ఎన్ఐటీ సీట్లను సాధించారు. ఉన్నత విద్యాసంస్థల్లో అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు రూ.50వేల నగదు, ల్యాప్‌టాప్‌లను ప్రోత్సాహకంగా అందించింది.
- అంబేద్కర్ ఓవర్సీస్ స్కీమ్ ద్వారా విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే ఎస్టీ విద్యార్థులకు రూ.20లక్షల ఆర్థిక సాయాన్ని, ఒకసారి ప్రయాణానికి అయ్యే ఖర్చుల కోసం అదనంగా గరిష్ఠంగా రూ.50వేలను అందించింది.
- 2023వరకు స్కీమ్ ద్వారా 260మంది ఎస్టీలకు ఆర్థిక సాయాన్ని అందజేసింది.
- గుడుంబాను నిషేధించడం. తయారీదారులకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపింది. 1034 కుటుంబాలకు పునరావాసం కల్పించింది.
- రాష్ట్ర ఏర్పాటు అనంతరం దాదాపు 6లక్షల మందికిపైగా గిరిజన, ఆదివాసీలకు పోడు పట్టాలను పంపిణీ చేసింది.
- ఎస్టీ నివాస గృహాలకు గతంలో 50యూనిట్లు ఉచితంగా సప్లయ్ చేస్తుండగా కేసీఆర్ ప్రభుత్వం దానిని 101 యూనిట్లకు పెంచింది. లక్ష ఎస్టీ ఇండ్లకు రూ.193కోట్లను రాయితీగా అందించింది.
- 20,888 ఎస్టీలకు రూ.135కోట్లను సబ్సిడీ రుణాలుగా అందజేసింది.
- గిరిజనుల వ్యవసాయ భూముల అభివృద్ధికి, సాగునీరు, త్రీఫేజ్ విద్యుత్ సౌకర్యం కల్పించింది.
- ప్రత్యేక సంక్షేమనిధిని సైతం ఏర్పాటుచేసి విద్య, జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో ప్రతిభ చూపిన ఎస్టీలకు ఆర్థిక సాయం అందించింది. అందుకు ఆదాయ పరిమితి కూడా 5లక్షలకు పెంచింది.
- ఎస్టీలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనే సంకల్పంతో బీఆర్ఎస్ ప్రభుత్వం వారికి అవసరమైన ప్రోత్సాహాన్ని అందిస్తూ, రాయితీలు కల్పించింది. రాష్ట్రంలోని అన్ని ఇండస్ట్రియల్ పార్కుల్లో ఎస్టీలకు 9.34 శాతం స్థలాలను రిజర్వ్ చేసి దేశంలో రికార్డు సృష్టించింది.
- ఎస్టీ వర్గాల ఔత్సాహికులకు స్టేట్ ప్రోగ్రామ్ ఫర్ రాపిడ్ ఇంక్యుబేషన్ ఆఫ్ ఎస్సీ ఎంటర్‌ప్రెన్యూర్స్ (టీఎస్ ప్రైడ్) అనే వినూత్న కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎస్టీలు స్థాపించే పరిశ్రమలకు ఒక్కో యూనిట్‌కు ఇచ్చే విద్యుత్ సబ్సిడీని రూపాయి నుంచి రూపాయిన్నరకు పెంచారు. ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ ద్వారా పరిశ్రమల స్థాపనకయ్యే ఖర్చులో ఎస్టీలకు 35 శాతం సబ్సిడీని గరిష్ఠంగా రూ.75 లక్షల వరకు అందజేసింది.
- ఎస్టీ మహిళా పారిశ్రామికవేత్తలకిచ్చే సబ్సిడీని 10 శాతం పెంచి 45శాతం చేసింది. సేల్స్ టాక్స్ మినహాయింపును 50 నుంచి 100 శాతానికి పెంచారు. టీఎస్ ప్రైడ్ ద్వారా 1,929 మంది ఎస్టీలకు రూ.87.21 కోట్లు మంజూరు చేసింది.
- అభివృద్ధి పనుల కాంట్రాక్టుల్లో ఎస్టీ కాంట్రాక్టర్లకు ప్రభుత్వం రిజర్వేషన్ కల్పించి దేశానికే రోల్‌మోడల్‌గా తెలంగాణ నిలిచింది.
- గిరిజన ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ఇన్నోవేషన్ (సీఎం ఎస్టీఈఐ) పథకం ప్రవేశపెట్టి వందలాది మంది గిరిపుత్రులను యువ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దింది. ఏడాదికి 100 మంది చొప్పున ఎంపిక చేసి వారికి వ్యాపార, పారిశ్రామిక మెళకువలు నేర్పించింది.
- ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు పక్కదారి పట్టకుండా ఉండేందుకు, మిగిలిపోయిన నిధులను తదుపరి సంవత్సరానికి బదిలీ చేసి ఖర్చు చేసేందుకు ప్రత్యేకంగా 2017లో చట్టం చేసింది.

పథకం : ఎస్టీ స్టడీ సర్కిళ్లు
- గిరిజన యువతకు సివిల్స్, గ్రూప్స్ తదితర పోటీపరీక్షలకు 12స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేసింది. ఉపాధి కోసం యూత్ ట్రైనింగ్ సెంటర్లు (వైటీసీ) నెలకొల్పింది.
- గిరిజన బాలికల్లో రక్తహీనతను తగ్గించడం, పౌష్టికాహార లేమిని నివారించడం కోసం గిరిపోషణ పథకానికి శ్రీకారం చుట్టింది.
ఎస్టీల అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తం 37 వేల కోట్లు

చేవెళ్ల డిక్లరేషన్‌కు కాంగ్రెస్ పాతర
చేవెళ్ల డిక్లరేషన్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజన, ఆదివాసీలకు ప్రముఖంగా 12హామీలను ఇచ్చింది. వాటి అమలు సంగతి పక్కనుంచితే కేసీఆర్ అమలు చేసిన పథకాలకే కాంగ్రెస్ మంగళం పలికింది.
- కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మంత్రివర్గంలో లంబాడీ వర్గానికి ప్రాతినిధ్యం కల్పించకుండా ధోకా చేసింది.
- ఎస్టీలకు సైతం దళితబంధును అమలు చేస్తామని, అంబేద్కర్ అభయహస్తం పేరిట 12లక్షల ఆర్థిక సాయం అందిస్తామని చెప్పి మాట తప్పింది.
- ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్టీలకు 12శాతం ప్రత్యేక రిజర్వేషన్లు అమలు చేస్తామని, ప్రైవేట్ విద్యాసంస్థల్లో, ప్రభుత్వ ప్రోత్సాహకాలను పొందే పరిశ్రమల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. కానీ అదీ అమలు చేయడం లేదు.
- ఇండ్లు లేని ఎస్టీలకు స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి రూ.6లక్షలను అందిస్తామని ప్రకటించింది. కానీ ఇండ్ల జాగలు ఇవ్వలేమని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మన్ననూరు వేదికగా ప్రకటించారు. అందరితోపాటు రూ.5లక్షల ఆర్థిక సాయాన్ని మాత్రమే అందిస్తూ మొండిచేయి చూపారు.
- 3 ఎస్టీ కార్పొరేషన్ల తుకారాం ఆదివాసీ, సంత్ సేవాలాల్ లంబాడీ, ఎరుకుల కార్పొరేషన్లను ఏర్పాటు చేసి ప్రతి ఏటా రూ.500 కోట్ల నిధులు మంజూరు చేస్తామని ప్రగల్భాలు పలికింది. కార్పొరేషన్ ఏర్పాటు చేసినా నిధులు విడుదల చేసింది లేదు. విధివిధానాలను ఖరారు చేసింది లేదు. కేవలం ఉత్తర్వులిచ్చి చేతులు దులుపుకొన్నది.
- ఎస్టీ విద్యార్థులు పదో తరగతి పాసైతే రూ.10వేలు, ఇంటర్ పాసయితే 15వేలు, డిగ్రీ పూర్తి చేస్తే 25వేలు, పీజీ పూర్తి చేస్తే రూ.లక్ష, ఎంఫిల్, పీహెచ్డీ పూర్తి చేస్తే రూ.లక్ష అందిస్తామనే హామీ నీటిమీది రాతగానే మిగిలింది.
- సమ్మక సారక గ్రామీణ అభివృద్ధి పథకం కింద రాష్ట్రంలోని ప్రతి గిరిజన గూడెం, తండాల గ్రామపంచాయతీలకు ఏటా 25 లక్షలు ప్రత్యేక విధి కింద ఇస్తామన్న హామీ అటకెక్కింది.
- మైదాన ప్రాంత గిరిజనుల అభివృద్ధికి 5 జిల్లాల్లో ఐటీడీఏలను ఏర్పాటు చేసి ఒకో దానికి రూ.500 కోట్లు చొప్పున ఏడాదికి 2,500 కోట్లు మంజూరు ఉత్తముచ్చటగానే మిగిలింది.
- గిరిజనులకు ఇచ్చిన అసైన్డ్ భూములను కాపాడి గిరిజనులకే హకులు కల్పిస్తామనేది, ఎకడైనా భూములను లాకుంటే 2013 చట్టం ప్రకారం నష్టపరిహారం ఇస్తామన్నది హామీగానే మిగిలిపోయింది. 7 లక్షలకు పైగా పోడు భూములకు హకులు కల్పిస్తామన్నది హామీగానే మిగిలిపోయింది.
ట్రైకార్ నిధులివ్వని వైనం
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ట్రైకార్ (ట్రైబ్స్ కో ఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్) ద్వారా గిరిజనులకు సబ్సిడీ రుణాలను మంజూరు చేసింది. 30 వేల మందిని లబ్ధిదారులుగా గుర్తించి రూ.265 కోట్లను సబ్సిడీ రుణాలుగా అందివ్వాలని నిర్ణయించింది. చెకులను సిద్ధం చేసి క్లియరెన్స్ కోసం ఆర్థిక శాఖకు పంపింది. అందులో గత బీఆర్ఎస్ హయాంలోనే దాదాపు 45.81కోట్ల నిధులను విడుదల చేసింది. 219.19కోట్ల నిధులను విడుదల చేయాల్సి ఉంది. ఈ క్రమంలో ఎన్నికలు రాగా, ఆ నిధుల ప్రక్రియ అక్కడితో నిలిచిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నిధులను మంజూరు చేస్తామని చెప్పడమే తప్ప ఇప్పటికీ ఇవ్వని దుస్థితి.
సబ్‌ప్లాన్ నిధులు పక్కదారి
కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను పక్కదారి పట్టిస్తున్నది. కేటాయించిన నిధుల్లో సగం కూడా ఖర్చుచేయని పరిస్థితి. 2024-25 బడ్జెట్లో ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్‌కు రూ.17,056 కోట్లు కేటాయించింది. ఆ నిధుల్లో 9773కోట్లు (57.30శాతం) మాత్రమే వెచ్చింది. ఆ నిధులను దారి మళ్లిస్తున్నదని గిరిజన, ఆదివాసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి.
2024-25 ఆర్థిక సంవత్సరంలో పలు కీలక పథకాల వారీగా ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల కేటాయింపు.. ఖర్చు (కోట్లలో)

ఆదివాసీ, గిరిజనులపై పెరిగిన దాడులు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఆదివాసీ, గిరిజనులపై ఏటికేడు దాడులు పెరిగిపోతున్నాయి. కేసుల నమోదు సంఖ్య రెట్టింపయ్యాయి. భూసేకరణ సందర్భంగా లగచర్ల పరిసర తండాల్లో గిరిజనులపై అత్యంత అమానవీయంగా ప్రభుత్వం వ్యవహరించింది. భూములను గుంజుకునేందుకు పూనుకున్నది. ఇక పోడు రైతులపై వేధింపులను రెట్టింపు చేసింది. అటవీశాఖ అధికారుల దాడులు పెరిగిపోయాయి. పోడుభూములకు సైతం కంచెలను ఏర్పాటు చేస్తున్నది. ఇదిలా ఉంటే కుమ్రం భీం కన్జర్వేషన్ కారిడార్ పేరిట జీవో 49ను తీసుకొచ్చింది. ఐదో షెడ్యూల్ ప్రాంతానికి సంబంధించి రాజ్యాంగంలో పొందుపరిచిన 1/70, పెసా చట్టాలను, ఆదివాసీల అస్తిత్వాన్ని, సంస్కృతీసంప్రదాయాలు, ఆదివాసీల హకులను కాలరాసేందుకు పూనుకున్నది. వ్యతిరేకత వెల్లువెత్తడంతో జీవో అమలును తాత్కాలికంగా నిలిపివేసింది
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

