హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): ఈ నెల 30 వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగిస్తామని ప్రభుత్వం చెప్పిందని, ఆదివారాలతోపాటు కనీసం 31వ తేదీ వరకు అయినా నిర్వహించాలని తాము డిమాండ్ చేశామని బీఆర్ఎస్ఎల్పీ ఉప నేత హరీశ్‌రావు చెప్పారు. 30 వరకు మాత్రమే అంటే, అందులో రెండు ఆదివారాలు, మూడు పండుగలు పోతే ఇక మిగిలేది ఎన్ని రోజులని నిలదీశామని తెలిపారు. కచ్చితంగా అసెంబ్లీ పని దినాలు పెంచాలని తాము కోరితే, సీఎంతో మాట్లాడి చెప్తామన్నారని వెల్లడించారు. సోమవారం బీఏసీ సమావేశం అనంతరం బీఆర్ఎల్సీ కార్యాలయంలో హరీశ్‌రావు మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.
బడ్జెట్ సెషన్స్ కనీసం 10 రోజులైనా నడుపకపోవడం దుర్మార్గమని విమర్శించారు. ‘ఈరోజు అంటే 16న గవర్నర్ ప్రసంగం, 17, 18 తేదీల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ, 19న ఉగాది సెలవు, 20న బడ్జెట్. 21న రంజాన్ సెలవు, 22న ఆదివారం, 23, 24, 25, 26 తేదీల్లో బడ్జెట్‌పై చర్చలు, 27న శ్రీరామనవమి సెలవు, 28న బిల్లు, 29న ఆదివారం, 30న బిల్లుల ఆమోదం ఉంటుందని స్పీకర్ చెప్పారని వివరించారు. ‘బడ్జెట్‌పై చర్చించేందుకు నాలుగు రోజులు ఎలా సరిపోతాయి? ఆదివారాలు కూడా అసెంబ్లీ పెట్టాలి. కనీసం మార్చి 31వ తేదీ వరకు సభ కొనసాగించాలని డిమాండ్ చేశాం’ అని హరీశ్ పేర్కొన్నారు.
హౌస్ కమిటీలు ఎప్పుడు వేస్తరు?
హౌస్ కమిటీల ఏర్పాటు ఇప్పటికే ఆలస్యమైందని, ఎప్పుడు నియమిస్తారని తాము నిలదీసినట్టు హరీశ్‌రావు చెప్పారు. త్వరలో వేస్తామని మాట ఇచ్చారని తెలిపారు. ప్రతిరోజూ క్వశ్చన్ అవర్ పెట్టాలని తాము డిమాండ్ చేయగా, మంగళవారం ఒక్కరోజు మినహా ప్రతిరోజూ నిర్వహిస్తామని చెప్పినట్టు పేర్కొన్నారు. ‘గతంలో సమావేశాలు ఉదయం 8.30 గంటలకే ప్రారంభమయ్యేవి. బీఆర్ఎస్ హయాంలో 9 గంటల నుంచి నిర్వహించాం. కాంగ్రెస్ సర్కార్ దానిని 10 గంటలకు మార్చింది. 9 గంటలకే సభ ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలి’ అని స్పీకర్‌ను కోరినట్టు చెప్పారు. ఆరు గ్యారెంటీల అమలుపై ప్రైవేటు మెంబర్ బిల్లుకు అవకాశం ఇవ్వాలని, బీఆర్ఎస్ పార్టీ తరపున ఇద్దరికి మాట్లాడే అవకాశం ఇవ్వాలని స్పీకర్‌ను కోరినట్టు గుర్తుచేశారు. బీఆర్ఎస్ సభ్యులు మాట్లాడుతుంటే మధ్యలో మంత్రులు అడ్డుతగులకుండా కంట్రోల్ చేస్తానని స్పీకర్ హామీ ఇచ్చారని పేర్కొన్నారు.
బీఏసీ మినిట్స్ ఫాలో కావాలి
బీఏసీ మినిట్స్ ఫాలో కాకపోతే వచ్చే బీఏసీని బాయ్‌కాట్ చేస్తామని స్పీకర్‌కు చెప్పినట్టు హరీశ్‌రావు పేర్కొన్నారు. సభలో ముఖ్యమంత్రి అనేక అబద్ధాలు మాట్లాడుతూ అసెంబ్లీ గౌరవాన్ని దెబ్బతీస్తున్నారని, ఇందుకు సీఎం రేవంత్‌రెడ్డి తక్షణమే ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరినట్టు పేర్కొన్నారు. ప్రివిలేజ్ మోషన్స్ తీసుకునేది డిప్యూటీ స్పీకర్ అని, ఈ విషయంలో స్పీకర్ బాధ్యత తీసుకోవాలని కోరినట్టు చెప్పారు. అసెంబ్లీ గ్రంథాలయం దారుణంగా ఉన్నదని బీఏసీలో ప్రభుత్వానికి సూచించామని తెలిపారు. 19 అంశాలపై చర్చించాలని కోరినట్టు వెల్లడించారు.