హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 16(నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డ్రీమ్ ప్రాజెక్టు మూసీ పునర్జీవం పారదర్శకతకు పాతరేసిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాజెక్టుపై ప్రకటన మొదలు ఇటీవల మధు పార్క్ రిడ్జ్ దాకా గుర్తించిన హద్దులతో పాటు గాంధీ సరోవర్ ప్రాజెక్టు నోటిఫికేషన్లో రెండు జలాశయాల కింద గుర్తించిన సర్వే నెంబర్లలోని భూముల వరకు అన్ని వాస్తవాలను తొక్కిపెట్టినట్టు తెలుస్తున్నది. మూసీ రివర్‌ఫ్రంట్ పేరుతో స్టార్ హోటల్లో ఏర్పాటచేసిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ కూడా జనాల్లో లేని పోని అనుమానాలకు తావిచ్చేలా మారింది. సమగ్ర వివరాలను పొందుపర్చకుండా, కేవలం ఏఐ ఆధారిత గ్రాఫికల్ వీడియోలతో రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ సంస్థలను ఆకట్టుకోవడమే లక్ష్యంగా పీపీటీ ప్రదర్శన జరిగిందే తప్ప.. ఈ ప్రాజెక్టుతో ప్రభావితమయ్యేది ఎందరు?
అసలు మూసీ నది హద్దులు? ఎన్ని మీటర్ల దూరంలో బఫర్ జోన్ ఉంటుందనే విషయాలపై ఎక్కడా చర్చించలేదు. ఏడాది పాటు అధ్యయనం చేశాకే ప్రాజెక్టును చేపడుతున్నామని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించినప్పటికీ, ప్రాజెక్టు అధికారిక సమాచారాన్ని అందుబాటులో పెట్టలేదు. కనీసం ఆర్టీఐ కింద సమాచారం అడిగినా స్పందించకుండా వేధించడం పర్యావరణవేత్తల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నది. మెరుగైన మౌలిక వసతులు కల్పించేలా ప్రాజెక్టును తీర్చిదిద్దుతామన్న ప్రకటనలకు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలకు పొంతన కుదరడం లేదు. ముఖ్యంగా మూసీ నదిపై 3వేల ఎకరాల విస్తీర్ణంలో చేపట్టే గాంధీ సరోవర్ డిజైన్లు, సుందరీకరణ కోసం రెండు జంట జలాశయాలకు 500 మీటర్ల నిషేధిత ప్రాంతం వివరాలు, నదీ గర్భం, ఫుల్ రివర్ లెవల్, బఫర్ జోన్ వంటి కీలకమైన అంశాలను కూడా ఎక్కడ గుర్తించారనే విషయాన్ని ఇప్పటికీ స్పష్టం చేయలేదు. కానీ సర్కార్ మూసీ వెంబడి కనిపించిన ఇండ్లకు, నిర్మాణాలకు నోటీసులు ఇస్తున్నదే తప్ప.. ఎక్కడా నదికి ఎంత దూరంలో బఫర్ జోన్ ఉంటుందనే విషయాన్ని స్పష్టం చేయలేదు.
రివర్బెడ్ ఎక్కడ.. బఫర్ జోన్ ఎంతదూరం?
శాస్త్రీయంగా హద్దులను గుర్తించాల్సింది పోయి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటివరకు బఫర్ జోన్‌పై హద్దుల నిర్ధారణ జరుగలేదనే ఆరోపణలు ఉన్నాయి. నది నుంచి ఎంత దూరంలో రివర్బెడ్ ఉంది?, అక్కడినుంచి ఎంతదూరం వరకు ఎఫ్ఆర్ఎల్ వస్తుంది?, 50మీటర్ల బఫర్ జోన్ అంటూ ఊదరగొడుతున్న సర్కా ర్.. ఎక్కడ? ఎలా గుర్తించిందనే అంశాలపై శాస్త్రీయ ఆధారాలను వెల్లడించలేదు. కేవలం 50 మీటర్ల వెడల్పుతో హద్దులను నిర్ణయించి, మరోచోట ఏకంగా 500 మీటర్ల ఉన్న భూములకు నోటీసులు జారీ చేయడమే మూసీ డిజైన్లపై ఉన్న అనుమానాలకు కారణం అవుతున్నది. కనీసం నది సహజ ప్రవాహాన్ని కూడా పరిగణనలోకి తీసుకోకుండా హద్దులను ఎలా నిర్ధారిస్తారని పర్యావరణవేత్తలు ప్రశ్నిస్తున్నారు.
కేఎంఎల్ మ్యాప్‌లూ ఎక్కడ?
ఏదైనా ఒక ప్రాజెక్టు పారదర్శకంగా చేపట్టాలంటే ముందుగా దాని హద్దులు, ఎఫ్ఆర్ఎల్, బఫర్ జోన్ వివరాలతో కేఎంఎల్(కీహోల్ మార్కప్ లాంగ్వేజ్) ఫైల్‌ను పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. కానీ మూసీ విషయంలో ప్రభుత్వం అత్యంత గోప్యత పాటిస్తున్నది. మ్యాపులు లేకుండానే మార్కింగ్ చేసి, అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్నామని చెబుతున్నారు. దానికి అనుగుణంగా నోటీసులు, నోటిఫికేషన్ల పేరిట హడావుడి చేస్తున్నారు. కానీ ఏ ప్రాతిపదికన మార్కింగ్ చేస్తున్నారో, ఎవరికీ అర్థం కానీ పరిస్థితి నెలకొని ఉంది. కేఎంఎల్ ఫైల్‌ను ప్రజలకు అందుబాటులో ఉంచకపోవడం వెనుక భారీ కుట్ర జరుగుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంతుచిక్కని అంశాలపై ఎవరు స్పష్టతనిస్తారని పర్యావరణవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆర్టీఐకి దొరకని వివరాలు
ఇవే విషయాలను అధికారికంగా వెల్లడించాలని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసినా ఇప్పటివరకు ప్రభుత్వం వెల్లడించలేదని పర్యావరణవేత్త లుబ్నా సార్వత్ ఆరోపించారు. పారదర్శకత గురించే మాట్లాడే సీఎం.. నది గర్భాన్ని నిర్ధారించే హైడ్రాలాజికల్ సర్వే రిపోర్ట్, 50మీటర్ల బఫర్ జోన్ నిర్ధారణ, 500 మీటర్ల నిషేధిత ప్రాంతాన్ని ఏ ప్రాతిపదికన చేశారనేది చెప్పకుండా దాచిపెడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. మూసీ పునర్జీవంపై ఏడాది కిందట వివిధ సంస్థలతో జరిపిన చర్చల మినిట్స్‌పై ఎందుకు సమాచారం ఇవ్వడం లేదని, పవర్ పాయింట్ ప్రజంటేషన్‌లోనూ మూసీ అధికారిక వెబ్సైట్లో ఎందుకు పొందుపరచలేదని ఆయన ప్రశ్నిస్తున్నారు.