KTR | సంగారెడ్డి : లగచర్ల ఘటనలో కాంగ్రెస్ కార్యకర్తలను వదిలేసి కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలనే జైల్లో వేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. అధికారులపై దాడికి పాల్పడ్డ వారిలో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఉన్నారని కేటీఆర్ తెలిపారు. సంగారెడ్డి జైల్లో లగచర్ల రైతన్నలతో కేటీఆర్ శుక్రవారం ములాఖత్ అయ్యారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. తమ భూములు తమకే ఉండాలని లగచర్ల రైతులు పోరాడుతున్నారు. మార్కెట్లో ఎకరం రూ. 70 లక్షల విలువ ఉన్న భూములను అడ్డికి పావుశేరుకు రియల్ ఎస్టేట్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం గుంజేసుకుంటుందని రైతులు చెబుతున్నారు. కేవలం ఎకరం భూమి రూ. 10 లక్షలకు గుంజేసుకుంటున్నారని రైతులు బాధపడుతున్నారు.
ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా రైతులు 9 నెలలగా పోరాటం చేస్తున్నారు. లగచర్ల, హకీంపేటతో పాటు మరో రెండు తండాల ఆడబిడ్డలు రోదిస్తున్నారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణలో రేవంత్ రెడ్డి రాబందు మాదిరిగా వ్యవహరిస్తున్నారు. ఫార్మా కంపెనీలు కాలుష్యమని ఆయన ప్రచారం చేశారు. అదే ఫార్మాను కొడంగల్ తెస్తా.. 3 వేల ఎకరాలు రావాలని పేదల భూములు గంజుకుంటున్నారు. దీంతో స్థానిక రైతులు మర్లబడ్డారు. 9 నెలలుగా పోరాటం చేస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు. అధికారుల ముందు నిరసన తెలిపితే దాడుల పేరిట అరెస్టులు చేసి జైల్లో వేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.
ఇవాళ లగచర్లలో దుర్మార్గమైన పరిస్థితి నెలకొని ఉంది. కులగణనలో పాల్గొని వచ్చిన పంచాయతీ సెక్రటరీని కూడా అరెస్టు చేసి జైల్లో వేశారు. ఆ సంఘటనలో పాల్గొనలేదు.. అయినా తనను జైల్లో వేశారని ఆ యువకుడు చెబుతున్నాడు. ఇంకో యువకుడు వనపర్తిలో చదవుకుంటున్నాడు. ఈ ఘటన గురించి తెలుసుకుని మా ఇంటి వాళ్లు ఎలా ఉన్నారో అని వస్తే నన్ను కూడా తీసుకెళ్లారని చెప్పారు. 70 మందిని అరెస్టు చేసి రెండు డీసీఎంలలో తీసుకెళ్లారని చెప్పారని కేటీఆర్ తెలిపారు.
దుద్యాల మండల పార్టీ అధ్యక్షుడు శేఖర్ అనుచరులు కూడా ఈ దాడుల్లో పాల్గొన్నారు. వారి భూములు కూడా ఈ ఫార్మా విలేజ్లో పోతున్నాయి. రమేశ్, నర్సింహులు, రాములు అనే కాంగ్రెస్ కార్యకర్తలు కూడా దాడులు చేశారు. 70 మందిని తీసుకెళ్తే.. తిరుపతి రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ కార్యకర్తలను వదిలేశారట. బీఆర్ఎస్ వాళ్లు 21 మందిని రిమాండ్కు పంపి.. మిగతా వారిని ఇంటికి పంపించచారట. కేవలం బీఆర్ఎస్ వాళ్లనే మాత్రమే జైల్లో పెట్టాలని అనుముల తిరుపతి రెడ్డి ఆదేశాలు ఇచ్చారట. ఎలాంటి పదవి లేని తిరుపతి రెడ్డికి అధికారులు, పోలీసులు మోకరిల్లుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి..
Lingaiah Yadav | రాష్ట్రంలో కాంగ్రెస్ అరాచకాలకు హద్దులేకుండా పోయింది : మాజీ ఎంపీ బడుగుల
Nirmal | ఖానాపూర్ అడవుల్లో పెద్దపులి సంచారం : వీడియో
Maoists | సీఎం రేవంత్ రెడ్డి భూదాహానికి వ్యతిరేకంగా.. మావోయిస్టుల సంచలన లేఖ