హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ) : విద్యుత్తు వినియోగంలో రాష్ట్రం గత రికార్డులను బ్రేక్ చేస్తున్నది. తాజాగా 18వేల మెగావాట్ల మార్క్‌ను అధిగమించింది. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా గరిష్ఠ డిమాండ్ 18,139 మెగావాట్లుగా నమోదైంది. ఉదయం 11:01 గంటలకు ఇది నమోదైనట్టు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఒక ప్రకటనలో తెలిపారు. ఇంత డిమాండ్ నమోదైనా ఎలాంటి అంతరాయం కలుగకుండా రాష్ట్ర ప్రజలకు సమర్థంగా విద్యుత్తు అందించగలిగామని పేర్కొన్నారు. ఈ మైలురాయిని అధిగమించడంలో భాగస్వాములైన విద్యుత్తు ఇంజినీర్లు, సిబ్బందిని ఆయన అభినందించారు. నిరుడు ఇదే రోజు(మార్చి 3న) రాష్ట్ర గరిష్ఠ డిమాండ్ 16,311 మెగావాట్లు కాగా, సంవత్సరంలోనే సుమారు 2 వేల మెగావాట్లు పెరగడం గమనార్హం.
మధ్యప్రదేశ్, రాజస్థాన్ సరసన..
విద్యుత్తు గరిష్ఠ డిమాండ్ విషయంలో మన రాష్ట్రం.. పెద్ద రాష్ర్టాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్ల సరసన చేరింది. మధ్యప్రదేశ్ గరిష్ఠ డిమాండ్ 19,900 మెగావాట్లు కాగా, రాజస్థాన్‌లో 19,600 మెగావాట్లుగా ఉన్నది. ఇక పారిశ్రామిక రాష్ర్టాలైన హర్యానా, ఛత్తీస్‌గఢ్, పంజాబ్, జార్ఖండ్ వంటి రాష్ర్టాలనూ మించి తెలంగాణ గరిష్ఠ డిమాండ్‌ను నమోదు చేస్తున్నది. ఆదివారం రాష్ట్రంలో గరిష్ఠ డిమాండ్ 16,942 మెగావాట్లు నమోదు చేయగా, సోమవారం 17,606, మంగళవారం ఏకంగా 18,139 మెగావాట్లతో ఆల్‌టైమ్ రికార్డును నెలకొల్పింది.
సంవత్సరం వారీగా డిమాండ్