హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): దేశంలో రొమ్ము క్యాన్సర్ బాధితుల సంఖ్య నానాటికీ పెరగటం ఆందోళనకు గురి చేస్తున్నది. గత మూడు దశాబ్దాల్లో రొమ్ము క్యాన్సర్ కేసులు 74% పెరిగినట్టు లాన్సెట్ అధ్యయనం తాజాగా వెల్లడించింది. ప్రతి 28 మందిలో ఒకరు రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నట్టు గతంలో ఇండియ్ క్యాన్సర్ సొసైటీ తెలిపింది. 1990 నుంచి దేశంలో రొమ్ము క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరిగినట్టు ఆ రిపోర్టు పేర్కొంది. 2023లో దేశంలో 2.03లక్షల కొత్త రొమ్ము క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. 1990తో పోలిస్తే కేసుల సంఖ్య 477.8% పెరిగింది. ఇదే సమయంలో దేశంలో 1.02 లక్షల మంది రొమ్ముక్యాన్సర్ కారణంగా మరణించారు. దీంతో మరణాల సంఖ్య 352.3% పెరిగినట్టు ఆ అధ్యయనం వెల్లడించింది. 2023 నాటికి ప్రతి లక్ష మందిలో 29 కొత్త రొమ్ముక్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి.
1990తో పోలిస్తే 126.9% కేసులు పెరిగాయి. 2023లో ప్రపంచవ్యాప్తంగా 23లక్షల కేసులు ఉంటే 2050 నాటికి అవి 35 లక్షలకు చేరుకుంటాయని లాన్సెట్ అధ్యయనం పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా రొమ్ము క్యాన్సర్ కారణంగా ఏటా 7,64,000 మరణాలు సంభవిస్తుండగా.. వాటి సంఖ్య 2050 నాటికి 44% పెరిగి 14 లక్షలకు చేరుకుంటుందని ఈ స్టడీ అంచనా వేసింది. 2023లో 20-54 ఏండ్ల వయసున్న మహిళలతో పోలిస్తే 55 లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న మహిళల్లో కొత్త రొమ్ము క్యాన్సర్ కేసులు నమోదైనట్టు నివేదిక పేర్కొంది. అయితే 1990 నుంచి 20-54 ఏండ్ల వయసు ఉన్న మహిళల్లో 29% కొత్త కేసులు పెరిగినట్టు తెలిపింది.
మామోగ్రఫీ తప్పనిసరి
రొమ్ము క్యాన్సర్ బాధితుల్లో ప్రతి లక్ష మందిలో మరణాల రేటు 15కు చేరుకున్నట్టు లాన్సెట్ అధ్యయనం తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో క్యాన్సర్ మరణాలు వేగంగా సంభవించడం పట్ల అధ్యయనం ఆందోళన వ్యక్తంచేసింది. రొమ్ము క్యాన్సర్ కేసులు వేగంగా పెరగడానికి మాంసం, పొగాకు, ఆల్కహాల్ ఎక్కువ మోతాదులో తీసుకోవడం, షుగర్, అధిక బరువు, శారీరక శ్రమ తగ్గడం కారణమని ఆ అధ్యయనం తెలిపింది. జీవనశైలిలో మార్పులు, ఒత్తిడి, వ్యాయామం చేయకపోవడం కూడా క్యాన్సర్‌కు కారణమవుతున్నదని చెప్తున్నారు. 40 ఏండ్ల వయసు దాటిన మహిళలు రొమ్ముక్యాన్సర్‌పై అవగాహన కలిగి ఉండాలని సూచిస్తున్నారు. మహిళలు మామోగ్రఫీ పరీక్షలు తప్పనిసరిగా చేసుకోవాలని కోరుతున్నారు. తొలి దశలోనే రొమ్ము క్యాన్సర్‌ను గుర్తిస్తే చికిత్స ద్వారా 95% తగ్గించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.