హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): జేఎన్టీయూ అధ్యాపకుల ప్రమోషన్లలో వర్సిటీ ఉన్నతాధికారులు నిబంధనలు పాటించలేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సీనియారిటీ లేకున్నా, కొందరు సర్కార్ పెద్దల సిఫార్సులతో, మద్దతిచ్చే గ్రూపు సభ్యులకు అర్హతలు లేకపోయినా ప్రమోషన్లు కల్పించారని వర్సిటీ విద్యార్థి, అధ్యాపక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. 45 మంది అధ్యాపకుల ప్రమోషన్ల జాబితాలో నిబంధనల ప్రకారం అన్ని అర్హతలున్న పలువురికి అన్యాయం జరిగిందని వారు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అర్హతలు లేకున్నా ప్రమోషన్ పొందిన వారికి సర్కార్ పెద్దల అండదండలు ఉండటంతో బాధితులు కూడా నోరు మెదపడం లేదని చెప్తున్నారు.
జేఎన్టీయూలో కీలక బాధ్యతల్లో ఉన్నవారే నిబంధనలను అమలు చేయకుండా ప్రమోషన్లు కల్పించారని బాధితులు ఆవేదన చెందుతున్నారు. వాస్తవానికి ప్రమోషన్లు కల్పించే అంశం గత కొంతకాలంగా నానుతూ వస్తుంది. చివరికి బుల్డోజ్ రాజకీయంతో దొడ్డిదారిలో ప్రమోషన్లు కల్పించారని వారు వాపోయారు. ఈ అంశాన్ని ప్రశ్నించే వారిని టార్గెట్ చేస్తూ, వారిని అనేక రకాలుగా వేధింపులకు గురిచేసే ప్రయత్నాలు కూడా ఉన్నతాధికారులు చేస్తున్నారని, ఈ విషయంలో ఆ యూనివర్సిటీ వీసీది మాత్రం ప్రేక్షకపాత్ర అని వారు ఆవేదన చెందుతున్నారు.
నాలుగోసారి ఆమోదంపై అనుమానాలు
యూనివర్సిటీలో గత కొంతకాలంగా ప్రమోషన్లపై కసరత్తు చేసి, 45 మంది అధ్యాపకులతో కూడిన జాబితాను యూనివర్సిటీ ఉన్నతాధికారులు రూపొందించారు. ఆ ప్రతిపాదిత జాబితాకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ సెక్రటరీ ఆధ్వర్యంలో ఈ నెల 2న ఏర్పాటైన పాలకమండలి (ఈసీ) సమావేశంలో ఆమో దం లభించింది. ఇదే జాబితాను గతంలో ఈసీ మూడుసార్లు తిరస్కరించింది. కానీ, నాలుగోసారి అదే జాబితాను ఎందుకు ఆమోదం తెలిపింది? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. వీసీ సంతకంతో వారికి ప్రమోషన్లు కల్పించారు. జేఎన్టీయూలో ఎంతోకాలంగా ప్రమోషన్లు నిలిచిపోయాయి. యూనివర్సిటీలో ఉన్న ఖాళీలనూ భర్తీ చేయడం లేదు.
మరోపక్క యూనివర్సిటీలో వివిధ డిపార్టుమెంట్లలో డీన్, డైరెక్టర్ వంటి పోస్టులూ ఖాళీగా ఉన్నాయి. దీంతో కీలక నిర్ణయాలు జరుగడమే లేదు. కీలక పోస్టులు భర్తీ చేయాలంటే కొందరికి ప్రమోషన్లు కల్పించాల్సిన అవసరం కూడా ఉన్నది. దీని పేరిట హుటాహుటిన ప్రమోషన్లు కల్పించడం, ఆ వెంటనే ఈసీ ఆమోదించింది. ఆ ప్రమోషన్లలో అన్యాయం జరిగిన పలువురు అధ్యాపకులు పలు అనుమానాలను వ్యక్తంచేస్తున్నారు. ప్రమోషన్లలో జరిగిన అవకతవకలపై లోతుగా అధ్యయనం చేసి, తప్పులు తేలితే వివిధ రూపాల్లో నిరసనలు నిర్వహిస్తామని విద్యార్థి, అధ్యాపక సంఘాలు హెచ్చరిస్తున్నాయి. అయితే నిబంధనల ప్రకారమే ప్రమోషన్లు కల్పించామని, అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపిందని యూనివర్సిటీ అధికారులు తెలిపారు.