మహబూబ్నగర్ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సొంత జిల్లాలో మావోయిస్టుల లేఖలు కలకలం సృష్టించాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని కొడంగల్, కల్వకుర్తి నియోజకవర్గంలో చేస్తున్న భూదాహానికి వ్యతిరేకంగా మావోయిస్టులు(Maoists )తీవ్రంగా ఖండిస్తూ లేఖలు విడుదల చేయడం సంచలనం సృష్టిస్తోంది. సీఎం సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లితో పాటు కల్వకుర్తి నియోజకవర్గంలోని వెల్దండ, మాడుగుల, ఆమనగల్ మండలాల్లో ఈ లేఖలు ప్రకంపనలు సృష్టించాయి. అలాగే సీఎం సొంత నియోజకవర్గమైన కొడంగల్ని లగచర్లలో ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీకి వ్యతిరేకంగా పోరాడుతున్న గిరిజనులకు తమ మద్దతును తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే పెట్టుబడి వర్గాలకు కొమ్ముకాస్తూ కార్పొరేట్ల ప్రయోజనాల కోసం పనిచేస్తుందని, పేద ప్రజల హక్కులను కాలరాస్తుందని మండిపడ్డారు. ఈ లేఖలు ప్రధానంగా సీఎం ఆయన సోదరుల ఉద్దేశించి ఉండడంతో పోలీసులు యంత్రాంగం దృష్టి సారించింది. ఈ లేఖలు ఎవరు పంపిణీ చేశారు? ఎలా గ్రామాల్లోకి చేరాయి? అనేదానిపై ఆరా తీస్తున్నారు. మరోవైపు కల్వకుర్తి ప్రాంతంలో బిగ్ బ్రదర్స్ దాదాపు 900 ఎకరాలను అక్రమంగా రైతుల నుంచి తీసుకునేందుకు గత కొన్ని రోజుల నుంచి ప్రయత్నిస్తోంది.
ఈ భూములన్నీ బడా భూస్వాములకు చెందినవి. అయితే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే రైతులకు ఓఆర్సీలు ఇచ్చి హక్కు కల్పించింది. మళ్లీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ సారధ్యంలో ఈ భూములను లాక్కునే ప్రయత్నం చేస్తుందని మావోయిస్టులు ఆరోపిస్తున్నారు. మొత్తంగా వరుసగా మావోస్టులు బహిరంగా లేఖలు విడుదల చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.