KTR | హైదరాబాద్ : రేపు ఈ రాష్ట్రానికి సారథులుగా వ్యవహరించబోయే గ్రూప్-1 అభ్యర్థులను గొడ్లు, పశువుల మాదిరిగా చూడడం దారుణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. మాది ప్రజా పాలన అని ఫోజులు కొట్టిన సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకు నిర్బంధం తీసుకొచ్చారో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళనకు మద్దతుగా కేటీఆర్ మాట్లాడారు.
జీవో 29 వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థులు భారీగా నష్టపోతున్నారని గ్రూప్-1 అభ్యర్థులు తెలుపుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన 95 శాతం లోకల్ రిజర్వేషన్లను కూడా తుంగలో తొక్కుతున్నారు. ఈ రోజు ఎక్కువ మంది నాన్ లోకల్ అభ్యర్థులకు అధిక ప్రయోజనం కల్పించేలా ఈ ప్రభుత్వం చర్యలు ఉన్నాయని వారు వాపోతున్నారు. అదే విధంగా తెలుగు అకాడమీ పుస్తకాలను ప్రామాణికంగా కాకుండా.. వికీపిడియాను ప్రామాణికంగా తీసుకోవాలంటూ అర్థం లేని వాదన చేస్తున్న ఈ ప్రభుత్వానికి సూటిగా ప్రశ్నలు సంధిస్తూ గత నాలుగు రోజులుగా ఎండనక వాననక, పగలనక, రాత్రనక గ్రూప్-1 అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. గ్రూప్-1 అభ్యర్థుల పట్ల ఈ ప్రభుత్వం తీరు శోచనీయం, బాధాకరం. 3 లక్షల మంది ప్రిలిమ్స్ రాస్తే మెయిన్స్‌కు 30 వేల మంది క్వాలిఫై అయ్యారు. ఆ 30 వేల మందిలో కాబోయే డీఎస్పీలు, ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. అలాంటి వారిని ఈ ప్రభుత్వం గొడ్లు, పశువుల మాదిరిగా చూస్తుంది. ఇది దారుణం. కనీసం చర్చలకు కూడా పిలవడం లేదు. కనీసం సీఎం రేవంత్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి స్పందించడం లేదు. ఇది పూర్తిగా బాధ్యతారాహిత్యం అని కేటీఆర్ మండిపడ్డారు.
రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి అశోక్ నగర్ వెళ్లి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఆనాడు ఓట్లు వేయించుకుని, ఇవాళ మోసం చేస్తున్న వైనం.. వారి మాటలను ఆలకించలేని పరిస్థితి ఏదైతే ఉందో ఇది నిజంగా బాధాకరం. తెలంగాణలోని నిరుద్యోగ యువత బాధలో ఉంది. ఈ గ్రూప్-1 అభ్యర్థులే రేపు తెలంగాణ రాష్ట్రానికి సారథులుగా వ్యవహరించనున్నారు. అలాంటి వారిని ప్రభుత్వం ఇంత ఘోరంగా చూస్తుంది.. మరి మిగతా వారిని ఎలా చూస్తుందో ఆలోచించాల్సిన అవసరం ఉంది.. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా స్పందించి.. ఏ కారణం చేత గ్రూప్-1 వాయిదా వేయడంలో చెప్పాలి.. అభ్యర్థులను పిలిచి మాట్లాడాలని రేవంత్ రెడ్డిని కేటీఆర్ డిమాండ్ చేశారు.
మా నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, దాసోజు శ్రవణ్ సుప్రీంకోర్టులో గ్రూప్-1 అభ్యర్థుల తరపున పిటిషన్ దాఖలు చేశారు. మొండిగా మూర్ఖంగా వ్యవహారించకుండా అభ్యర్థులతో చర్చలు జరపాలి. సహేతుకమైన కారణాలు చెప్పాలి. పోస్టుపోన్ ఉట్టిగానే అగడలేదు. మధ్యప్రదేశ్‌లో ఇదే విధంగా మొండిగా పోయి పరీక్షలు పెట్టాక కోర్టు తీర్పు వచ్చింది. మళ్లీ పరీక్షలు నిర్వహించాల్సి వచ్చిందని కేటీఆర్ గుర్తు చేశారు.
గ్రూప్-1 అభ్యర్థులకు మద్దతుగా వెళ్లిన మా నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, శ్రీనివాస్ గౌడ్, దాసోజు శ్రవణ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.. ఈ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం.. ప్రజా పాలన అని ఫోజులు కొట్టిన రేవంత్ రెడ్డి ఈ నిర్బంధం ఎందుకు తీసుకొచ్చావ్..? చర్చలు జరిపేందుకు ఎందుకు భయపడుతున్నవ్. మా నాయకులను అరెస్టు చేసి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నవ్.. నీ దోస్తు బండి సంజయ్‌ను బ్రహ్మాండంగా అక్కడికి పంపించావు. సకల రాచమర్యాదలతో సీఆర్పీఎఫ్ బలగాలను పెట్టి ఆయనను అక్కడికి పంపుతవ్. అదే మా నాయకులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్లకు తరలిస్తావు. ఇకనైనా సిగ్గు, బుద్ధి తెచ్చుకోని గ్రూప్-1 అభ్యర్థులను చర్చలకు పిలిచి సమస్యను పరిష్కరించండి అని కేటీఆర్ కోరారు.
ఇవి కూడా చదవండి..