Harish Rao | హైదరాబాద్ : రాష్ట్రంలో గ్రూప్-1 నియామకాల్లో జరుగుతున్న అన్యాయాలపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్రంగా స్పందించారు. జీవో 29 వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. నిరుద్యోగుల ఎజెండా మా ఎజెండా అని ప్రగల్భాలు పలికిన కోదండరాం, రియాజ్, చింతపండు నవీన్, ఆకునూరి మురళీ ఎక్కడున్నారని హరీశ్‌రావు ప్రశ్నించారు. సిద్దిపేటలో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
గ్రూప్ -1 వాయిదా వేయాలని అభ్యర్థులు ఆందోళన చేస్తుంటే.. కోదండరాం ఎందుకు మౌనంగా అంటున్నారు. నిరుద్యోగుల ఎజెండా నా ఎజెండా అన్నారు. ఎమ్మెల్సీ అయ్యాకా గొంతు మూగబోయింది. కోదండరాం, రియాజ్, చింతపండు నవీన్, ఆకునూరి మురళీ ఎక్కడున్నారు. అశోక్ నగర్ వెళ్లండి.. గ్రూప్-1 అభ్యర్థులతో చర్చించండి. నిరుద్యోగులకు మోసం చేసి, ఉద్యోగాలు పొందిన ఈ నలుగురు ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
మేనిఫెస్టోలో చెప్పినవి ఒక్కటైనా అమలు చేశారా..? ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు అన్నరు. పది నెలలు పూర్తయ్యింది. ఇంకో నెల పది రోజుల్లో రెండు లక్షల ఉద్యోగాలు నింపాలని డిమాండ్ చేస్తున్నాం. కనీసం కొత్తగా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. కనీసం జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించలేదు. కేసీఆర్ పరీక్ష పెట్టి ఫలితాలు ఇచ్చిన ఉద్యోగాలకు మాత్రమే నియామక పత్రాలు ఇచ్చారు. నాలుగు వేల నిరుద్యోగ భృతి, రెండు లక్షల ఉద్యోగాలు ఎగబెట్టావు, ఇప్పుడు జీవో 29 తెచ్చి విద్యార్థులను మోసం చేసావు. ఎస్సీ, ఎస్టీ, బీసీ బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేస్తా అని రేవంత్ రెడ్డి మాట తప్పిండని హరీశ్‌రావు నిప్పులు చెరిగారు.
ఉద్యోగాలు రాని వారికి పది లక్షలు వడ్డీ లేని రుణాలు ఇస్తా అన్నవు. యువత జీవితాలను ఆడుకుంటున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికంగా తీసుకోకుండా వికీపీడియాను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. విద్యార్థులపై దాడి చేయడం కాదు, ఆ విద్యార్థులను పిలిచి మాట్లాడండి. ఓట్లప్పుడు కాదు ఇప్పుడు వెళ్లండి రేవంత్ రెడ్డి.. అశోక్ నగర్ వెళ్లి లైబ్రరీలో కూర్చొని సమస్యలు పరిష్కరించాలి డిమాండ్ చేస్తున్నాం. సెక్యూరిటీ లేకుండా వెళ్లే దమ్ముందా రేవంత్ రెడ్డి. ఎందుకు మాట్లాడవు. కేసులు పెట్టినా, విద్యార్థుల మీద లాఠీలు లేస్తే, బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదు. అణిచివేతలతో ఏం చేయలేవు, ఉద్యమం మరింత ఉధృతం అవుతుందని హరీశ్‌రావు తేల్చిచెప్పారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | జీవో 29 వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు తీవ్ర అన్యాయం : హరీశ్‌రావు