Harish Rao | సిద్దిపేట : సీఎం రేవంత్ రెడ్డి తెచ్చిన జీవో 29 వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ధ్వజమెత్తారు. సిద్దిపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు.
మెరిట్ సాధించిన అభ్యర్థులకు ఓపెన్ కోటాలో కాకుండా, రిజర్వ్డ్ కోటాలో అవకాశం కల్పిస్తున్నారు. దీని వల్ల రిజ్వరేషన్ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఓపెన్ కోటా ఓపెన్ టు ఆల్ అనే విషయాన్ని మర్చిపోయారు. రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరిగితే, ఇక్కడ రేవంత్ రెడ్డి రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నాడు. రాహుల్ గాంధీ రాజ్యాంగం భగవద్గీత అన్నారు. మరి అది ఎందుకు ఇక్కడ అమలు కావడం లేదు. కేసీఆర్ రాజ్యాంగం ప్రకారం, జీవో 55 ప్రకారం నోటిఫికేషన్లు ఇచ్చారు. ఆ మాదిరిగానే పోస్టులను భర్తీ చేశారని హరీశ్‌రావు గుర్తు చేశారు.
కాంగ్రెస్ పార్టీ దళిత, గిరిజనులు, మైనార్టీలు, బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తున్నదని హరీశ్‌రావు మండిపడ్డారు. భట్టి విక్రమార్క ఆ వర్గానికి ప్రతినిధిగా ఉండి మౌనంగా ఉన్నారు. అసెంబ్లీ సమావేశంలో ఇదే అంశాన్ని అడిగితే భట్టి విక్రమార్క పరిశీలిస్తామన్నారు. చేసిందేం లేదు. దళితులు, గిరిజనులు, బీసీలు, మైనార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని నిలదీయాలి. ఆయా వర్గాల ప్రజలకు న్యాయం చేసేందుకు ముందుకు రండి. యూపీఎస్సీ అమలు చేస్తుంది కానీ, టీజీపీఎస్సీ ఎందుకు అమలు చేయడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 29 తెచ్చి రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడిచింది. ఓపెన్ కోటాలో రిజర్వ్డ్ వారికి ప్రవేశం లేకుండా చేయడం అన్యాయం. అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడటం లేదని హరీశ్‌రావు నిలదీశారు.
విద్యార్థుల ఆర్తనాదాలతో అశోక్ నగర్ ప్రాంతం మార్మోగుతున్నది. ఆ విద్యార్థులు కిరాతకులు, హంతకులు, గూండాలు కాదు.. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతో వచ్చి చదువుతున్నారు. రాజ్యంగ స్ఫూర్తిని కాపాడండి, రిజర్వేషన్లు అమలు చేయండి అని వారు రోడ్డెక్కితే విద్యార్థులు వీపులు పగులగొడుతున్నారు. పొత్తి కడుపులో పిడిగుద్దులు, ఆడపిల్లల్ని కూడా అర్ధరాత్రి పోలీసు స్టేషన్లలో పెడుతున్నారు. గ్రూప్-1 అభ్యర్థుల పట్ల కఠినంగా, కర్షకంగా వ్యవహరిస్తున్నారు. దీన్నీ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నదని హరీశ్‌రావు స్పష్టం చేశారు.
ఇదే రాహుల్ గాంధీ అశోక్ నగర్ లైబ్రరీ వచ్చి హామీలు ఇచ్చారు. ఇప్పుడు జరుగుతున్న అన్యాయం మీద ఎందుకు స్పందించడం లేదు. రేవంత్ రేవంత్ రెడ్డి ఎందుకు అణిచివేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం లేదా..? బడుగు బలహీన వర్గాల ప్రతినిధులు మాట్లాడరా? పేద పిల్లలు జిల్లాల నుంచి వచ్చి ప్రభుత్వం ఉద్యోగం సాధించాలని, 5 రూపాయలు అన్నం తింటూ చదువుకుంటారు. ఉద్యోగం సాధించి తల్లిదండ్రుల కళ్లలో ఆనందం చూడాలని చదువుతున్నరు. అలాంటి వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Telangana | తన ముందే తల దువ్వుకున్నాడని.. గుండు కొట్టించిన ఎస్సై.. ఆత్మహత్యకు యత్నించిన యువకుడు
KTR | మూసీ పేరుతో ప్రజాధనాన్ని లూటీ చేసేందుకు రేవంత్ రెడ్డి ప్లాన్: కేటీఆర్