KTR | హైదరాబాద్ : తెలంగాణలో అదానీతో రేవంత్ రెడ్డి దందాను రాహుల్ గాంధీ సమర్థిస్తున్నారా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. ప్రతి రోజు అదానీని విమర్శించే రాహుల్ గాంధీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలకు మద్దతిస్తున్నారా? చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అదానీ వ్యవహారంపై కేటీఆర్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు.
పారిశ్రామికవేత్తలు ఎవరూ ఊరికే విరాళాలు ఇవ్వరని మహారాష్ట్ర ఎన్నికల సభల్లో రాహుల్ గాంధీ చెప్పారు. “నీకిది, నాకది” అని ఏదో పెద్దదే ఆశించి ఇస్తారని అన్నారు. మరీ ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.100 కోట్లు అదానీ నుంచి విరాళం తీసుకుంది. రాహుల్ గాంధీకి తెలిసి తీసుకున్నారా? లేక తెలియకుండా తీసుకున్నారా? కాంగ్రెస్ జాతీయ పార్టీ. దానికి దేశవ్యాప్తంగా ఒక్కటే విధానం ఉండాలి కదా? కానీ ఢిల్లీలో అదానీ మంచివాడు కాదు… గల్లీలో మాత్రం అదానీ మంచోడు. కాంగ్రెస్ పార్టీది గల్లీలో ఒక నీతి… ఢిల్లీలో మరో నీతి? బీజేపీది డబుల్ ఇంజిన్ అంటున్నారు. మరి కాంగ్రెస్‌ది డబుల్ స్టాండర్డ్స్? కాదా అని కేటీఆర్ ప్రశ్నించారు.
అదానీ వ్యవహారంలో కాంగ్రెస్ వాళ్లు గుడ్ అదానీ, బ్యాడ్ అదానీ అనే విధానం పాటిస్తున్నారు. వాళ్ల పార్టీకి చందాలు ఇచ్చి ఆర్థికంగా సాయం చేస్తే గుడ్ అదానీ అంటారు. అది వేరే పార్టీలతో కలిసి వ్యాపారాలు చేస్తే బ్యాడ్ అదానీ అంటారు. తెలంగాణలో అదానీతో రేవంత్ రెడ్డి దందాను రాహుల్ గాంధీ సమర్థిస్తున్నారా? తెలంగాణ కన్నా తక్కువ తలసరి ఆదాయం ఉన్న కెన్యా ప్రభుత్వం ఆత్మగౌరవంతో వ్యవహారించింది. అదానీ మీద అమెరికాలో కోర్టు తీర్పు ఇవ్వగానే, అదానీతో వ్యాపార సంబంధాలను రద్దు చేస్తామని కెన్యా అధ్యక్షుడు ప్రకటించారు. రాహుల్ గాంధీ మాత్రం అదానీ దుర్మార్గుడు అంటారు. మరి కెన్యా ఒప్పందాలు రద్దు చేసుకుంటే మీరు ఎందుకు రద్దు చేయటం లేదు? అదానీ నుంచి రూ.12,400 కోట్ల వ్యాపార ఒప్పందాలు చేసుకున్నారని కేటీఆర్ గుర్తు చేశారు.
రాహుల్ గాంధీ వెంటనే మీ ముఖ్యమంత్రికి ఫోన్ చేసి అదానీతో ఒప్పందాలు రద్దు చేయమని ఆదేశించాలి. ప్రధానితో అదానీ దోస్తీని విమర్శించే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి అదానీతో దోస్తీ చేస్తే ఎందుకు ఊరుకుంటున్నారు? అదానీతో వ్యాపారం దేశానికి నష్టమని రాహుల్ గాంధీ అంటారు. మరి తెలంగాణకు ఏ విధంగా మేలు జరిగిందో చెప్పాలి. కాంగ్రెస్ హైకమాండ్‌ను కాదని తెలంగాణలో అదానీకి రెడ్ కార్పెట్ వేశారా? అలాగైతే కాంగ్రెస్ పరంగా అది చాలా నష్టం చేసే పని. వెంటనే రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల కూడా అదానీతో ఒప్పందాలను పునసమీక్షించాలని కోరారని కేటీఆర్ గుర్తు చేశారు.
స్కిల్ యూనివర్సిటీకి విరాళం సరియైనదేనని రాహుల్ గాంధీ భావిస్తున్నారా? అదానీ అవినీతి పరుడని రాహుల్ గాంధీ అంటుంటారు. అలాంటి వ్యక్తితో వ్యాపారం ఎందుకు చేస్తున్నారు? ఇదంతా రాహుల్ గాంధీకి తెలిసే జరుగుతుందని భావిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారిపై వెంటనే చర్యలు తీసుకోండి. స్కిల్ యూనివర్సిటీకి ఇచ్చిన వంద కోట్లు వెనక్కి ఇవ్వండి. రామన్నపేటలో అదానీ సిమెంట్ ఫ్యాక్టరీకి ప్రజాభిప్రాయ సేకరణకు ప్రజలు వ్యతిరేకిస్తుంటే కాంగ్రెస్, బీజేపీ ఎందుకు నోరు విప్పడం లేదు? దేశం ప్రతిష్ట మంటగలిసిపోతే బీజేపీ ఎందుకు స్పందించటం లేదు? బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణ ప్రయోజనాల కోసం నిజమైన పోరాటం చేస్తోంది. అదానీ వ్యవహారంపై ప్రధాని మోడీ, రాహుల్ గాంధీ వెంటనే స్పందించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
KTR | అదానీతో చేసుకున్న ఒప్పందాలు రద్దు చేయాలి.. రేవంత్ సర్కార్‌కు కేటీఆర్ డిమాండ్
Harish Rao | కొనుగోలు కేంద్రాల్లేక ధాన్యం దళారుల పాలు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్‌రావు ఫైర్
Harish Rao | రాష్ట్రంలో ఎక్కడ కూడా పత్తి రైతులకు మద్దతు ధర రావడం లేదు : హరీశ్ రావు