Band Melam | కన్నడ స్టార్ యష్ నటిస్తున్న ‘టాక్సిక్’ చిత్రం వాయిదా పడటంతో భారతీయ సినీ రంగంలో విడుదల తేదీల మార్పులు మొదలయ్యాయి. ముఖ్యంగా టాలీవుడ్లో పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఆ ఖాళీ అయిన స్లాట్‌ను దక్కించుకోవడంతో ఇతర సినిమాలపై దాని ప్రభావం పడింది. దీంతో హర్ష్ రోషన్, శ్రీదేవి అపల్లా జంటగా నటిస్తున్న ‘బ్యాండ్ మేళం’ చిత్రం ముందుగా ప్రకటించిన దానికంటే వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. వాస్తవానికి ఈ సినిమా మార్చి 13, 2026న విడుదలవుతుందని మేకర్స్ స్పష్టం చేసినప్పటికీ, పవన్ కళ్యాణ్ సినిమాతో పోటీని తప్పించుకునేందుకు విడుదల తేదీని మార్చి 26కు మార్చారు. సతీష్ జవ్వాజి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సీనియర్ నటుడు సాయి కుమార్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. కోన ఫిలిం కార్పొరేషన్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నారు. అయితే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రాకతో మరిన్ని చిన్న చిత్రాలు కూడా తమ రిలీజ్ ప్లాన్స్‌ను పునరాలోచించుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.