హైదరాబాద్ : రాజేంద్రనగర్ మానస హిల్స్‌లో ఎలాంటి అనుమతులు లేకుండా కొండలను పిండి చేస్తున్న మంత్రి పొంగులేటి సంస్థ రాఘవ కన్స్ట్రక్షన్స్ను ( Raghava Constructions ) బీఆర్ఎస్ నాయకులు గురువారం సందర్శించారు. ఎమ్మెల్సీ దాసోజ్ శ్రావణ్ ( Dasoj Shravan) , ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ( RS Praveen ), మన్నె క్రిశాంక్ ( Manne Krishank ) తో పాటు మరికొందరు ప్లాంట్‌ను సందర్శించిన వారిలో ఉన్నారు.

నిన్న, మొన్నటి వరకు మైనింగ్ ప్లాంట్ వద్ద రాఘవ కన్స్ట్రక్షన్ అనే పేరుతో కంటైనర్ ఉండగా బీఆర్ఎస్ నాయకులు వస్తున్నారని కంటైనర్‌పై ఉన్న పేరును తొలగించారు. ఈ సందర్భంగా దాసోజ్ మాట్లాడుతూ ఓఆర్ఆర్( ORR ) కు ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న మైనింగ్ ప్లాంట్‌కు ఎలాంటి పర్మిషన్స్ లేవని, ఇష్టారాజ్యంగా అక్రమ మైనింగ్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ భూమిని వెంటనే దళిత బిడ్డలకు ఇచ్చేయాలని డిమాండ్ చేశారు.

ఇప్పటి వరకి వీళ్లు క్రష్ చేసిన మెటల్ ద్వారా వచ్చిన డబ్బులను ఫైన్ ద్వారా రికవరీ చేయాలని, అక్రమ మైనింగ్ చేస్తున్న వ్యక్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ,మన్నె క్రిశాంక్ మాట్లాడుతూ మంత్రి పొంగులేటి రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమ మైనింగ్ పై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించగానే పేరును తుడిపేసి అక్కడి నుంచి కార్మికులంతా పరారీ అయ్యారని ఆరోపించారు.
అక్రమాలకు పాల్పడుతున్న మంత్రి పొంగులేటి వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మంలో పేదల ఇండ్లను నేలమట్టం చేసిన మంత్రి పొంగులేటి హైదరాబాద్‌లో గుట్టలను కొల్లగొడుతూ కొట్లాది రూపాయలు సంపాదిస్తున్నారని విమర్శించారు.