KCR : ఏప్రిల్ 27న కనీవినీ ఎరుగని విధంగా రజతోత్సవ మహా సభను నిర్వహిస్తామని భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ (KCR) అన్నారు. మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లా ముఖ్య నాయకులకే బీఆర్ఎస్ బాస్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సభ నిర్వహణకు సంబంధించి వాళ్లతో మాట్లాడారు. 10 లక్షల మంది తరలిరానున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు అవసరమైన సలహాలు, సూచనలు చేశారు కేసీఆర్.
ఎండాకాలం కావడంతో రజతోత్సవ సభకు హాజరయ్యే వాళ్లకు చిన్నపాటి ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశించారు అధినేత. అందుకోసం.. 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, 10 లక్షల నీళ్ల బాటిళ్లు అందుబాటులో ఉంచాలని నాయకులతో కేసీఆర్ చెప్పారు. ఈ సమావేశంలో కేటీఆర్‌తో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతలు మధుసుదనా చారి, పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణలోని అన్ని ప్రాంతాలను కలిపే జాతీయ రహదారి 563, 763కు జంక్షన్‌గా ఉండే.. ఎల్కతుర్తిని సభా కేంద్రంగా ఎంచుకున్నారు బీఆర్ఎస్ అధినేత. కేసీఆర్, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆదేశాల మేరకు అక్కడ 1,213 ఎకరాలను చదును చేశారు. ఇందులో 154 ఎకరాల్లో రజతోత్సవ మహాసభ ప్రాంగణం ఉండనుంది. అంతేకాదు పార్కింగ్ కోసం ఏకంగా 1,059 ఎకరాలు కేటాయించనున్నారు. 50 వేల వాహనాలను నిలిపేందుకు వీలుగా పార్కింగ్ ఏర్పాట్లు చేయనున్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రత్యేక రాష్ట్రంలోని సెంటిమెంట్‌గా ఉంటున్న వరంగల్‌లో బీఆర్ఎస్ రజతోత్సవ సభను లక్షలాది మందితో వరంగల్‌లో ఏప్రిల్ 27న నిర్వహించాలని పార్టీ అధినేత కేసీఆర్ ఈనెల 7న నిర్ణయించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఎలుకతుర్తిలో సభా స్థలాన్ని పలువురు నాయకులు పరిశీలించారు. ఈ సభా వేదిక కాంగ్రెస్ సర్కారు వైఫల్యాలను కేసీఆర్ ఎండగట్టనున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలిరానున్న బీఆర్ఎస్ శ్రేణుల్లో కొండంత ఆత్మవిశ్వాసం నింపనున్నారు గులాబీ బాస్.