Tollywood | మరో రెండు మూడు రోజులలో పదో తరగతి పరీక్షలు ముగుస్తాయి. వారం తర్వాత పిల్లల పరీక్షలు కూడా అయిపోతాయి. అందరికి సమ్మర్ హాలీడేస్ ఉంటాయి. ఇక దీనిని క్యాష్ చేసుకునేందుకు నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారు. సమ్మర్లో థియేటర్స్‌కి ఫ్యామిలీలు బాగా వస్తారు కాబట్టి తమ సినిమాలని ఒక్కొక్కటిగా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఏప్రిల్ నెలలో చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. దీంతో పోటీ వాతావరణం నెలకొనబోతుంది. అయితే పాన్ ఇండియా మూవీస్ అయిన ఘాటీ, కన్నప్ప వాయిదా పడటం చిన్న సినిమా వాళ్లకి కొంత ఊరటనిచ్చింది అని చెప్పాలి.
ముందుగా ఏప్రిల్ 10న సిద్దు జొన్నలగడ్డ ‘జాక్’తో సమ్మర్ వార్ షురూ అవుతుంది.. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ స్పై ఎంటర్ టైనర్ లో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది. ఇక ఈ మూవీకి పోటీగా అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ని తెలుగు రాష్ట్రాల్లోపెద్ద ఎత్తున విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఏప్రిల్ 11న యాంకర్ ప్రదీప్ నటించిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ విడుదల అవుతుంది. ఈ మూవీపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఆ తర్వాతి వారంలో అంటే ఏప్రిల్ 17న తమన్నా ‘ఓదెల 2’ రిలీజ్ కానుంది. ఈ మూవీ ప్రమోషన్లు ఊపందుకున్నాయి. మరుసటి రోజు ప్రియదర్శి ‘సారంగపాణి జాతకం’ రిలీజ్ కానుండగా, దీని మీద బజ్ అయితే అంతగా లేదు.
ఇక మంచు విష్ణు కన్నప్ప వాయిదా పడడంతో ఆ స్థానంలో ‘భైరవం’ ఏప్రిల్ 25 వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.. నిర్మాణ సంస్థ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ ఇంకో నాలుగైదు రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక వీటాతో పాటు ఏప్రిల్‌లో చౌర్య పాఠం, 28 డిగ్రీస్ సెల్సియస్, లవ్ యువర్ ఫాదర్, ఎర్రచీర లాంటి చిత్రాలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధం అయ్యాయి. ఇప్పుడు కథ బాగుంటేనే జనాలు థియేటర్స్‌కి వస్తారు. పెద్ద హీరోల సినిమాలు కదా, ఎలా ఉన్నా చూసేస్తారని ఆడియన్స్ అనుకోవడం లేదు. అందుకే సమ్మర్లో వచ్చే సినిమాలు మంచి కంటెంట్‌తో వస్తే పెద్ద హిట్ కావడం ఖాయం.