Desapathi Srinivas | హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు నాల్కల ధోరణి మరోసారి నిరూపితమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. గేమ్ ఛేంజర్ సినిమాకు ఎందుకు అదనపు షోలు..? టికెట్ రేట్ల పెంపు ఎందుకు..? అని దేశపతి ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో కలిసి ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు.
గేమ్ ఛేంజర్ సినిమాకు టికెట్ల రేట్ల పెంపు, అదనపు షోలకు అనుమతిస్తూ జారీ చేసిన జీవోతో రేవంత్ రెడ్డిది రెండు నాల్కల ధోరణి అని అర్థమైపోయింది. టికెట్ల పెంపుదల ఉండదు అని అసెంబ్లీ సాక్షిగా సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రతిజ్ఞ చేశారు. ఆయన ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారు. ఈ జీవోపై వివరణ ఇవ్వాలి. గేమ్ ఛేంజర్ సినిమా వచ్చేసరికి రేట్ల పెంపుదలకు అవకాశం ఇచ్చారు. ఆయనకు ప్రత్యేకమైన ప్రివిలేజ్ ఎందుకు..? ఇక నుంచి బెనిఫిట్ షోలు, అదనపు షోలు ఉండవని సీఎం నెల రోజుల క్రితం అసెంబ్లీలో ప్రకటించారు. మరి గేమ్ ఛేంజర్‌కు ఎందుకు ప్రివిలేజ్ ఇస్తున్నారు అని దేశపతి శ్రీనివాస్ ప్రశ్నించారు.
నిజానికి దిల్ రాజు అనే వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడు కూడా కలిసి రాలేదు. ఏ ఒక్క రోజు కూడా తెలంగాణకు అండగా నిలబడలేదు. సంక్రాంతికి వస్తున్నాం ఫంక్షన్లో తెలంగాణ కల్చర్‌ను దిల్ రాజు అవమానించాడు. ఆయనకు ఆంధ్రాలోనే సినిమాలకు వైబ్ ఉంటుందట. తెలంగాణలో వైబ్ ఉండదట. అయితే తెలంగాణలో సినిమాలు మానుకో దిల్ రాజు. కల్లు, మాంసం దుకాణాలు పెట్టుకో.. ఇక్కడ వైబ్ ఉంటుంది. నీకు కావాల్సింది వైబ్ కదా.. ఇక్కడి సినిమాలకు వైబ్ ఉండదని అంటున్నవ్ కదా.. అని దేశపతి శ్రీనివాస్ మండిపడ్డారు.
సినిమా టికెట్ రేట్లు పెంచమన్న రేవంత్ రెడ్డి పూటకోమాట మార్చుతున్నాడు. సినిమాటోగ్రఫి శాఖ మంత్రి టికెట్ రేట్ల పెంపుదల ఉండదని ప్రకటించారు. మరి దీనిపై సమాధానం చెప్పాలి. సినిమాలు విడుదలైతే టికెట్ రేట్లు పెంచి పేద ప్రజల జేబులు లూటీ చేయొద్దన్నాడు రేవంత్ రెడ్డి. మరి గేమ్ ఛేంజర్‌కు ఎందుకు పెంచాల్సిన అవసరం వచ్చింది. నిజాయితీ లేని ముఖ్యమంత్రి, మంత్రలు ఉండటం దురదృష్టకరమని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
KTR | లాయర్ రామచంద్రరావుతో కలిసి.. ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్
KTR | నేను కేసీఆర్ సైనికుడిని.. నిఖార్సయిన తెలంగాణ బిడ్డను: కేటీఆర్
KTR | తెలంగాణ, హైదరాబాద్ ఇమేజ్ను పెంచేందుకే.. ఫార్ములా-ఈ రేస్‌ను తీసుకొచ్చాం: కేటీఆర్