హైదరాబాద్: ఫార్ములా-ఈ కారు రేసు వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఏసీబీ విచారణకు హాజరయ్యారు. మాజీ ఏఏజీ, న్యాయవాది రామచంద్రరావుతో కలిసి కేటీఆర్ ఏసీబీ ఆఫీస్‌కు వెళ్లారు. అంతకుముందు నందినగర్‌లోని తన నివాసంలో లీగల్ టీమ్‌తో చర్చించారు. అందేవిధంగా ఎమ్మెల్యే హరీశ్ రావు, ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. కాగా, కేటీఆర్ ఏసీబీ విచారణకు వెళ్తుండటంతో పార్టీ శ్రేణులు, నాయకులు పెద్ద సంఖ్యలో ఆయన నివాసానికి తరలివచ్చారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘తెలంగాణ బిడ్డగా, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఒక కార్యకర్తగా, కేసీఆర్ సైనికుడగా స్వచ్ఛమైన మనసుతో, నిర్మలమైన హృదయంతో మరోసారి చెబుతున్నా.. తెలంగాణ ప్రతిష్ట పెంచడానికి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను అంతర్జాతీయం చేయడానికి, హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో నిలపడానికి రాష్ట్ర మంత్రిగా ఎన్నో ప్రయాత్నాలు చేశాం. అవి ఫలించి హైదరాబాద్, తెలంగాణ భారత దేశంలోనే ఒక ప్రధానమైన నగరంగా ప్రపంచ దృష్టిని ఆకర్షించే స్థాయికి తీసుకొచ్చేలా పనిచేశాం. తొమ్మిదిన్నర పదేండ్ల తమ ప్రభుత్వంలో మా బావమర్దులకు రూ.11 వందల 37 కోట్ల కాంట్రాక్టులు ఇచ్చే దౌర్భాగ్యపు పని చేయలేదు. మంత్రిగా నేను మంత్రిమండలిలో కూర్చుని నా కొడుకు కంపెనీలకు కాంట్రాక్టులు ఇచుకోలేదు. కాంట్రాక్టులు ఇచ్చి ప్రతిఫలంగా ల్యాండ్‌క్రూజర్ కొనుక్కోలేదు. ఆ పనులు రేవంత్ రెడ్డి, ఆయన మంత్రివర్గ సహచరులు చేశారు. ఆ చావు తెలివితేటలు, అవినీతి తెలివితేటలు వాళ్లకే ఉన్నాయి. నేను రూ.55 లక్షతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి పోయి దొరికిపోయిన దొంగను కూడా కాదు.
నేను నిఖార్సయిన తెలంగాణ బిడ్డను. ఏ పనిచేసినా తెలంగాణ కోసం, హైదరాబాద్ ప్రతిష్టను పెంచడానికి చేశాను. అరపైసా అవినీతి చేయలేదు. చేయబోను. ఇవాళ కొంత మంది అర్ధమై కానివాళ్లు, తెలిసీ తెలియని వాళ్లు, ఏదో కొంత బురదజల్లి తాత్కాలికంగా మీడియా మేనేజ్మెంట్ ద్వారా రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకునే కాంగ్రెస్ వాళ్లకు చెప్పేదొకటే.. నిజం నిలకడమీద తెలుస్తుంది.
మీరు ఇవ్వాళ జల్లే బురద నన్నుగానీ, మా పార్టీని కానీ ఎట్టి పరిస్థితుల్లో మాధృష్టిని మరల్చలేదు. మేము మాట్లాడుతూనే ఉంటాం. కొట్లాడుతూనే ఉంటాం. గత ఏడాది కాలంగా విద్యుత్ చార్జీలు పెంచొద్దని కొట్లాడింది బీఆర్ఎస్. లగచర్లలో రైతులను జైల్లో పెడితే అడ్డుకున్నది బీఆర్ఎస్. హైడ్రా పేరుతో ఇండ్లు కూలగొడితే అడ్డుకున్నది బీఆర్ఎస్. ఆరు గ్యారంటీలను అమలు చేయకపోతే అడుగడుగునా నిలదీసింది కేసీఆర్ బృందం. మా దృష్టిని మేం మరల్చం. నామీద కేసుపెట్టి నన్నేదో చేసి దానివల్ల మా పార్టీ క్యాడర్‌ను, నాయకత్వాన్ని నువ్వు దారి మళ్లింపు, దృష్టి మళ్లింపు దిశగా ప్రయత్నం చేస్తానని అనుకుంటున్నవ్ రేవంత్ రెడ్డి. అది నీవల్ల కాదు. ముమ్మాటికీ నువ్విచ్చిన 420 హామీలపై ప్రశ్నిస్తూనే ఉంటాం. ఇదే కాదు ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటాం. న్యాయస్థానాలపై, ఈ దేశంలోని చట్టాల మీద, భారత రాజ్యాంగంపై మాకు సంపూర్ణ గౌరవం, విశ్వాసం ఉన్నది. నువ్వు ఏ ప్రశ్నలన్నా అడుగు సమాధానం మావద్ద ఉంది. ఎందుకంటే మేం నిజాయితీగా ఉన్నాం. నీలాగా లుచ్చా పనులు చేయలేదు, తుచ్చపు పనులు చేయలేదు. చేయబోము. నికార్సయిన తెలంగాణ బిడ్డగా.. కేసీఆర్ రక్తం పంచుకుని పుట్టిన కొడుకుగా చెబుతున్నా.. తెలంగాణ కోసం అవసరమైతే చస్తాను తప్ప ఇలాంటి లుచ్చాల ముందు తల వంచను. తప్పకుండా కొట్లాడుతూనే ఉంటా. పోరాడుతూనే ఉండా. తెలంగాణ జయించేదాకా, కాంగ్రెస్ కబంధ హస్తాల నుంచి తెలంగాణ బయటకు వచ్చేదాకా కొట్లాడుతూనే ఉంటా’నని కేటీఆర్ స్పష్టం చేశారు.