Palla Rajeshwar Reddy | హైదరాబాద్ : ఇవాళ తెలంగాణ శాసనసభ ఆమోదించిన చట్టం భూ భారతి కాదు భూ హారతి అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతల భూకబ్జాలకు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు మంగళ హారతి పట్టనుందని విమర్శించారు. అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో 75 లక్షల మంది రైతులకు సంబంధించి కోటి 50 లక్షల ఎకరాలకు ధరణి చట్టం హక్కులు కల్పించింది. భూ భారతి చట్టం రైతుల పాలిట పిడుగుపాటు లాంటిదే. ఏదైనా కుక్కను చంపాలంటే దాన్ని పిచ్చి కుక్కగా ముద్ర వేయాలి. ఇప్పుడు ధరణిని కూడా పిచ్చి కుక్కగా ముద్ర వేసి చంపేశారు. ఎలుక చొచ్చిందని ఇల్లు తగలబెట్టుకున్న చందంగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వ పరిస్థితి. ఇక రేపట్నుంచి పేదలకు కష్ఠాలు మొదలవుతాయని పల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.
కేవలం పది శాతం సమస్యలు కూడా లేని ధరణి చట్టంను రద్దు చేయడం దారుణం. ధరణితో పారదర్శకత పెరిగింది. 12 కోట్ల మంది ధరణి వెబ్సైట్ విజిట్ చేశారు. లక్షల ట్రాన్సక్షన్స్ జరిగాయి. అసెంబ్లీలో పొంగులేటి పచ్చి అబద్దాలు ఆడారు. నిజాం తర్వాత తెలంగాణలో భూమినంతా 86 సంవత్సరాల తర్వాత కేసీఆర్ సర్వే (ఎల్‌ఆర్‌యూపి)చేయించి హక్కు పత్రాలు ఇచ్చారు. సీఎంఓలో ఉన్న అధికారులందరూ ధరణి చట్టంలో పాలుపంచుకున్నవారే. వారిని కూడా రేవంత్ తప్పబడుతున్నారా..? కేసీఆర్ తెచ్చిన సాఫ్ట్‌వేర్‌ను వాడుతూ రేవంత్ గత ప్రభుత్వాన్ని తప్పు పడుతున్నారని పల్లా రాజేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు.
70 లక్షల మంది రైతులకు సంబంధించి కోటి 52 లక్షల ఎకరాలకు ధరణి లో చిన్న తప్పు కూడా దొర్లలేదు. 27 లక్షల ట్రాన్సాక్షన్లు జరిగిన ధరణి సాఫ్ట్‌వేర్‌లో లోపభూయిష్టాలు ఉన్నట్టా ? సాఫ్ట్వేర్ అనేది ఎప్పటికపుడు అప్ డేట్ చేసుకోవాలి. విదేశీ సంస్థల చేతిలో ధరణి సాఫ్ట్వేర్ అనేది పూర్తి అబద్దం. జమాబందీ తిరిగి తెస్తున్నారు. ఇది అక్రమార్కులకు పండగే. పౌతీ విధానం తేవడం తిరోగమన చర్య. కుటుంబంలో మళ్ళీ తగాదాలు మొదలవుతాయి. అనుభవదారు కాలమ్ పెడతారట.. రైతు, కౌలు రైతు కొట్లాడాలి. కొత్త దుకాణాలు మొదలై భూ భారతితో అవినీతి విచ్చలవిడి అవుతుంది. ఎమ్మార్వో సంతృప్తి చెందితేనే మ్యూటేషన్ అనేది మరో అవినీతి దుకాణం. కేసీఆర్ తెచ్చిన బ్రహ్మాండమైన చట్టాన్ని నీరు గార్చారు. భూభారతితో రైతుల గుండె దడ మొదలైంది. భూ భారతి చట్టాన్ని బీఆర్ఎస్ నిర్ద్వంద్వముగా తిరస్కరిస్తోంది. ధరణితోనే రైతుబంధు పారదర్శకంగా సాగింది. రైతులతో కలిసి భూ భారతిపై పోరాటం చేస్తాం అని పల్లా రాజేశ్వర్ రెడ్డి హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
KTR | ఈ నెల 30 దాకా కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దు.. ఏసీబీకి హైకోర్టు ఆదేశం
KTR | కేటీఆర్ ఎక్కడ లబ్ధి పొందారు.. క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు
BRS | రేవంత్ రెడ్డి మీద నియంత్రణ లేదా.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన బీఆర్ఎస్