KTR | ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఊరట లభించింది. ఈ నెల 30వ తేదీ వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయవద్దని ఆదేశించింది. అయితే ఈ కేసును విచారణ కొనసాగించవచ్చని ఏసీబీకి సూచించింది. అలాగే కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది.
ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో ఏసీబీ కేసుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ తరఫు న్యాయవాది సుందరం వాదనలు వినిపించారు. అవినీతి నిరోధక చట్టం కింద కేటీఆర్‌పై పలు సెక్షన్లు నమోదు చేశారని ఆయన తరఫు న్యాయవాది సుందరం తెలిపారు. ఈ సెక్షన్లు ఈ కేసు కింద వర్తించవని అన్నారు. గత ఏడాది సీజన్ 9 కార్ రేసింగ్ నిర్వహించారని తెలిపారు. ఈ కార్ రేసింగ్ నిర్వహించడానికి 2022 అక్టోబర్ 25నే ఒప్పందం జరిగిందని చెప్పారు. సీజన్ 9లో రూ.110 కోట్ల లాభం వచ్చిందని వివరించారు. సీజన్ 10 కోసం ఓ సంస్థ తప్పుకుందని తెలిపారు. దీంతో ప్రభుత్వం ప్రమోటర్‌గా ఒప్పందం కుదుర్చుకుందని అన్నారు. పాత ఒప్పందానికి కొనసాగింపుగా ఈ కొత్త ఒప్పందం జరిగిందని స్పష్టం చేశారు.
ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని కేటీఆర్ తరఫు న్యాయవాది సుందరం తెలిపారు. ప్రొసీజర్ పాటించలేదని అనడం సరైనది కాదని అన్నారు. 14 నెలల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. కనీసం ప్రాథమిక విచారణ చేయకుండానే కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. కేవలం రాజకీయ కుట్రలో భాగంగానే కేసు నమోదు చేశారని అన్నారు. ఈ కేసులో ఎన్నో తప్పులు కనిపిస్తున్నాయని చెప్పారు. అవినీతి నిరోధక చట్టంలోని 13(1)(a) సెక్షన్ దీనికి వర్తించదని తెలిపారు.
ఫార్ములా ఈ కార్ రేసింగ్‌లో స్పాన్సర్ వెనక్కి జరిగినప్పుడు ఈవెంట్ నిర్వహించకపోతే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దిబ్బతింటుందని ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. 2024లో కచ్చితంగా ఈ కార్ రేసింగ్ నిర్వహించాలనే ఈ చెల్లింపులు జరిగాయని తెలిపారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్‌తో హైదరాబాద్‌కు ప్రత్యక్షంగా, పరోక్షంగా రూ.700 కోట్ల లాభం వచ్చిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం FEOకు మిగతా డబ్బులు చెల్లించేందుకు నిరాకరించిందని అన్నారు. 2023 అక్టోబర్‌లో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారమే FEOకు చెల్లించారని చెప్పారు. అగ్రిమెంట్ ప్రకారం చెల్లింపులు చేస్తే ఉల్లంఘన ఎలా అవుతుందని ప్రశ్నించారు. 13(1)ల, 409 అనే సెక్షన్లు ఈ కేసుకు వర్తించవని స్పష్టం చేశారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్‌లో అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తు లేదని తెలిపారు. 18న ఫిర్యాదు చేస్తే 19వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదు చేశారని చెప్పారు. ఎలాంటి ప్రాథమిక దర్యాప్తు చేయకుండానే ఎఫ్ఐఆర్ నమోదు చేశారని అన్నారు.
ప్రాథమిక దర్యాప్తు జరపకుండానే కేసు రిజిస్టర్ చేయడం చట్ట విరుద్ధమని సుందరం అన్నారు. అఫెన్స్ జరిగిందని తెలిశాక మూడు నెలల లోపు కేసు రిజిస్టర్ చేయాల్సి ఉంటుందని కానీ.. 11 నెలల తర్వాత కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. లలితా కుమారి వర్సెస్ యూపీ కేసులో సుప్రీంకోర్టు ఆర్డర్‌ను కేటీఆర్ న్యాయవాది ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఫార్ములా ఈ రేస్ అగ్రిమెంట్ జరిగిన 14 నెలల తర్వాతే కేసు పెట్టారని చెప్పారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగితే ఎన్నికల కమిషన్ పరిశీలించాలి.. కానీ ఈ కేసుతో ఏసీబీకి ఏంటి సంబంధమని ప్రశ్నించారు. ఫార్ములా ఈ రేస్ కోసం నిర్వాహకులకు నిధులు చెల్లిస్తే కేటీఆర్‌పై ఎందుకు కేసు పెట్టారని నిలదీశారు. కేటీఆర్ ఎక్కడ లబ్ధి పొందారని అడిగారు.
పీసీ యాక్ట్‌లో డబ్బులు ఎవరికి వెళ్తాయో వాళ్లనే నిందితులుగా చేర్చాలని న్యాయవాది సుందరం అన్నారు. కానీ ఇక్కడ FEO సంస్థకు డబ్బులు చేరాయని.. ఆ సంస్థను మాత్రం అసలు నిందితుల జాబితాలోనే చేర్చలేదని చెప్పారు. ఇది కరప్షన్ కేసు ఎలా అవుతుందని ప్రశ్నించారు. పీసీ యాక్ట్ 13(1) ఎలా వర్తిస్తుందని అడిగారు. గత ప్రభుత్వంలో కేటీఆర్ మంత్రిగా పనిచేశారని చెప్పారు. రాజకీయ కక్షతోనే కేటీఆర్‌పై కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ క్లాజ్ ఉన్నప్పుడు క్రిమినల్ కేసు పెట్టాల్సిన అవసరం లేదని వివరించారు. ఈ వ్యవహారంలో కేటీఆర్‌కు ఒక్క రూపాయి కూడా అందలేదని చెప్పారు. అయినప్పటికీ కేటీఆర్‌ను ఏ1గా చేర్చారని తెలిపారు. రాజకీయ కక్షతోనే కేసు పెట్టారు కాబట్టి.. స్టే ఇవ్వాలని కోరారు.