KTR | హైదరాబాద్ : శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభినందించడం కాదు.. అభిశంసించాలి అని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఎందుకు ఈ ప్రభుత్వాన్ని అభినందించాలని కేటీఆర్ నిలదీశారు.
చక్కటి బడ్జెట్ ప్రవేశపెట్టాం.. మమ్మల్ని అభినందిస్తారేమో అని అనుకున్నట్టు భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఎందుకు అభినందించాలి..? ఏం చూసి అభినందించాలి..? ఆరు నూరైనా ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి మాట తప్పినందుకు అభినందించాలా..? డిక్లరేషన్లకు దిక్కు మొక్కు లేకుండా చేసినందుకు అభినందించాలా.? 420 హామీలను తుంగలో తొక్కినందుకు అభినందించాలా..? అభినందించడం కాదు మిమ్మల్ని అభిశంసించాలి. మన దగ్గర రీకాల్స్ సిస్టం లేదు కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు నాలుగేండ్లు భరించాలి తప్ప మరో మార్గం లేదు. ఎన్నో హామీలు, వాగ్దానాలు ఇచ్చి మరిచారు. అరచేతిలో వైకుంఠం చూపించి, నానా మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. వాటిని చేయలేక ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. మార్పు రావాలి కాంగ్రెస్ రావాలి అని స్లోగన్‌తో యాడ్స్ చేశారు. అధికారంలోకి రావడం కోసం మార్పు మార్పు అని ఊదరగొట్టారు. ఈ మార్పు మార్పు అనే దానికి పల్ల దుర్గయ్య అనే కవి మంచి పద్యం చెప్పారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ పద్యం సరిగ్గా సరిపోతుందని తెలుపుతూ కేటీఆర్ ఆ పద్యాన్ని సభలో చదివి వినిపించారు.
మారుపు మారుపు అనుచు
పలు మారులు మార్చి మార్చి
ఏమారిచి పిల్చు మాత్రమున
మారుపు వచ్చునా తత్వమందు!
గోమారును పేరుమార్చి సుకుమారి కుమారి అటంచు ముద్దుగా కోరిక మీర పిల్చినను
గోవుల నెత్తురు పీల్చకుండునా..!
ఒక పులికి పేరు మార్చి సుకుమారి అని పేరు పెడితే అది గోవుల నెత్తురు పీల్చకుండా ఉంటుందా..? అనేది ఈ పద్యం సారాంశం అని కేటీఆర్ చెప్పారు. ఆ విధంగానే ఈ ప్రభుత్వం పనితీరు ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తియ్యటిపుయ్యటి హామీలు ఇచ్చి ఇవాళ బుట్దదాఖలు చేస్తున్నారు. ఈ ప్రభుత్వం బడ్జెట్లో దళితులకు ద్రోహం చేసింది.. మహిళలకు మోసం చేసింది.. నిరుద్యోగులను నయవంచనకు గురి చేసిందంటూ కేటీఆర్ మండిపడ్డారు.
ఉద్యోగులకు రుణమాఫీ చేయడం లేదు. రైతు భరోసాలో కూడా కట్ పెడుతారని వార్తలు వస్తున్నాయి. ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం లేదు. యువతులకు స్కూటీల ప్రస్తావన లేదు. దుబారా ఖర్చులు తగ్గించి, అనవసరపు అర్బాటాలు తగ్గించి ఆరు గ్యారెంటీలు అమలు చేయాలి. ఎన్నికలకు ముందు రజినీ కాంత్‌లు.. ఎన్నికల తర్వాత గజనీకాంత్లు అయిపోయారు.. ఇంత త్వరగా మరిచిపోతారా.. 100 రోజుల గడువు దాటడంతో ఏదో ఒక మాయ చేసి రోజుకు ఒకటి డైవర్ట్ చేస్తున్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్న మాటలు బడ్జెట్లో ఎక్కడున్నాయి. నాలుగు కోట్ల ప్రజలను మభ్య పెడుతున్నారు. ప్రజల తరపున ఈ ప్రభుత్వాన్ని తప్పకుండా నిలదీస్తాం ప్రశ్నిస్తాం. మా లోపలనే కొట్లాట అనే డీఎన్ఏ ఉంది. తప్పకుండా ప్రజల పక్షాన కొట్లాడుతాం. ప్రాంతం వాడు మోసం చేస్తే ఈ ప్రాంతంలోనే పాతరపెడుతామన్న కాళోజీ మాటలను గుర్తు చేస్తున్నాం అని పేర్కొంటూ కేటీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు.
ఇవి కూడా చదవండి..
KTR | రేవంత్ సర్కార్‌కు కేసీఆర్ ఫోబియా పట్టుకుంది.. శాసనసభలో ఎమ్మెల్యే కేటీఆర్