Harish Rao | హైదరాబాద్ : రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయినా, ఇప్పుడు సీఎం అయినా అది కేసీఆర్ పుణ్యమే అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పష్టం చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో హరీశ్‌రావు మీడియాతో చిట్ చాట్ చేశారు.
తెలంగాణ ప్రకటన వెనక్కి పోతే మేము రాజీనామా చేశాం.. రేవంత్ రెడ్డి కనీసం డూప్లికేట్ రాజీనామా కూడా చేయలేదు. రేవంత్ లాంటి వాళ్ళు రాజీనామా చేయలేదనే ఆనాడు బలిదానాలు జరిగాయి. ఆనాటి అమరుల లేఖలు చూస్తే బలిదానాలకు కారణం ఎవరో తెలుస్తుంది. కేసీఆర్ లాగా రాజీనామాలు చేసిన చరిత్ర తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉందా? కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ ప్రకటన వచ్చింది. 14 యేండ్ల తెలంగాణ ఉద్యమంలో రేవంత్ తెలంగాణ కోసం పని చేయలేదు. కేసీఆర్ తెలంగాణ సాధించకపోతే ఈ రేవంత్ చంద్రబాబుతోనే ఉండేవారు. రేవంత్ తెలంగాణ ఉద్యమకారులపై దాడికి రైఫిల్‌తో బయలుదేరారు. అలాంటి రేవంత్ తెలంగాణ ఛాంపియన్‌ను తానే అని చెప్పుకోవడం దయ్యాలు వేదాలు వల్లించడం లాంటిదే. రేవంత్ పీసీసీ అధ్యక్షుడు అయినా ఇపుడు సీఎం అయినా అది తెలంగాణ వచ్చిన ఫలితమే.. కేసీఆర్ పుణ్యమే అని హరీశ్‌రావు స్పష్టం చేశారు.
జైపాల్ రెడ్డి పెద్ద తెలంగాణ వాది తాను చిన్న తెలంగాణ వాది అని రేవంత్ మాట్లాడుతున్నారు. తెలంగాణ ఏర్పాటు కోసం జైపాల్ రెడ్డి ఏ పార్టీనైనా ఒప్పించారా? కేసీఆర్ 36 పార్టీలను ఒప్పించారు. తెలంగాణ వస్తుంది అనే వాతావరణం ఏర్పడ్డాకే రేవంత్ తెలంగాణకు అనుకూలంగా మాట్లాడారు. బీఆర్ఎస్ పని అయిపోయిందని సీఎం రేవంత్ మాట్లాడుతున్నారు. కాంగ్రెస్‌కు గతంలో దేశంలో రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా రాలేదు అయినా ఆ పార్టీ పని అయిపోయిందా..? రెండు సార్లూ కాంగ్రెస్ పార్టీని మేమే ఓడించాం.. కాంగ్రెస్ పని అయిపోయిందా..? ఎంపీ ఎన్నికల్లో గతంలో కాంగ్రెస్ పార్టీ 18 రాష్ట్రాల్లో ఖాతా తెరవలేదు..కాంగ్రెస్ పని అయిపోయిందా..? ఇండియా కూటమి 28 పార్టీలతో ఏర్పడ్డది. కాంగ్రెస్ అందులో గెలిచిన సీట్లు 99. తమకు కూడా మంచి రోజులు వస్తాయని, మళ్లీ అధికారం చేపడుతామని హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..
Crop Loans | రేపు రెండో విడుత రుణమాఫీ ప్రారంభం.. ఈ సారైనా అర్హులందరికీ మాఫీ అయ్యేనా..?