Harish Rao | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాల కోసం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పష్టం చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటి విషయంలో నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందని హరీశ్‌రావు మండిపడ్డారు. తెలంగాణ భవన్లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
గోదావరి నీళ్లను పెన్నాకు తీసుకెళ్లేందుకు ఏపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది అని హరీశ్‌రావు తెలిపారు. గోదావరి నీళ్లను ఏపీకి తీసుకెళ్తుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది..? బనకచర్ల ఆపాలని ఏపీకి కనీసం లేఖ కూడా రాయలేదు సీఎం రేవంత్ రెడ్డి. నాలుగు ప్రాజెక్టులకు నీళ్ల కేటాయింపులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రాజెక్టులకు అనుమతుల సాధనలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. బనకచర్లకు నిధుల కోసం చంద్రబాబు కేంద్రానికి లేఖలు రాశారు. చంద్రబాబు లేఖపై కేంద్రంలో దస్త్రం కదులుతోంది. చంద్రబాబు నవంబర్‌లో లేఖ రాస్తే సీఎం రేవంత్ ఏం చేశారు..? బనకచర్లపై ఏపీ ముందుకెళ్తుంటే సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు..? బనకచర్లతో తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుంది. బనకచర్లపై ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది అని హరీశ్‌రావు మండిపడ్డారు.
కృష్ణా జలాల విషయంలో సెక్షన్ 3ని సాధించిందే కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ అని హరీశ్‌రావు తెలిపారు. ఇప్పుడు సెక్షన్ 3పై ఏపీ సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఏపీ సుప్రీంకోర్టుకు వెళ్తే కనీసం కేవియట్ వేయరా..? ప్రభుత్వాన్ని అధికారులు సరిగ్గా మార్గదర్శకత్వం చేయట్లేదు. మంచి అడ్వకేట్లను పెట్టి సెక్షన్ 3 విషయంలో వాదించాలి కదా..? సాగునీటి మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి విఫలమయ్యారు. మేడిగడ్డను పండబెట్టారు.. పాలమూరును పక్కకు పెట్టారు. ఇప్పటికైనా నదీ జలాలపై రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి. అఖిలపక్షం వేస్తే సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని హరీశ్‌రావు స్పష్టం చేశారు.
ఏపీ మాజీ సీఎస్ ఆదిత్యానాథ్‌ను సలహాదారుగా పెట్టుకున్నారు. ఆదిత్యనాథ్ విషయంలో రేవంత్ గురుదక్షిణ చెల్లించారేమో..? తుంగభద్రను గండికొట్టేందుకు ఏపీ, కర్ణాటక యత్నాలు చేస్తున్నాయి. ఏపీ, కర్ణాటక తుంగభద్రకు గండి కొడుతుంటే సీఎం ఏం చేస్తున్నారు..? 2017లో ఏపీ ఇలాంటి ప్రయత్నం చేస్తే గట్టిగా అడ్డుకున్నాం అని హరీశ్‌రావు గుర్తు చేశారు.
ఇవి కూడా చదవండి..
Congress | నమ్మి మోసపోయినం మళ్లీ 20 ఏండ్ల దాకా రేవంత్ రెడ్డి గెల్వడు.. పెన్షనర్ల ఆవేదన : వీడియో
KTR | కొత్త కంపెనీల సంగతి దేవుడెరుగు.. ఉన్న కంపెనీలు పోకుండా చూడండి! : కేటీఆర్
Manne Krishank | సీఎం రేవంత్ రెడ్డి దావోస్ టూర్ బోగస్.. మండిపడ్డ మన్నె క్రిశాంక్