వికారాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ) : గ్రామ పంచాయతీలకు శుభవార్త. రెండేండ్ల తర్వాత కేంద్రం నుంచి జీపీలకు నిధులు విడుదలయ్యాయి. పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం రెండేండ్ల కిందట ముగిసినా సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోవడంతో ఆ సమయంలో గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగడంతో కేంద్రం నుంచి ఒక్క రూపాయీ విడుదల కాలేదు. ఇటీవల పంచాయతీ ఎన్నికలు ముగిసి కొత్త పాలకవర్గాలు కొలువుదీరడం తో గ్రామ పంచాయతీలకు కేంద్రం నిధులను విడుదల చేసింది. 2023-24, 2024-25 ఆర్థిక సంవత్సరాలకు రూ.37 కోట్ల పెండింగ్ నిధులను 594 గ్రామ పం చాయతీలకు విడుదల చేసింది. గతంలో ఉన్న పంచాయతీ పాలకవర్గాలు చేసిన పనులకు నిధులు విడుదల అయినా ప్రస్తు తం కొత్త పాలకవర్గాలు కొలువుదీరడంతో వివాదం తలెత్తింది.
గతంలో ఉన్న పాలకవర్గాలు చేసిన పనుల కు సంబంధించిన బిల్లుల చెల్లింపులు పూర్తై న తర్వాత కొత్త పనులకు సంబంధిత నిధులను వినియోగించుకోవచ్చని రాష్ట్ర ప్రభు త్వం స్పష్టత ఇచ్చినా కొత్త సర్పంచ్లు-మాజీ సర్పంచ్ల మధ్య నిధుల పంచాయి తీ ముదిరింది. ఈ లొల్లి చివరకు జిల్లా పం చాయతీ అధికారుల వద్దకు చేరింది. గతం లో మేం చేసిన పనులకు బిల్లులు ఇచ్చేందుకు కొత్త పాలకవర్గం పేచీ పెడుతున్నదని జిల్లా పం చాయతీ అధికారికి కొందరు మాజీ సర్పంచ్లు ఫిర్యాదు చేశారు. సదరు అధికారి కూడా ఆయా పంచాయతీల్లో గత పాలకవర్గం చేసిన పనులకు సంబంధించిన బిల్లులను మంజూరు చేయాలని చెప్పినా.. కొంతమంది సర్పంచ్లు విడుదలైన నిధులు మీకిస్తే మాకేంటంటూ వివాదానికి తెర తీస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది.
కమీషన్లు ఇస్తేనే బిల్లులు..
2023-24, 2024-25 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఆర్థిక సంఘం నిధులను కేంద్రం విడుదల చేసింది. గతంలోని పాలకవర్గాలు కూడా పంచాయతీల్లో సొంత డబ్బులు పెట్టి పనులు చేయించగా నిధులు రాకపోవడంతో రెండేండ్లుగా నిధుల ఎప్పుడు వస్తాయం టూ ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే నిధులు విడుదల అయిన అనంతరం చేసిన పనుల కు బిల్లులకు ఆమోదం తెలపాలని కొత్త పాలకవర్గాలను కోరితే వారు ససేమిరా అంటుం డడంతో పంచాయితీ మొదలైంది. జిల్లాలోని కొన్ని పంచాయతీలు మినహా మెజార్టీ గ్రామా ల్లో బిల్లుల లొల్లి మొదలైంది. పాత పాలకవర్గం చేసిన పనులకు నిధులు రావడం, బిల్లులకు ఆమోదించాల్సి ఉండడంతో చాలామంది సర్పంచులు.. ఆ నిధులను మీకిస్తే మేము ఏమి చేయాలంటూ వాగ్వాదానికి దిగుతున్నట్లు తెలిసింది. అంతేకాకుండా మరికొందరు సర్పం చులు మీ బిల్లులకు ఆమోదం తెలపాలంటే కమీషన్ ఇవ్వాల్సిందేనని షరతులు పెడుతు న్నట్లు మాజీ సర్పంచులు ఆరోపిస్తున్నారు.
కొందరు మాజీ సర్పంచులు కమీషన్లు ఇస్తూ బిల్లులను పూర్తి చేసుకుంటుండగా.. మరికొందరు పంచాయతీల బాగు కోసం సొంత డబ్బు లు ఖర్చు పెట్టి మీకు కమీషన్లు ఎందుకు ఇవ్వాలంటూ నిలదీస్తున్నట్లు తెలిసింది. కమీషన్లు ఇచ్చేది లేదంటూ కొత్త సర్పంచులపై జిల్లా పంచాయతీ అధికారికి ఫిర్యాదు చేసినట్లు తెలి సింది. చెక్ పవర్ కొత్త సర్పంచులకు ఉండడంతోనే నిధుల పంచాయితీ నెలకొన్నది. గత రెండేండ్ల పాటు మాజీ సర్పంచులతోపాటు పంచాయతీ కార్యదర్శులు కూడా సొంత డబ్బు లు ఖర్చు పెట్టగా నిధులు విడుదల కాకపోవడంతో ఎదురుచూశారు. చివరకు నిధులు విడు దలైన తర్వాత కొత్త పాలకవర్గం షరతులు పెడుతుండడంతో వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు జోక్యం చేసుకొని పాత పాలకవర్గాలు చేసిన పనులకు సంబంధించిన బిల్లులకు ఆమోదం తెలిపేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే గత పాలకవర్గం చేసిన పనులకు సంబంధించి జిల్లాలోని గ్రామ పంచాయతీలకు రూ.29 కోట్ల బకాయిలు రావాల్సి ఉన్నది.
ఆ విషయం మా దృష్టికి వచ్చింది..; జయసుధ, డీపీవో
పంచాయతీలకు విడుదలైన పెండింగ్ నిధుల్లో నెలకొన్న పం చాయితీ తమ దృష్టికి వచ్చింది. 2023-24, 2024-25 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి విడుదలైన నిధుల్లో గత పాలకవర్గం ఖర్చు పెట్టిన పెండింగ్ బకాయిలను ఇవ్వాలని వారికి సూచించాం.