Manne Krishank | హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి దావోస్ టూర్‌ను బోగస్ టూర్‌గా మార్చారని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ మండిపడ్డారు. గతంలో మాదిరిగానే సీఎం రేవంత్ దావోస్ పర్యటన అబద్ధాలతో గడిచిందని పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో మన్నె క్రిశాంక్ మీడియాతో మాట్లాడారు.
దావోస్ పెట్టుబడులపై రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నపుడు ఓ మాట, అధికారంలో ఉన్నపుడు ఓ మాట మాట్లాడుతున్నారని మన్నె క్రిశాంక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్టుబడుల ద్వారా కంపెనీలకే లాభం తప్ప ప్రజలకు ఒరిగేదేమి లేదు అని రేవంత్ రెడ్డి గతంలో ఉన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కూడా దావోస్ పెట్టుబడులతో ఉపయోగం లేదన్నారు. ఇప్పుడు మాత్రం పెట్టుబడులపై సీఎం రేవంత్ ఊదర గొడుతున్నారు. దావోస్‌లో గత సంవత్సరంలో వచ్చిన పెట్టుబడులు రూ. 40 వేల కోట్లు అని ప్రభుత్వం ప్రకటించింది. అందులో ఇప్పటివరకు వచ్చినవి ఏమీలేవు. అదానీ, జేఎస్‌డబ్ల్యూ, ఉబర్, గోడి ఇండియా లాంటి సంస్థలు పెట్టుబడులకు సంబంధించి కుదుర్చుకున్న ఒప్పందాలు ఏవీ వాస్తవ రూపం దాల్చలేదు. భట్టి విక్రమార్క కూడా దావోస్ పెట్టుబడులు కేవలం ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ మాత్రమే అన్నారు అని మన్నె క్రిశాంక్ గుర్తు చేశారు.
మేఘా కంపెనీని రేవంత్ ఈస్ట్ ఇండియా కంపెనీతో పోల్చారు. ఈస్ట్ ఇండియా కంపెనీ యూరోప్‌లోనే ఉంది. దావోస్ కూడా యూరోప్‌లో ఉంది. మేఘా కంపెనీ యూరోప్‌కు చెందినదనే దావోస్‌లో ఒప్పందం కుదుర్చుకున్నారా..? సన్ సంస్థ ఎండీ దావోస్‌లో లేకున్నా ఉన్నారని ఆయనతో ఒప్పందం కుదుర్చుకున్నామని సీఎంవో తప్పుడు ప్రకటన ఇచ్చింది. రాష్ట్రానికి సీఎంగా ఉన్న వ్యక్తి తప్పుడు సమాచారం ఇవ్వొచ్చా..? సన్ పెట్రో కెమికల్స్ ఎండీ దిలీప్ సంఘ్వీ స్థానంలో వేరే వ్యక్తితో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో దిగారు. అమెజాన్ సంస్థ పెట్టుబడులు కూడా కేసీఆర్ హయాంలో వచ్చినవే.. ఇప్పుడు వచ్చాయని రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నారు అని మన్నె క్రిశాంక్ మండిపడ్డారు.
పాకిస్తాన్‌కు చెందిన సంస్థ మెయిన్ హార్ట్ ఎండీతో రేవంత్ మరోసారి సమావేశమయ్యారు. మూసీ అభివృద్ధి పేరిట పాకిస్తాన్ సంస్థకు కాంట్రాక్టు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోంది. డెస్టినేషన్ వెడ్డింగ్స్ చూశాము. ఇప్పుడు రేవంత్ రెడ్డి దావోస్‌లో మన రాష్ట్ర కంపెనీలతో దావోస్‌లో ఒప్పందాలు కుదుర్చుకుని డెస్టినేషన్ ఇన్వెస్ట్‌మెంట్స్‌గా మార్చారు. గతంలో కుదిరిన ఒప్పందాలు ఎంత వరకు వాస్తవ రూపం దాల్చాయో శ్వేత పత్రం ప్రకటించాలి. బోగస్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుని రేవంత్ ప్రచార ఆర్భాటాలు చేస్తున్నారు. ఒప్పందాలు కుదుర్చుకున్న కొన్ని కంపెనీల పేర్లు అసలు మనుగడలోనే లేవు. దావోస్ అంటే బోగస్‌గా మార్చిన ఘనత రేవంత్ రెడ్డిదే. సీఎం దావోస్ టూర్ కామెడీ సర్కస్‌గా మారింది. అంకెల గారడీ తప్ప పెట్టుబడుల లెక్కల్లో వాస్తవం లేదు అని మన్నె క్రిశాంక్ తెలిపారు.
రాహుల్ గాంధీ రాజకీయాల్లోకి రాకముందు టెకీయే అన్న వాస్తవాన్ని రేవంత్ మరచినట్టున్నారు. పంప్డ్ స్టోరేజిపై అనేక పెట్టుబడులు కుదిరియాంటున్నారు. అసలు ఎనర్జీ పాలసీయే రూపొందించలేదని భట్టి విక్రమార్క అంటున్నారు. పాలసీ లేనిది ఒప్పందాలు ఎలా కుదుర్చుకుంటున్నారు..? డాటా సెంటర్లు వస్తున్నాయంటే కేసీఆర్ హయాంలో మెరుగుపడ్డ విద్యుత్ వ్యవస్థే కారణం. కేసీఆర్ పేరు తీసుకోవడానికి రేవంత్ నామోషే.. ఎవరెవరి పేర్లో చెబుతున్నారు. కేటీఆర్ కృషి వల్లే తెలంగాణకు పెట్టుబడులు వచ్చాయి. చంద్రబాబు బిల్ గేట్స్ వంటి వారితో సమావేశమయ్యారు. రేవంత్ రెడ్డేమో మేఘా కృష్ణా రెడ్డి, పిచ్చారెడ్డితో భేటీ అయ్యారు. ఇక్కడి వాళ్ళతో భేటీ కావడానికి దావోస్ దాకా వెళ్లాలా..? జయేష్ రంజన్ కూడా రేవంత్ సహవాసంతో అబద్దాలు నేర్చుకున్నారు. ప్రచార ఆర్భాటాలు బంద్ చేసి పెట్టుబడులపై శ్వేత పత్రం ప్రకటించాలి. టెకీలను అవమానపరుస్తున్న రేవంత్ రెడ్డి.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గెలుపులో టెకీ మస్క్ పాత్ర ఉందని మరచిపోవద్దు అని మన్నె క్రిశాంక్ సూచించారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | గ్రామ సభల్లో మర్లబడుతున్న తెలంగాణ.. ప్రభుత్వ ఫెయిల్యూర్‌కు ఇదే నిదర్శనం : హరీశ్‌రావు
Vinod Kumar | యూజీసీ ముసాయిదాకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలి..! రేవంత్ రెడ్డికి వినోద్ కుమార్ డిమాండ్