Vinod Kumar | హైదరాబాద్ : యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కొత్త నిబంధనలపై అనేక రాష్ట్రాలు నిరసన తెలుపుతున్నాయని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వినోద్ కుమార్ తెలిపారు. ఈ క్రమంలో తెలంగాణ అసెంబ్లీలో కూడా యూజీసీ ముసాయిదాకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.
ఇవాళ వినోద్ కుమార్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. తమిళనాడు అసెంబ్లీ యూజీసీ నిబంధనలకు వ్యతిరేకంగా తీర్మానం చేసి పంపింది. ఫెడరల్ స్ఫూర్తిని మంట గలుపుతున్నారని తమిళనాడు సీఎం స్టాలిన్ కేంద్రప్రభుత్వంపై మండిపడ్డారు. కేరళ సీఎం కూడా యూజీసీ ప్రతిపాదనలను వ్యతిరేకించారు. ఎన్డీఎ భాగస్వామ్య పక్షమైనప్పటికీ జేడీయూకి చెందిన బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా యూజీసీ ప్రతిపాదనలు వ్యతిరేకించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంకా స్పందించలేదు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీఎం అయినప్పటికీ యూజీసీ ముసాయిదాపై స్పందించడం లేదు. తెలంగాణ అసెంబ్లీలో యూజీసీ ముసాయిదాకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తున్నాం అని వినోద్ కుమార్ పేర్కొన్నారు.
బీఆర్ఎస్ అభిప్రాయాలను యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్‌కు ఈ రోజే పంపామని మాజీ ఎంపీ తెలిపారు. యూజీసీ ముసాయిదా రాష్ట్రాల హక్కులను హరించే విధంగా ఉన్నాయి. తక్షణమే కొత్త ప్రతిపాదనలు విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. వీసీలను నియమించే అధికారం గవర్నర్‌కు కట్టబెట్టడం అప్రజాస్వామికం. డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాలి.. వీసీలను మాత్రం కేంద్రం నియమిస్తుందా..? ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం అని వినోద్ కుమార్ స్పష్టం చేశారు.
ప్రొఫెసర్ల నియామకానికి ఉన్న నిబంధనలు మార్చే ప్రయత్నాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. తమకిష్టమైన వారిని బోధనానుభవం లేకున్నా కేంద్రం నియమించే అధికారం కొత్త నిబంధనలతో కలుగుతుంది. దీన్ని కూడా వ్యతిరేకిస్తున్నాం. త్వరలో కేంద్ర విద్యా శాఖ మంత్రి దేవేంద్ర ప్రధాన్‌ను కలిసి యూజీసీ ముసాయిదాపై బీఆర్ఎస్ అభ్యంతరాలను తెలియజేస్తాం. తెలంగాణలో జాతీయ రహదారులకు సంబంధించి నితిన్ గడ్కరీని కలిసి వినతి పత్రం ఇస్తాం. సిద్ధిపేట, సిరిసిల్ల, వేములవాడలో పెండింగ్ జాతీయ రహదారులపై చర్చిస్తామని వినోద్ కుమార్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Beerla Ilaiah | ప్రభుత్వ విప్ ఐలయ్యకు నిరసన సెగ.. అర్హులైన వారి పేర్లను ఇప్పుడే ప్రకటించాలని సవాల్
Grama sabhalu | కన్నీళ్లు, వేడుకోళ్లు, ఆగ్రహ జ్వాలలు.. చివరి రోజు రణరంగంగా మారిన గ్రామ సభలు
KTR | అమ్మాయిలకు సాధికారత ఇవ్వండి.. ప్రపంచాన్ని మార్చండి : కేటీఆర్