గద్వాల, మార్చి 2 : కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నామంటూ ప్రభుత్వం చెబుతున్న మాటలన్నీ ఒట్టివేనని తేలిపోతున్నాయి. చెప్పేదానికి.. వాస్తవ పరిస్థితులకు చాలా వ్యత్యాసం కనిపిస్తున్నది. జోగుళాంబ గద్వాల జిల్లాలో మరమ్మతుల పేరిట విద్యుత్‌శాఖ అధికారులు కోతలు విధిస్తున్నారు. దీంతో ప్రజలతోపాటు రైతులు విద్యుత్‌శాఖ అధికారుల తీరుపై మండి పడుతున్నారు. ఉమ్మడి ఏపీ పాలనలో నాటి కరెంట్ కోతలు.. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో మళ్లా చూస్తున్నామని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో మరమ్మతుల పేరిట నెలలో సుమారు 10 రోజులకుపైగా గంట నుంచి మూడు గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. దీంతో ప్రజలతోపాటు చిరు వ్యాపారులు, గృహిణులు విద్యుత్‌శాఖ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే కరెంట్ కోతలు తప్పవని, కరెంట్ వైర్లపై బట్టలు ఆరేసుకునే పరిస్థితి వస్తుందని గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్న మాటలు ప్రస్తుతం వారి పాలనలో అదే జరుగుతున్నట్లు అనిపిస్తుంది. 2014 రాష్ట్ర ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ సమస్యపై దృష్టి సారించారు.
విద్యుత్‌శాఖలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి రైతులకు, ప్రజలకు, చిరువ్యాపారులకు, పరిశ్రమలకు ఎటువంటి విద్యుత్ సమస్య తలెత్తకుండా నిరంతర విద్యుత్‌ను అందించారు. గత కాంగ్రెస్ ముఖ్యమంత్రి అన్న మాటలు తిప్పి కొడుతూ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రెప్పపాటు కూడా విద్యుత్ నిలిచిపోకుండా చర్యలు తీసుకొని సీమాంధ్రపాలకులు చేసిన ఆరోపణలకు, నిరంతర విద్యుత్ అందించి కేసీఆర్ దీటైనా సమాధానం ఇచ్చారు. గత పదేండ్ల కాలంలో అన్నివర్గాల ప్రజలకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ను అందించి, కోతలు లేని రాష్ట్రంగా తెలంగాణ విద్యుత్ వ్యవస్థను తీర్చిదిద్దారు. ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఓ వైపు మరమ్మతుల పేరిట మూడు గంటలకు పైగా విద్యుత్ సరఫరా నిలిపి వేయడంతోపాటు, అనధికారికంగా రోజులో మరో రెండు గంటల పాటు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడంతో ప్రజలు పాత రోజులను గుర్తుచేసుకుంటున్నారు.
చిరు వ్యాపారులకు ఉపాధిపై దెబ్బ
విద్యుత్‌శాఖ విధిస్తున్న అప్రకటిత కరెంట్ కోతలతో చిరువ్యాపారుల ఉపాధిపై తీవ్ర ప్రభావం పడుతున్నది. ప్రధాన పట్టణాలతోపాటు మండల కేంద్రాల్లో వెల్డింగ్ దుకాణాలు, మోటర్వైండింగ్ దుకాణాలు, జిరాక్స్ సెంటర్లు కరెంట్‌పైనే ఆధారపడి నడిచే వ్యాపారాలపై కరెంట్ కోతల ప్రభావం తీవ్రంగా ఉంటున్నది. మరమ్మతుల పేరిట గంటల కొద్దీ విద్యుత్ సరఫరా నిలిపి వేడయంతో వ్యాపారులు ఆర్థికంగా నష్టపోతున్నారు. గత పదేండ్ల కాలంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురు కాలేదని వ్యాపారులు అంటున్నారు. పల్లె ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉన్నది.
ఇన్వర్టర్లకు పెరిగిన గిరాకీ
విద్యుత్ అప్రకటిత కోతల నుంచి వ్యాపారులతోపాటు ప్రజలు ఉపశమనం పొందడానికి ఇన్వర్టర్లు కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఇన్వర్టర్ల గిరాకీ బాగా పెరిగిపోయింది. విధిలేని పరిస్థితుల్లో ప్రజలు వ్యయప్రయాసలకు ఓర్చి ఇన్వర్టర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఎక్కడ చూసిన ఇన్వర్టర్ల దుకాణాలు కళకళలాడుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం అప్రకటిత విద్యుత్ కోతలే అంటున్నారు ప్రజలు.
మరమ్మతుల పేరుతో 3 గంటలకుపైగా కోతలు
మరమ్మతుల పేరిట నెలలో 11 రోజులకు పైగా జిల్లాలో రెండు గంటల నుంచి మూడు నాలుగు గంటల వరకు విద్యుత్ సరఫరా విద్యుత్‌శాఖ అధికారులు నిలిపివేస్తున్నారు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 7 గంటల నుంచి ఒక్కొసారి 9గంటల వరకు, 10 నుంచి 12 గంటల వరకు మరోసారి, మధ్యాహ్నం 2 నుంచి 5గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపి వేయడంతో ముఖ్యంగా ఉద్యోగస్తులు, గృహిణులు ఇబ్బందులు పడు తున్నారు. ఈ సమయంలో ఇంట్లో కుక్కర్లతో పాటు గీజర్ తదితర వాటిని వినియోగించు కుంటారు. ఆ సమయంలో విద్యుత్ సరఫరా నిలిపి వేయడంతో వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గత ఫిబ్రవరి నెలలో 11 రోజుల పాటు ఉదయం 7:30 గంటల నుంచి 10గంటల వరకు, 11నుంచి 12గంటల వరకు, 3నుంచి 5గంటల వరకు మరమ్మతుల పేరిట విద్యుత్ సరఫరా నిలిపివేశారు. మార్చినెల మొదటి రోజు ఉదయం 10 గంటల నుంచి 12గంటల వరకు మరమ్మతుల పేరుతో అప్రకటిత కోతలు విద్యుత్‌శాఖ అధికారులు విధించారు. ఫిబ్రవరి, మార్చి మొదటలో ఇలా ఉంటే ఇక ఏప్రిల్, మే నెలలో ఎండలు ఎక్కువగా ఉంటాయి అప్పటి పరిస్థితి ఎంటో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఒక్కో సారి రోజులో రెండు ప్రాంతాల్లో రెండు సమయాల్లో విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెల కొంది. విద్యుత్ కోతలు భరించలేక ప్రజలు ఇన్వర్టర్లు కొనుగోలు చేసి ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 26నెలల కాలంలో మళ్లీ ప్రజలకు, చిరు వ్యాపారులకు కరెంట్ కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికైనా ప్రభుత్వం, విద్యుత్‌శాఖ అధికారులు స్పందించి ఎక్కువ కోతలు లేకుండా, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మరమ్మతులు చేసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.