నిరుద్యోగ యువతకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. వారిని అక్రమంగా అరెస్టులు చేస్తూ చిత్రహింసలకు గురిచేస్తున్నది. ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చాలని అడిగినందుకు పోలీసు స్టేషన్లలో నిర్బంధిస్తూ అరాచకపాలన సాగిస్తున్నది. ఈ క్రమంలో తాజాగా సోమవారం రాష్ట్ర పర్యటనకు వచ్చిన రాహుల్ గాంధీ.. అశోక్‌నగర్‌కు వెళ్లకుండా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా వికారాబాద్‌కు వెళ్లిపోయారు. అయితే ఆయన తాజా పర్యటనపై నగరంతో పాటు వికారాబాద్ జిల్లాలోని నిరుద్యోగులు, బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాలపై నిలదీస్తారనే భయంతో ఎక్కడికక్కడ అరెస్టు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సిటీ బ్యూరో, చిక్కడపల్లి, మార్చి 2 (నమస్తే తెలంగాణ): నిరుద్యోగ యువతకు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. వారిని నడిరోడ్డున పడేసింది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి నిండా ముంచింది. 2023లో ఎన్నిల ప్రచారానికి హైదరాబాద్ వచ్చిన కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ నిరుద్యోగులపై కపట ప్రేమ ఒలకబోశారు. అశోక్‌నగర్ సెంట్రల్ లైబ్రరీకి వెళ్లి వారితో చిట్‌చాట్ నిర్వహించారు. నిరుద్యోగుల పరిస్థితి చూసి చలించిపోయానని మొసలి కన్నీరు కార్చారు. ఏడాది తిరగముందే ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చి వెళ్లారు. ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించి, అధికార బీఆర్ఎస్పై ప్రజల్లో అపోహలు సృష్టించి అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులను పట్టించుకున్న నాథుడే కరవయ్యారు.
ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాల భర్తీ చేపట్టాలని అడిగిన విద్యార్థులపై అక్రమ కేసులు పెట్టి జైళ్లలో పెట్టించారు. రెండున్నరేండ్లుగా పట్టుమని 10 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా విద్యార్థులే నోటిఫికేషన్లు ఇవ్వొద్దని ధర్నా చేస్తున్నట్లు స్వయంగా ముఖ్యమంత్రి అబద్ధాలు మాట్లాడారు. తాజాగా తెలుగు రాష్ర్టాల కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షుల సమావేశానికి హాజరయ్యేందుకు రాహుల్ గాంధీ సోమవారం తెలంగాణకు వచ్చారు. రెండున్నరేండ్ల కిందట ఇచ్చిన హామీ ఏమైందని నిరుద్యోగులు ప్రశ్నిస్తారనే భయంతో నేరుగా సమావేశం ఏర్పాటు చేసిన వికారాబాద్‌కు వెళ్లారు. రాహుల్ గాంధీని నిలదీస్తారనే నెపంతో అశోక్‌నగర్‌లో నిరుద్యోగులను అక్రమంగా అరెస్టులు చేశారు. ఉదయం నుంచే ఎక్కడికక్కడ బైండోవర్లు చేసి నిర్దాక్షిణ్యంగా పోలీసు స్టేషన్లకు తరలించారు.
అర్ధరాత్రి అక్రమ అరెస్టులు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా రాహుల్‌గాంధీ నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా మోసం చేశారు. ఈనేపథ్యంలో విద్యార్థులు రాహుల్ గాంధీ పర్యటనను అడ్డుకుంటారనే భయంతో పోలీసులు అర్ధరాత్రి నుంచే అక్రమ అరెస్టులకు తెరలేపారు. దొరికిన వారిని దొరికినట్లే అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్లకు తరలించారు. సోమవారం తెల్లవారుజామున 4.30 గంటలకే నిరుద్యోగ జేఏసీ నాయకులను అరెస్టు చేశారు.
అశోక్‌నగర్‌లో ఉండే కొడంగల్ రవి కుమార్, జేఏసీ నేతలు శంకర్ నాయక్, రవి రాథోడ్, రవికుమార్, లక్షి్ష్మకాంత్, తారాచంద్, తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకుని చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్ తరలించారు. చిక్కడపల్లి లైబ్రరీలో నిరుద్యోగులు కయ్య వెంకటేశ్, సురేష్ నాయక్, లక్ష్మణ్, కుమార్ తదితరులను ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం చిక్కడపల్లి సెంట్రల్ లైబర్రీ, అశోక్‌నగర్ ప్రాంతాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. విద్యార్థులు, నిరుద్యోగుల అక్రమ అరెస్టులను జేఏసీ నేతలు తీవ్రంగా ఖండించారు.
రాహుల్‌కు అర్హత లేదు
ఎన్నికలప్పుడు తమ దగ్గరకు వచ్చి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని నమ్మకద్రోహం చేసిన రాహుల్ గాంధీకి తెలంగాణకు వచ్చే అర్హత లేదని నిరుద్యోగులు స్పష్టం చేశారు. తమ దగ్గరకు వచ్చి టీ తాగుతూ.. యూపీఎస్సీ తరహాలో జాబ్ క్యాలెండర్ రూపొందిస్తామని చెప్తే నమ్మినందుకు తగిన గుణపాఠం చెప్పారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతున్నా ఒక్కటంటే ఒక్కటి కూడా జనరల్ నోటిఫికేషన్ ఇవ్వకుండా మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాలిచ్చి నిరుద్యోగుల ఆత్మహత్యలను ఆపుతామని చెప్పి, చేసిన మోసానికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 15 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలకు కారణమయ్యారని ఆరోపించారు. కాంగ్రెస్ అంటేనే అబద్ధాలు, నమ్మకద్రోహం, దోపిడీ అని మరోసారి నిరూపించారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు, నిరుద్యోగులను నమ్మించి మోసం చేసి.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఇక్కడికి వచ్చారని ప్రశ్నించారు. మాయ మాటలు చెప్పిన రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డిలకు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు.
హామీలు అమలు చేయమంటే అక్రమ అరెస్టులా?
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఇచ్చిన హామీని అమలు చేయమంటే అక్రమంగా అరెస్టు చేస్తారా? ఎన్నికల ముందు ఓట్ల కోసం సిటీ సెంట్రల్ లైబ్రరీకి వచ్చి మా టీ తాగి మాయమాటలు చెప్పిన రాహుల్‌గాంధీ.. అధికారంలోకి వచ్చాక ఇక్కడికి రావడానికి ఎందుకు భయపడుతున్నారు? రాహుల్‌గాంధీకి నిరుద్యోగుల సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే మళ్లీ సెంట్రల్ లైబ్రరీకి రావాలి. తెలంగాణకు రాకముందే మమ్మల్ని అర్ధరాత్రి అక్రమంగా అరెస్టు చేశారు. అంటే నిరుద్యోగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని రాహుల్‌గాంధీ సిగ్గుపడుతున్నారా? మోసం చేసి అధికారంలోకి వచ్చిన రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డికి నిరుద్యోగుల సత్తా ఏంటో రుచిచూపిస్తాం. ఉద్యోగాలు భర్తీ చేయాలని అడిగితే అక్రమ అరెస్టు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తాం. ఎన్నికల ముందు నిరుద్యోగులు, విద్యార్థుల గురించి గొంతులు చించుకున్న మేధావులకు మా అక్రమ అరెస్టులు కనిపించడం లేదా? విద్యార్థులను అరెస్టు చేస్తూ నిర్బంధాలకు గురిచేయమే ప్రజాపాలనా?
– కొడంగల్ రవికుమార్, నిరుద్యోగ జేఏసీ నేత
నిరుద్యోగుల గొంతు నొక్కాలని చూస్తే సహించం
అక్రమ అరెస్టులతో నిరుద్యోగుల గొంతు నొక్కాలని చూస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తాం. ఇచ్చిన హామీలు అమలు చేయమంటే నిరుద్యోగులు, ఉద్యోగులను నిర్బంధించడం దారుణం. నిరుద్యోగులంటే రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి ఎందుకు భయపడుతున్నారు? మాకిచ్చిన హామీలను అమలు చేయాలని అడగటం దేశద్రోహమా? విద్యార్థులు, నిరుద్యోగులంటే కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డికి ఎందుకంత కోపం? ఇలా అక్రమంగా అరెస్టులు చేసి నిర్బంధించేందుకే.. మాదగ్గరికి వచ్చి కల్లబొల్లి ముచ్చట్లు చెప్పి ఓట్లేయించుకున్నారా? తెలంగాణలో కాంగ్రెస్ ప్రజాపాలన కాదు.. అరాచక పాలన సాగుతున్నది. పోలీసులను ఇష్టారీతిన మా ఇండ్లళ్లకు పంపించి నిర్బంధిస్తున్నారు. ప్రభుత్వ అక్రమ చర్యలను తిప్పికొడతాం.
– శంకర్ నాయక్, నిరుద్యోగ జేఏసీ నాయకుడు