టోక్యో: జపాన్‌లో మంగళవారం 7.1 తీవ్రతతో భూకంపం(Japan Earthquake) సంభవించిన విషయం తెలిసిందే. ఆ భూకంపంలో సుమారు 13 మంది మృతిచెందినట్లు జపాన్ ప్రధాని సనాయి తకాయిచి తెలిపారు. కషిమా పట్టణంలో ఓ మాల్ కూలింది. ఆ ఘటనలో ఇద్దరు మృతిచెందినట్లు తెలిసింది. దక్షిణ జపాన్‌లోని ప్రధాన ద్వీపమైన క్యుషులో మంగళవారం మధ్యాహ్నం రిక్టర్ స్కేల్‌పై 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. జపాన్ పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ ‘ఎన్‌హెచ్‌కే’ అందించిన సమాచారం ప్రకారం కషీమా టౌన్‌లోని దెబ్బతిన్న అయోన్ షాపింగ్ మాల్లో పలువురు చిక్కుకుపోయినట్లు అనుమానిస్తున్నారు. ఈ మాల్లో భారీ పేలుడు సంభవించిందని, దీనివల్ల కొందరు ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చని తొలుత పోలీసు వర్గాలు వెల్లడించాయి.
భూకంపం వల్ల భారీ నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమర్జెన్సీ డిజాస్టర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రధాని తకాయిచి వెల్లడించారు. ఎమర్జెన్సీ డిజాస్టర్‌కు తానే అధిపతిగా ఉన్నట్లు ప్రధాని చెప్పారు. కేబినెట్ మంత్రులు కూడా ఆ శాఖలో ఉన్నారు. భూకంప ప్రభావిత ప్రాంతంలో తక్షణమే చర్యలు చేపట్టనున్నారు. విద్యుత్తు సరఫరాను పునరుద్దరించనున్నారు. నీటి కొరత ఏర్పడిన ప్రదేశాలకు నీరు అందించనున్నారు. జపాన్‌లో ప్రస్తుతం హీట్ స్ట్రోక్ కూడా ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది.