Constitution of India | ప్రజాస్వామ్య వ్యవస్థ మూడు ప్రధాన స్తంభాలపై నిలబడి ఉంటుంది. శాసన వ్యవస్థ చట్టాలను రూపొందిస్తుంది. కార్యనిర్వాహక వ్యవస్థ వాటిని అమలు చేస్తుంది. న్యాయవ్యవస్థ రాజ్యాంగాన్ని, చట్టాలను పరిరక్షిస్తూ అన్ని వ్యవస్థలు తమ పరిధిలో పని చేస్తున్నాయా లేదా అనే విషయాన్ని పర్యవేక్షిస్తుంది. ఈ మూడు వ్యవస్థలలో ఏ ఒక్కటి కూడా తన పరిధిని దాటి వ్యవహరించినా ప్రజాస్వామ్య సమతుల్యత దెబ్బతింటుంది. అందుకే భారత రాజ్యాంగ నిర్మాతలు చట్టబద్ధమైన (రూల్ ఆఫ్ లా) పాలన అనే సూత్రాన్ని ప్రజాస్వామ్యానికి ప్రాణంగా భావించారు. తెలంగాణ హైకోర్టులో హైడ్రా కమిషనర్ ఏ.వి.రంగనాథ్ వ్యవహారానికి సంబంధించిన పరిణామాలు పరిపాలనా వ్యవస్థలో రాజ్యాంగబద్ధ బాధ్యతలపై దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. కోర్టు ఉత్తర్వులను పదేపదే ఉల్లంఘించడం, కోర్టు ధిక్కరణ విచారణలను సైతం పట్టించుకోకపోవడం, న్యాయస్థానం వ్యక్తం చేసిన తీవ్ర అసంతృప్తి వంటి అంశాలు కేవలం ఒక అధికారి వ్యక్తిగత వ్యవహారంగా కాకుండా మొత్తం పరిపాలనా వ్యవస్థ బాధ్యతను ప్రశ్నించే పరిస్థితిని సృష్టించాయి.
భారతదేశంలో ఏ అధికారి అయినా, ఏ ప్రభుత్వం అయినా, ఏ సంస్థ అయినా రాజ్యాంగం కంటే గొప్పది కాదు. ప్రతి ఒక్కరూ ప్రధానంగా గుర్తుంచుకోవలసిన విషయమిది. ప్రభుత్వం జారీ చేసిన ఒక ఉత్తర్వు (జీవో) ద్వారా ఏర్పడిన సంస్థకు చట్టానికి అతీతమైన అధికారాలు లభించవు. జీవో అనేది శాసనసభ చేసిన చట్టానికి లోబడే ఉంటుంది. ఒక కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా న్యాయస్థానాల అధికారాలు, చట్టబద్ధమైన శాఖల అధికారాలను పక్కన పెట్టే పరిస్థితి ఏర్పడితే అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా మారుతుంది.
రాజ్యాంగంలోని అధికరణం-141 ప్రకారం సుప్రీంకోర్టు ప్రకటించిన న్యాయసూత్రాలు దేశంలోని అన్ని కోర్టులకు, ప్రభుత్వ అధికారులు కట్టుబడి ఉండాలి. అధికరణం-144 ప్రకారం దేశంలోని ప్రతి సివిల్ సర్వెంట్, న్యాయాధికారి సుప్రీంకోర్టుకు సహకరించాల్సిన బాధ్యత కలిగి ఉంటారు. ఇదే సూత్రం హైకోర్టుల తీర్పుల విషయంలో కూడా వర్తిస్తుంది. రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ అధికారి హైకోర్టు ఉత్తర్వులను గౌరవించి అమలు చేయాల్సిన రాజ్యాంగబద్ధ బాధ్యత కలిగి ఉంటారు. హైకోర్టు లేదా సుప్రీంకోర్టు ఒక ఆదేశం ఇచ్చిన తర్వాత దానిని అమలు చేయాలా వద్దా అనే నిర్ణయం ప్రభుత్వ అధికారికి ఉండదు. తప్పకుండా అమలు చేయడం విధి. వ్యక్తిగత అభిప్రాయాలు, రాజకీయ ఆదేశాలు, పరిపాలనా సౌలభ్యం ఏ కారణంతోనైనా కోర్టు ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడం ప్రజాస్వామ్య వ్యవస్థనే బలహీనపరుస్తుంది. కోర్టు ధిక్కరణ చట్టం-1971 ప్రకారం కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా అమలు చేయకుండా ఉండటం సివిల్ ధిక్కరణగా పరిగణనలోకి వస్తుంది. ఈ చట్టం ఉద్దేశం అధికారులను శిక్షించడం మాత్రమే కాదు, న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని కాపాడటం. ఎందుకంటే కోర్టు తీర్పులు అమలుకాకపోతే న్యాయం కేవలం కాగితాలకే పరిమితమవుతుంది.
సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో ఈ అంశాన్ని స్పష్టంగా పేర్కొన్నది. ప్రభుత్వ అధికారులు చట్టానికి అతీతులు కాదని, అధికారంలో ఉన్న వ్యక్తులు కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే ఆ అధికారి బాధ్యత మరింత ఎక్కువగా ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం పదేపదే స్పష్టం చేసింది. ప్రభుత్వ యంత్రాంగం కోర్టు ఆదేశాలను నిర్లక్ష్యం చేయడం రాజ్యాంగ పాలనను బలహీనపరుస్తుందని వ్యాఖ్యానించింది.
సివిల్ సర్వెంట్ అంటే రాజకీయ నాయకుడి ప్రతినిధి కాదు, రాజ్యాంగ ప్రతినిధి. అందుకే ఆల్ ఇండియా సర్వీస్ (కండక్ట్) రూల్స్, 1968 ప్రకారం ప్రతి అధికారి నిజాయితీ, నిష్పాక్షికత, చట్టబద్ధతతో వ్యవహరించాల్సిన బాధ్యత కలిగి ఉంటారు. సేవా నియమాలు అధికారికి అధికారం ఇవ్వడమే కాదు, ఆ అధికార వినియోగానికి స్పష్టమైన పరిమితులను కూడా విధిస్తాయి. చట్టం అనుమతించిన మేరకే చర్యలు తీసుకోవాలి. చట్టం ఇవ్వని అధికారాన్ని స్వయంగా సృష్టించుకోవడానికి అవకాశం లేదు. హైడ్రా వంటి సంస్థల విషయంలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. ఒక జీవో ద్వారా ఏర్పాటు చేసిన సంస్థకు చట్టబద్ధమైన రెవెన్యూ అధికారాలపై పూర్తి ఆధిపత్యం ఉండదు. భూఆక్రమణల విషయంలో సంబంధిత చట్టాలు, రెవెన్యూశాఖ అధికారాలు, సహజన్యాయ సూత్రాలు అన్నీ పాటించాల్సిందే. నోటీస్ ఇవ్వకుండా, వినతులు వినకుండా, కోర్టు ఉత్తర్వులను పక్కనబెట్టి పరిపాలనా చర్యలు తీసుకోవడం రాజ్యాంగపరంగా నిలబడటం కష్టం.
ఇటువంటి సందర్భాల్లో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి ఏమిటంటే ప్రభుత్వ మద్దతు ఉన్నదనే భావనతో అధికారులు తమ అధికార పరిధిని దాటి వ్యవహరించడం. రాజకీయ నాయకత్వం మారుతుంది. ప్రభుత్వాలు మారుతాయి. కానీ సివిల్ సర్వెంట్ మాత్రం రాజ్యాంగానికి విధేయుడిగా కొనసాగాలి. అధికారికి రక్షణ కల్పించేది రాజకీయ నాయకత్వం కాదు, చట్టబద్ధమైన విధి నిర్వహణ మాత్రమే.
భారతదేశ పరిపాలనా చరిత్రలో ఎన్నో సందర్భాల్లో సుప్రీంకోర్టు ఈ విషయాన్ని స్పష్టం చేసింది. నేను ప్రభుత్వ ఆదేశాలు పాటించాను అనే కారణం కోర్టు ధిక్కరణకు రక్షణ కాదని పలు తీర్పులు పేర్కొన్నాయి. చట్టవిరుద్ధమైన ఆదేశాన్ని అమలు చేయకుండా ఉండటం కూడా ఒక ప్రభుత్వ అధికారి విధిలో భాగమే. భారత రాజ్యాంగం హైకోర్టులకు కేవలం వివాదాలను పరిష్కరించే అధికారాన్ని మాత్రమే ఇవ్వలేదు. అధికరణం- 215 ప్రకారం ప్రతి హైకోర్టు ఒక కోర్ట్ ఆఫ్ రికార్డ్. అంటే తన గౌరవాన్ని, తన ఆదేశాల అమలును కాపాడుకొనే స్వతంత్ర అధికారాన్ని కలిగి ఉంటుంది. కోర్టు ధిక్కరణకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకొనే అధికారం కూడా ఈ రాజ్యాంగ నిబంధన నుంచే ఉద్భవిస్తుంది. ఇది వ్యక్తిగతంగా న్యాయమూర్తి ప్రతిష్ఠను కాపాడేందుకు కాదు, న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని పరిరక్షించేందుకు.
కోర్టు ఒక ఉత్తర్వు ఇచ్చిన తర్వాత ప్రభుత్వ అధికారి దానిని అమలు చేయకుండా పదేపదే నిర్లక్ష్యం చేస్తే, అది ఒక వ్యక్తిపై జరిగిన అన్యాయం మాత్రమే కాదు, మొత్తం రాజ్యాంగ వ్యవస్థకే సవాలు చేసినట్టే. అందుకే సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో రూల్ ఆఫ్ లా అనేది భారత రాజ్యాంగపు ప్రాథమిక నిర్మాణంలో భాగమని స్పష్టం చేసింది. ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయడానికి ఏర్పడుతాయి. అయితే ప్రభుత్వ ప్రతి చర్య కూడా చట్టానికి లోబడే ఉండాలి. కార్యనిర్వాహకశాఖ తనకు నచ్చిన విధంగా చట్టాలను అమలు చేయడం, లేదా కోర్టు ఉత్తర్వులను పక్కన పెట్టి చర్యలు తీసుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. ప్రభుత్వ ఉత్తర్వు (జీవో) ఒక చట్టానికి ప్రత్యామ్నాయం కాదు. అది చట్టానికి లోబడి ఉన్నంత వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది.
భూపరిపాలన విషయంలో శాసనసభ రూపొందించిన రెవెన్యూ చట్టాలు స్పష్టంగా అధికారాలను నిర్దేశిస్తాయి. భూమి యాజమాన్యం, ఆక్రమణ, సర్వే, రికార్డుల సవరణ, స్వాధీనం వంటి అంశాలకు సంబంధించి ఏ శాఖకు ఏ బాధ్యత అనే విషయం చట్టం నిర్ణయిస్తుంది. అలాంటి పరిస్థితిలో ఒక కార్యనిర్వాహక సంస్థ తన పరిధిని దాటి ఇతర శాఖల చట్టబద్ధ అధికారాలను నిర్వీర్యం చేస్తే, అది న్యాయపరమైన ప్రశ్నలను లేవనెత్తడం సహజం.
ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ ప్రకారం ఒక ఐఏఎస్ లేదా ఐపీఎస్ అధికారి ప్రజాప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని, చట్టబద్ధంగా, నిష్పాక్షికంగా, సమగ్రతతో వ్యవహరించాలి. అధికార వినియోగం ఎప్పుడూ చట్టబద్ధమైన పరిమితుల్లోనే ఉండాలి. ప్రభుత్వం ఒక చర్య తీసుకోవాలని చెప్పిందనే కారణంతో చట్టవిరుద్ధమైన ఆదేశాలను అమలు చేయడానికి రూల్స్ అనుమతి ఇవ్వలేదు. ప్రభుత్వాలు మారినప్పుడు కూడా ఆ అధికారులే పనిచేస్తారు. కాబట్టి వారి విధేయత వ్యక్తులకు కాదు; రాజ్యాంగానికి లోబడి ఉండాలి. న్యాయవ్యవస్థ తరచూ చెప్పే ఒక ముఖ్యమైన సూత్రం ఏమిటంటే, అధికారం ఎంత ఎక్కువగా ఉంటే, బాధ్యత కూడా అంత ఎక్కువగా ఉంటుంది. ప్రజల ఆస్తి, నివాసం, జీవనోపాధిపై ప్రభావం చూపే అధికారాన్ని వినియోగించే ప్రతి అధికారి కూడా అత్యంత జాగ్రత్తగా, చట్టబద్ధంగా వ్యవహరించాలి. లేకపోతే ప్రజాస్వామ్యంలో అధికారంపై ప్రజల విశ్వాసం దెబ్బతింటుంది. ఈ మొత్తం పరిణామం నుంచి ప్రభుత్వాలు కూడా ఒక పాఠం నేర్చుకోవాలి. చట్టబద్ధమైన పరిమితుల్లో పనిచేసే అధికారిని ప్రభుత్వం రక్షించడం సహజం. కానీ కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన చర్యలను సమర్థించడం, న్యాయవ్యవస్థతో ఘర్షణకు దారితీసే పరిస్థితులను సృష్టించడం ప్రజాస్వామ్య పరిపాలనకు అనుకూలం కాదు. న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ పరస్పర గౌరవంతో పనిచేసినప్పుడే రాజ్యాంగ వ్యవస్థ బలపడుతుంది. ఈ వ్యవహారంలో చివరికి గుర్తుంచుకోవాల్సిన గొప్ప సత్యం ఒక్కటే.
ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రభుత్వానికి పనిచేస్తారు. కానీ ప్రభుత్వ రాజకీయ కార్యక్రమాలను అమలు చేయడానికి కాదు, రాజ్యాంగం, చట్టాలు నిర్దేశించిన పరిమితుల్లో ప్రజా పరిపాలన నిర్వహించడానికి పనిచేస్తారు. మంత్రి లేదా ముఖ్యమంత్రి ఇచ్చిన ప్రతీ ఆదేశం చట్టబద్ధమని భావించడం సివిల్ సర్వీస్ నైతికత కాదు. చట్టవిరుద్ధమైన ఆదేశాన్ని అమలు చేయకుండా ఉండటమే నిజమైన రాజ్యాంగ విధేయత.
సుప్రీంకోర్టు సోమేశ్ తివారీ వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా (2009) కేసులో ‘అధికార వినియోగం ఎప్పుడూ ప్రజాప్రయోజనానికి అనుగుణంగా ఉండాలి’ అని స్పష్టం చేసింది. ప్రభుత్వ సంస్థలకు చట్టం ఇచ్చిన అధికారాలు ప్రజల హక్కులను రక్షించడానికి మాత్రమే. ప్రజల హక్కులను హరించడానికి కాదు.
ప్రస్తుత పరిణామాలు మరో కీలకమైన ప్రశ్నను కూడా లేవనెత్తుతున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వు ద్వారా ఏర్పడిన సంస్థకు శాసనసభ రూపొందించిన చట్టాల కంటే ఎక్కువ అధికారం ఎలా ఉంటుంది? ఒక జీవో ద్వారా రెవెన్యూశాఖ, మున్సిపల్, పోలీస్శాఖలు, ఇతర చట్టబద్ధ అధికార వ్యవస్థలన్నింటినీ పక్కనపెట్టే విధంగా అధికార కేంద్రీకరణ జరిగితే, అది రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణమా? ఈ ప్రశ్నకు సమాధానం చివరికి కోర్టులే చెప్తాయి. కానీ ఈ ప్రశ్న తలెత్తడమే పరిపాలనా వ్యవస్థ ఆత్మపరిశీలన చేయాల్సిన అవసరాన్ని సూచిస్తుంది. రాజకీయ నాయకత్వం కూడా ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం చట్టపరమైన పరిమితులను నిర్లక్ష్యం చేయడం చివరికి ప్రభుత్వానికే నష్టం చేస్తుంది. భారత రాజ్యాంగం ప్రభుత్వం మీద అపారమైన విశ్వాసాన్ని ఉంచింది. అదే సమయంలో న్యాయవ్యవస్థకు రాజ్యాంగ సంరక్షక పాత్రను అప్పగించింది. ఈ రెండు వ్యవస్థలు పరస్పర గౌరవంతో పనిచేసినప్పుడే ప్రజాస్వామ్యం బలపడుతుంది.
న్యాయస్థానాలను ధిక్కరించి ఏ ప్రభుత్వమూ శాశ్వతంగా విజయం సాధించలేదు. చట్టాన్ని అతిక్రమించి ఏ అధికారమూ చిరస్థాయిగా నిలబడలేదు. అందుకే ప్రతి సివిల్ సర్వెంట్ తన కార్యాలయంలో ఒక వాక్యాన్ని రాసి పెట్టుకోవాలి. ‘నా విధేయత వ్యక్తికి కాదు, పదవికి కాదు, ప్రభుత్వానికి కూడా కాదు, నా మొదటి, చివరి విధేయత భారత రాజ్యాంగానికే. ఇష్టారాజ్యం అంటే నడువదు.. రాజ్యాంగమే సర్వోన్నతం. అదే నిజమైన అఖిల భారత సర్వీసుల ఆత్మ. అదే ప్రజాస్వామ్య పరిపాలనకు మూలస్తంభం. న్యాయపాలనకు శాశ్వత హామీ’.
– వ్యాసకర్త: న్యాయవాది తన్నీరు శ్రీరంగారావు
98489 33606