హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం(Congress) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడతున్న గ్రామ సభలు, వార్డు సభలు(Grama sabhalu) రణరంగంగా మారుతున్నాయి. లబ్ధిదారుల జాబితాలో పేర్లు లేకపోవడంతో నిజనమై అర్హుల ఆవేదనలు, ఆక్రోశాలు కట్టలు తెంచుకుంటున్నాయి. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఆత్మీయ భరోసా వంటి పథకాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు, తాము చెప్పినట్లు వినే వారికే కట్టబెడుతండటంతో ఆగ్రహించిన ప్రజలు అధికారులు, కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులపై రాష్ట్ర వ్యాప్తంగా తిరగబడుతున్నారు. శుక్రవారం చివరి రోజు ప్రారంభమైన గ్రామ సభలు తీవ్ర ఉద్రిక్తతల నడుమ కొనసాగుతున్నాయి.
కమలాపూర్ గ్రామసభలో పాల్గొన్న హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌషిక్ రెడ్డిపై కాంగ్రెస్ మూకలు టమాటాలతో దాడికి పాల్పడ్డారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య జరిగిన మాటల యుద్ధం కొనసాగింది. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామ సభలో తాజా మాజీ సర్పంచ్ నాగరాజు బిల్లులు రావడం లేదని పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నిర్మల్ జిల్లాలోని తానూరు మండల కేంద్రంలో గ్రామసభ ప్రారంభమైన కొద్దిసేపటికే రసాభాసగా మారింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో అనర్హులను ఎంపిక చేశారు అంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట గ్రామసభలో లిస్టులో పేర్లు లేవని అధికారులను నిలదీశారు. జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ నియోజకవర్గం లోని మానోపాడు మండల కేంద్రంలో ప్రజా పాలన గ్రామసభలో గందరగోళం నెలకొంది. యాదాద్రి భువనగిరి మోట కొండూర్ మండలంలోని ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో జాబితాలో తన పేరు రాలేదని ఓ మహిళ కన్నీరు పెట్టుకుంది. మాకు సంబంధం లేదని అధికారులు చేతులు దులుపుకున్నారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం నడుకుడా గ్రామంలో అధికారులతో గ్రామ సభలో గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. మొత్తంగా తీవ్ర నిరసనల నడుమ గ్రామ సభలు కొనసాగుతున్నాయి.