Shantanu Narayen : అమెరికాలోని క్యాలిఫోర్నియాకు చెందిన టెక్ సంస్థ ఆడోబ్ సీఈవో పదవి నుంచి శంతను నారాయణ్ తప్పుకోనున్నారు. త్వరలోనే ఆయన తన పదవి నుంచి తప్పుకోనున్నట్లు ఆడోబ్ కంపెనీ వెల్లడించింది. శంతను 18 ఏళ్లుగా ఆడోబ్ సీఈవోగా కొనసాగుతున్నారు. ఆయన 2007 డిసెంబర్లో సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. కొత్త సీఈవోను ఎంపిక చేసే వరకు శంతను సీఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. కొత్త సీఈవో వచ్చిన తర్వాత ఆయనకు బాధ్యతలు అప్పగించి, శంతను పదవి నుంచి తప్పుకొంటారు.
అయితే, తాను సీఈవోగా మాత్రమే తప్పుకొంటున్నానని, కానీ, బోర్డ్ ఛైర్మన్గా కొనసాగుతానని తెలిపారు. ఆడోబ్ కంపెనీతో అనుబంధం కొనసాగుతుందని, బోర్డ్ ఛైర్మన్గా నిరంతరం సంస్థ కోసం పని చేస్తూనే ఉంటానని శంతను తన ఉద్యోగులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. శంతను తప్పుకోవడానికి గల కచ్చితమైన కారణాలు తెలియరాలేదు. కానీ, ప్రస్తుతం ఏఐ వేగంగా విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆడోబ్ భవితవ్యంపై ఇన్వెస్టర్లు, ప్రమోటర్లలో ఆందోళన నెలకొంది. దీంతో ఆడోబ్ సీఈవోగా కొత్తవారిని నియమించాలనే ఆలోచన సంబంధిత వర్గాలు చేశాయి. దీంతో ఆయన పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా శంతనుపై మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ప్రశంసలు కురిపించారు. శంతను ఒక లెజెండ్ అంటూ వర్ణించారు. ఆడోబ్ను ప్రపంచంలోనే ఒక ముఖ్యమైన సాఫ్ట్వేర్గా నిలిపారని, క్రియేటర్లు, వ్యాపారులు, బ్రాండ్ సంస్థలకు ఆడోబ్ కీలకంగా మారిందని సత్య నాదెళ్ల అన్నారు. ఆయనతో ఉన్న స్నేహానికి, మెంటార్షిప్నకు సత్య నాదెళ్ల కృతజ్ఞతలు తెలిపారు.
శంతను ఆడోబ్ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కంపెనీ గణనీయమైన ప్రగతి సాధించింది. అంతకుముందు కంపెనీలో 3,000 మంది ఉద్యోగులు ఉంటే.. శంతను ఈ సంఖ్యను 30,000కు చేర్చారు. అలాగే 1 బిలియన్ డాలర్లకంటే తక్కువ విలువ కలిగిన కంపెనీని 25 బిలియన్ డాలర్ల వరకు తీసుకెళ్లాడు. కంపెనీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 1998లో ఆయన ఆడోబ్ కంపెనీలో చేరాడు. ఇండియాలో జన్మించిన శంతను నారయణ్ వయసు 62. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం క్యాలిఫోర్నియా యూనివర్సిటీలో ఎంబీఏ చదివారు. అనంతరం ఆడోబ్లో చేరేముందు అక్కడే వివిధ సంస్తల్లో పని చేశారు.