Donald Trump : ఇరాన్ (Iran) పై యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Trump) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ దేశంపై తలపెట్టిన సైనిక దాడి (Strikes On Iran) ప్రణాళికలను రద్దు చేసుకోనున్నట్లు వెల్లడించారు. హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) ను తిరిగి పూర్తిగా తెరవడం, ఇరాన్ అణు ముప్పును అంతం చేయడం వంటి అంశాలతో కూడిన ప్రతిపాదిత ఒప్పందాన్ని ఖరారు చేయడానికి మరింత సమయం కావాలని ఇరాన్, ఇతర పశ్చిమాసియా (West Asia) దేశాలు కోరినట్లు తెలిపారు.
ఒప్పందం వేగంగా ఖరారైతేనే అమెరికా దాడులకు విరామం కొనసాగుతుందని ట్రంప్ పేర్కొన్నారు. ‘రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎన్నడూ చూడని స్థాయిలో సైనికశక్తితో ఇరాన్‌పై దాడి చేయడానికి అమెరికా సన్నద్ధంగా ఉన్నది. మేము కొట్టే దెబ్బకి ఇక భరించలేమని వారు మమ్మల్ని వేడుకుంటారు. అయినప్పటికీ టెహ్రాన్‌పై దాడులు నిలిపివేయాని నిర్ణయించుకున్నా. ఒప్పందంలోని అంశాలపై ఒక అవగాహనకు వచ్చినందున దాడులను నిలిపివేయాలని ఇరాన్ సహా, గల్ఫ్ దేశాలు మమ్మల్ని కోరాయి. దాంతో ప్రపంచ ప్రయోజనాలను, ఇరాన్ మనుగడను దృష్టిలో పెట్టుకొని దాడులను తాత్కాలికంగా ఆపివేస్తున్నాం. యుద్ధాన్ని ముగించి ఇరాన్‌తో ఒప్పందం చేసుకోవడానికి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా అంగీకరించారు’ అని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో వెల్లడించారు.
అయితే ఈ విషయంపై ఇజ్రాయెల్ ఎలాంటి బహిరంగ ప్రకటన చేయలేదు. ఈ వారాంతంలో తమ దేశంపై ఎలాంటి సైనిర చర్యలకు పాల్పడవద్దని ఇరాన్ శనివారం అమెరికాను హెచ్చరించింది. ఒకవేళ అగ్రరాజ్యం దాడులకు పాల్పడితే తమ ప్రతీకారం తీవ్రంగా ఉంటుందని పేర్కొన్నది. సౌదీ అరేబియా, యూఏఈలోని చమురు క్షేత్రాలతోపాటు ఖతార్, ఇజ్రాయెల్‌లోని గ్యాస్ క్షేత్రాలను బూడిద చేస్తామంది. ఈ క్రమంలోనే అమెరికా నుంచి తాజా ప్రకటన వెలువడింది. మరోవైపు ఒప్పందంలోని అంశాలపై ఖతార్, పాకిస్థాన్ విడివిడిగా అమెరికా, ఇరాన్ ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి.