– సేల్స్ ప్రమోషన్లు, యూట్యూబ్లో అనైతిక ప్రచారాలు ఆపాలి
– అసోసియేషన్ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలి
– ఫర్టిలైజర్స్, ఫెస్టిసైడ్స్, సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నాగుర్ల వెంకటేశ్వర్లు
ఖిలా వరంగల్, మార్చి 13 : డీలర్లు అసోసియేషన్ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని, రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందించాలని తెలంగాణ ఫర్టిలైజర్స్, ఫెస్టిసైడ్స్, సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నాగుర్ల వెంకటేశ్వర్లు అన్నారు. సేల్స్ ప్రమోషన్లు, యూట్యూబ్లో అనైతిక ప్రచారాలు పూర్తిగా ఆపాలని సూచించారు. శుక్రవారం శివనగర్ లోని అసోసియేషన్ భవనలో రాష్ట్ర అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన వెంకటేశ్వర్లును సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసోసియేషన్లో చర్చించి తీసుకున్న నిర్ణయాలకు అందరూ కట్టుబడి ముందుకు సాగాలని కోరారు. రైతులకు వెన్నుదండగా నిలబడాలంటూ, నాణ్యతలో రాజీపడకూడదన్నారు. చిన్న తప్పు కూడా రైతుకు పెద్ద నష్టం కలిగిస్తుందన్నారు. కావున నాణ్యమైన కంపెనీల ఉత్పత్తులను మాత్రమే అందించాలని స్పష్టం చేశారు.
కొన్ని కంపెనీలు హైబ్రిడ్ క్వాలిటీలు చూపించకుండా విచ్చలవిడిగా అమ్మకాలు చేస్తున్నారని విమర్శించారు. మంచి ప్రొడక్ట్ ఉంటే రైతులకు, డీలర్లకు చూపించి ప్రమోట్ చేయాలని, యూట్యూబ్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అసోసియేషన్ను మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో బలోపేతం చేయాలంటూ పిలుపునిచ్చారు. వరంగల్ నడిబొడ్డులో ఉన్నట్టు రాష్ట్ర స్థాయిలో కూడా భవన నిర్మాణం చేపడతామన్నారు. హైదరాబాద్కు వచ్చే ఎగ్జిక్యూటివ్ బాడీ సభ్యులకు రెస్ట్ రూమ్లు కల్పిస్తామని ప్రకటించారు. అసోసియేషన్ సభ్యుల సహకారంతో ఈ ప్రణాళికలు అమలు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనోహర్, రాష్ట్ర కోశాధికారి నాగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, ఉమ్మడి జిల్లాలోని డీలర్లు పాల్గొన్నారు.