Hightension Wires | మెదక్ జిల్లా, : చిలిపిచెడ్ మండలం చిట్కుల్ గ్రామంలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగా దాదాపు 14 ఇళ్లపై నుంచి 11 కేవీ హైటెన్షన్ విద్యుత్ లైన్లు ప్రమాదకరంగా వెళ్లడం స్థానికులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. సుమారు 70 నుంచి 80 మంది ప్రజలు నిత్యం ప్రాణభయంతో జీవిస్తున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ స్తంభాలు ఇళ్లకు అత్యంత సమీపంలో ఉండటంతోపాటు వైర్లు సడలిన స్థితిలో ఉండటం వల్ల ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోననే భయం నెలకొంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఎర్తింగ్ సమస్యలు ఏర్పడి విద్యుత్ షాక్కు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందని స్థానికులు చెబుతున్నారు.
చిన్నారులు, వృద్ధులు ఉన్న కుటుంబాలు తీవ్ర భయాందోళనలో కాలం గడుపుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించాలని పలుమార్లు విద్యుత్ శాఖ జిల్లా అధికారులకు DE, SE, AE అధికారులకు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్థులు ఆరోపించారు. పైగా ‘శాఖ వద్ద నిధులు లేవు… మీ సొంత ఖర్చులతో స్తంభాలు, వైర్లు మార్చించుకోండి’ అని అధికారులు చెప్పడం బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు.
అక్కడ నివసించే వారంతా నిరుపేద కుటుంబాలకు చెందినవారని, సొంతంగా విద్యుత్ లైన్లను మార్చించుకునే ఆర్థిక స్థోమత తమకు లేదని తెలిపారు. ఏ క్షణంలోనైనా పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉన్నందున, అధికారులు వెంటనే స్పందించి ఇళ్లపై నుంచి వెళ్తున్న 11 కేవీ విద్యుత్ స్తంభాలు, విద్యుత్ లైన్లను తొలగించి సురక్షిత ప్రాంతానికి తరలించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించే కంటే, ప్రమాదం జరగకముందే చర్యలు తీసుకుని ప్రజల ప్రాణాలను కాపాడాలని ప్రభుత్వం, ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు.
US Tariff Bill | అమెరికా రష్యాపై ఆంక్షల బిల్లు.. భారత్, చైనాలపై సుంకాల చిల్లు