– కీలక శాఖల అధికారులు గైర్హాజరు
చుంచుపల్లి, జూలై 29 : చుంచుపల్లి మండల సర్వసభ్య సమావేశం మండల స్పెషల్ ఆఫీసర్, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి వెంకటేశ్వరరావు అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ఎంపీడీఓ సుభాషిని ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి జడ్పీ సీఈఓ నాగలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ లాల్సింగ్తో పాటు పలువురు సర్పంచులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. మండలంలోని 19 శాఖల అధికారులను సమావేశానికి ఆహ్వానించగా ప్రజా పంపిణీ శాఖ, ఐకేపీ, హౌసింగ్, శిశు సంక్షేమ శాఖ, ఇంజినీరింగ్, గ్రామీణ నీటి సరఫరా (ఆర్డబ్ల్యూఎస్) శాఖల అధికారులు మాత్రమే హాజరై ప్రజాప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అయితే విద్యుత్, వ్యవసాయ, అటవీ, ఎక్సైజ్, మత్స్య, పోలీస్, విద్యాశాఖలకు చెందిన అధికారులు, ఎంఈఓ తదితర కీలక శాఖల అధికారులు సమావేశానికి హాజరు కాలేదు. దీంతో ఆయా శాఖలకు సంబంధించిన సమస్యలను ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమాధానాలు పొందే అవకాశం లేకుండా పోయింది.
ప్రస్తుతం వర్షాకాలం కావడంతో విద్యుత్, వ్యవసాయం తదితర సమస్యలు కీలకంగా ఉన్న సమయంలో సంబంధిత అధికారులు సమావేశానికి గైర్హాజరు కావడంపై పలువురు ప్రజా ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ముందుగానే సమావేశానికి సమాచారం అందించినప్పటికీ అధికారులు హాజరు కాకపోవడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై చర్చించి, వాటికి పరిష్కార మార్గాలు చూపాల్సిన మండల సర్వసభ్య సమావేశాలకు అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరయ్యేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజా ప్రతినిధులు కోరారు.

సాదాసీదాగా చుంచుపల్లి మండల సర్వసభ్య సమావేశం