Vande Mataram : జాతీయ గేయం వందేమాతరం ఆలపించే విషయంలో వివాదం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. ఈ గేయంలోని ఆరు చరణాలను పాడాల్సిందే అంటూ కేంద్రం చట్టం తీసుకొచ్చింది. అయినప్పటికీ, వందేమాతరంలోని పూర్తి చరణాలు ఆలపించడాన్ని కాంగ్రెస్ సహా దేశంలోని పలు రాజకీయ పార్టీలు, సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ అంశంపై సుప్రీంకోర్టు తాజాగా కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఆరు చరణాలు పాడకపోయినంత మాత్రాన పౌరుడిని శిక్షించలేమని కోర్టు చెప్పింది.
ఎన్ని చరణాలు పాడాలన్నది పౌరుడి వ్యక్తిగత నిర్ణయమని కోర్టు అభిప్రాయపడింది. ఆరు చరణాలు తప్పనిసరిగా పాడాల్సిందే అంటూ కేంద్రం చేసిన చట్టాన్ని వ్యతిరేకిస్తూ ప్రముఖ కర్ణాటక సంగీతకారుడు టీఎం కృష్ణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వందేమాతరంలోని చివరి నాలుగు చరణాలు హిందూ దేవతలకు సంబంధించినవి ఉన్నాయని, అలాంటప్పుడు ఇతరులు ఈ చరణాలు పాడేలా బలవంత పెట్టడం సరికాదని, ఇది దేశ లౌకిక వాదానికి విరుద్ధమని తన పిటిషన్లో పేర్కొన్నాడు.
దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చి, జస్టిస్ వీ మోహన ఆధ్వర్యంలోని ధర్మాసనం విచారణ జరిపింది. వందేమాతరం గేయాన్ని రెండు చరణాలు ఉంచాలా.. లేదా ఆరు చరణాలు ఉంచాలా అనే విషయంపై ఇప్పటికిప్పుడు విచారణ చేయలేమని కోర్టు తెలిపింది. అయితే, ఇలా పాడకపోతే చట్టపరంగా శిక్షించవచ్చా.. లేకపోతే శిక్ష నుంచి మినహాయింపు ఇవ్వొచ్చా అనే అంశంపై మాత్రం విచారణ జరుపుతామని ప్రకటించింది.
వందేమాతరాన్ని పూర్తిగా ఆలపించని వారిపై ఎలాంటి క్రిమినల్ చర్యలు తీసుకోలేమని, శిక్షలు విధించలేమని తెలిపింది. వందేమాతరంపై కేంద్రం రూపొందించిన చట్టాలు, శిక్షల అమలు వంటి అంశాల్లో స్పందన తెలియజేయాల్సిందిగా కేంద్రాన్ని సుప్రీంకోర్టు కోరింది. ఇందుకోసం రెండు వారాల సమయం ఇచ్చింది.