సిటీబ్యూరో, మార్చి 2 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 32లోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఉన్న పారు స్థలాన్ని ఒక ప్రైవేట్ వ్యక్తికి ధారాదత్తం చేసేందుకు అధికారులు, పాలకులు చేతులు కలిపారు. సామాన్యుడికి గజం దకడం గగనమైన చోట, ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించిన పారు స్థలాన్ని ఒక బడా ఫార్మా కంపెనీ అధినేతకు అప్పనంగా కట్టబెడుతూ జీహెచ్ఎంసీ నిర్ణయం తీసుకుంది. పరస్పర భూ మార్పిడి అంశంలో తీవ్ర వివాదం నడుస్తున్నా నిబంధనలకు విరుద్ధంగా 98.92 గజాల భూమార్పిడికి సోమవారం జరిగిన స్టాండింగ్ కమిటీ పచ్చజెండా ఊపడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
భూ మార్పిడి అనేది కేవలం సాకు మాత్రమేనని, దీని ముసుగులో సదరు ఫార్మా దిగ్గజం ఏకంగా 1,000 గజాల ప్రభుత్వ స్థలంపై తిష్ట వేయడానికి వ్యూహం రచించారని, ఇందుకు కొందరు అధికారులు వంత పాడారు. ఇందులో భాగంగానే పార్కు పక్కన ఉన్న రహదారికి అడ్డంగా సదరు ఫార్మా కంపెనీ అధినేత బ్లూ షీట్స్ వేసి సదరు ప్రజా రోడ్డు స్థలాన్ని ఆధీనంలోకి తీసుకోవడం, ఈ అంశాన్ని ‘నమస్తే తెలంగాణ’ పలుమార్లు వెలుగులోకి తీసుకురావడంతో జీహెచ్ఎంసీ, హైడ్రా రంగంలోకి దిగి అక్రమంగా ఉన్న బ్లూ షీట్స్‌ను తొలగించి, భూ మార్పిడి అంశాన్ని నిలిపివేశారు.
కొన్నిరోజుల పాటు ఈ అంశాన్ని సైలెంట్ మోడ్‌లోకి పెట్టేసిన అధికారులు స్పెషల్ ఆఫీసర్ పాలన రావడం, ప్రత్యేకాధికారి అధ్యక్షతన సోమవారం జరిగిన జీహెచ్ఎంసీ తొలి కార్పొరేషన్ సమావేశం ఎజెండాలో 11వ అంశంగా పెట్టి లోతైన చర్చ జరగకుండానే ఆమోదించడం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సాధారణంగా పారు స్థలాలను లేదా పబ్లిక్ యుటిలిటీ స్థలాలను ప్రైవేట్ వ్యక్తులకు బదలాయించడం చట్టరీత్యా నేరమని, కానీ సదరు ఫార్మా కంపెనీ యజమాని పలుకుబడి ముందు నిబంధనలు మోకరిల్లాయని, సంబంధిత అధికారుల అత్యుత్సాహంపై పర్యావరణ వేత్తలు మండిపడుతున్నారు.

అసలు భూ మార్పిడి వ్యవహారం ఏందీ?
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల ముందుకు కొన్నిరోజుల కిందట ఓ దరఖాస్తు వచ్చి పడింది. అదేమంటే… ఓ ప్రముఖ ఫార్మా కంపెనీ యాజమానురాలు జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్-32లోని జూబ్లీహిల్స్ సొసైటీలో గతేడాది ఆగస్టు 30న పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులో సమగ్ర వివరాలను పరిశీలిస్తే .. షేక్‌పేట రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 403/1 ఓల్డ్ 120 న్యూ, అలాగే హకీంపేట సర్వే నంబర్ 103/1లో ఉన్న ప్లాట్ నంబర్లు 548/ఏ24, 548/ఏ25లను గతేడాది మే నెలలో కొనుగోలు చేసినట్లు సదరు యాజమాని ప్రభుత్వ దరఖాస్తులో పేర్కొన్నారు.
ఈ ప్లాట్‌కు అనుకుని ఉన్న మరో ప్లాట్ 548/ఏ28ని వారి తల్లిదండ్రులు ఆగస్టులో కొనుగోలు చేశారని, ఈ రెండు కలిపి మొత్తం 2,454 గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్లాట్ల మధ్య రాకపోకలకు సంబంధించి ఇబ్బందులు తలెత్తినట్లు లేఖలో దరఖాస్తుదారుడు పేర్కొన్నాడు. తమ ఆస్థికి నైరుతి (సౌత్-వెస్ట్) మూలలో ఉన్న స్థలం కుచించుకుపోవడం వల్ల తల్లిదండ్రుల ప్లాట్‌లోకి వెళ్లడానికి ఆటంకం కలుగుతుందని వెల్లడించారు. దీనికి పరిష్కారంగా తమ ప్లాట్‌కు ఆగ్నేయ (సౌత్-ఈస్ట్) దిశలో ఉన్న కొంత భూమిని జీహెచ్ఎంసీ పార్కుకు ఇచ్చి దానికి సమానమైన పార్కు స్థలాన్ని తమకు కేటాయించాలని సదరు దరఖాస్తుదారు ప్రభుత్వాన్ని కోరారు.
ఈ మార్పిడి వల్ల అటు పార్కు సరిహద్దులు స్పష్టంగా ఉంటాయని, ఇటు తమ ప్లాట్లకు వెళ్లేందుకు సులభంగా ఉంటుందని పేర్కొన్నారు. తన వద్ద ఉన్న 98.92 చదరపు గజాల సొంత స్థలాన్ని (ప్లాట్ ఆగ్నేయ మూల) జీహెచ్ఎంసీకి అప్పగించడం, దానికి బదులుగా తమ ప్లాటుకు అనుకుని ఉన్న నైరుతి దిశలోని అంతే విస్తీర్ణంలో ఉన్న జీహెచ్ఎంసీ పార్కు భూమిని తనకు అప్పగించాలని కోరారు. దరఖాస్తుదారు పురపాలక శాఖకు అప్పగించడం, అక్కడి నుంచి వచ్చిన ఆదేశాలనుసారం జీహెచ్ఎంసీ అధికారులు 2,454 గజాల ప్లాట్లకు సంబంధించి 2024 సంవత్సరపు డాక్యుమెంట్ నంబర్లు 2855/2024, 2854/2024 ద్వారా పూర్తి యాజమాన్య హక్కులు ఉన్నాయని ఖైరతాబాద్ జోనల్ అధికారుల బృందం స్క్రూట్నీలో తేల్చింది.
కానీ అధికారులు ఈ ప్రతిపాదనను తిరస్కరించకుండా పైగా మార్పిడి చేసే ప్రాంతం ఖాళీగానే ఉందని, ఎటువంటి అక్రమణలు లేవు అని అనుకూలమైన నివేదిక ఇచ్చి గత డిసెంబర్ నెలలో జరిగిన స్టాండింగ్ కమిటీ ముందుకు తెచ్చారు. జీహెచ్ఎంసీ కమిషనర్ సంతకంతో ఈ ఫైల్ స్టాండింగ్ కమిటీ ముందుకు టేబుల్ అంశంగా చివరి నిమిషంలో రావడం.. ఈ ప్రతిపాదనను చకచకా ఆమోదించారు. ఐతే భూ మార్పిడికి సంబంధించి చేతికి ఆయా పత్రాలు రాకుండానే సదరు ఫార్మా కంపెనీ యజమాని సంబంధిత స్థలం చుట్టూ రేకులు వేసి స్వాధీనం కూడా చేసుకున్నారు. ఇంత ఖరీదైన ప్రాంతంలో 98.92 గజాల స్థలం భూ మార్పిడి కాగితాల్లో ఉంటే .. క్షేత్రస్థాయికి వెళితే అదనంగా దాదాపు వేల చదరపు గజాల వరకు ఆక్రమించినా అధికారులూ మౌనంగా ఉన్న తీరును ‘నమస్తే తెలంగాణ’ ఎండగట్టింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు సంబంధిత ప్రజారోడ్డుకు అడ్డంగా వెలిసిన బ్లూ షీట్స్‌ను తొలగించి, భూ మార్పిడి ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసినట్టే వేసి మళ్లీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వెనుక అనేక విమర్శలకు తావిస్తున్నది.
నిబంధనలు ఏం చెబుతున్నాయి?
సాధారణంగా మున్సిపల్ చట్టాల ప్రకారం లే అవుట్లో పార్కు కోసం కేటాయించిన ఓపెన్ స్పేస్‌ను ప్రజా ప్రయోజనాల కోసమే వాడాలి తప్ప ప్రైవేట్ వ్యక్తుల యాక్సెస్ కోసం లేదా వారి సౌకర్యం కోసం మార్పిడి చేయడానికి వీల్లేదు..ఈ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలు సైతం స్పష్టంగా ఉన్నాయని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. పరస్పర భూ మార్పిడి ముసుగులో కోట్ల విలువైన జూబ్లీహిల్స్ పార్కు స్థలం ఇలా ప్రైవేట్ వ్యక్తుల పరం కావడానికి అధికార యంత్రాంగం సహకరించడం వెనుక అసలు ఉద్దేశ్యం ఏంటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ మ్యూచువల్ ఎక్సేంజ్ ఒప్పందానికి స్టాండింగ్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ద్వారా భవిష్యత్తులో గ్రేటర్ హైదరాబాద్‌లోని పార్కులన్నీ ఇలాంటి ‘మార్పిడి’ల పేరుతో కనుమరుగు కావడం ఖాయమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.