బల్దియాలో కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపుల్లో రూ.కోట్ల కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తున్నది. సివిల్ పనుల చెల్లింపుల ప్రక్రియలో మైండ్ బ్లాకింగ్ కుంభకోణం వెలుగు చూసింది. ఒకే పనికి రెండు సార్లు బిల్లులు చెల్లించి అక్రమారులు బల్దియా ఖజానాను కొల్లగొట్టారు. ‘ట్రెండ్స్’విధానాన్ని అడ్డుగా పెట్టుకుని భారీ దోపిడీకి పాల్పడ్డారు. సేవల్లో పారదర్శకత కోసం ప్రవేశపెట్టిన వ్యవస్థనే ఆసరాగా చేసుకొని, ప్రజాధనాన్ని అడ్డగోలుగా పకదారి పట్టించారు. ఒక పనికి రెండేసి సార్లు పేమెంట్లు పొంది కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని నొకేశారు. ట్రెండ్స్ యాప్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడంతో ఈ భారీ కుంభకోణం బట్టబయలైంది. లేదంటే కోట్లాది రూపాయల ప్రజాధనం అక్రమార్కులు కాజేసిన ఘటన వెలుగు చూసేది కాదు. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్వహించే శాఖలోనే ఇంతటి భారీ అక్రమాలు వెలుగుచూడటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. -సిటీబ్యూరో, జూలై 25 (నమస్తే తెలంగాణ)
సిటీబ్యూరో, జూలై 25 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీ పరిధిలో చేపట్టే సివిల్ పనుల బిల్లుల చెల్లింపులను వేగవంతం చేసేందుకు, పారదర్శకత కోసం ‘ట్రెండ్స్’ అనే డిజిటల్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ట్రెండ్స్ సాఫ్ట్‌వేర్‌లోని సాంకేతిక లోపాలను, పర్యవేక్షణ రాహిత్యాన్ని ఆసరాగా చేసుకున్న కొందరు కాంట్రాక్టర్లు, ఫైనాన్స్ విభాగం అధికారులతో చేతులు కలిపారు. ఒకో సివిల్ వర్కు ఒకసారి చెల్లింపులు పూర్తయిన తర్వాత.. మళ్లీ అవే రికార్డులు, వర్ ఆర్డర్లను చూపిస్తూ రెండోసారి కూడా కోట్ల రూపాయల సొమ్మును మళ్లించేశారు. ఇటీవల ట్రెండ్స్ సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేసి, డేటాను ప్రక్షాళన చేస్తున్న క్రమంలో అక్రమం వెలుగుచూసింది. సిస్టంలో ‘మిస్ మ్యాచ్’ కావడం, ఒకే పనికి రెండు ఐడీలతో బిల్లులు క్లియర్ అయినట్లు ఫ్లాగ్ కావడంతో ఉన్నతాధికారులు దిగ్భ్రాంతికి గురయ్యారు. కోట్లాది రూపాయలు పక్కదారి పడుతున్నా గుర్తించకపోవడంతో అవాక్కయ్యారు. ట్రెండ్స్ నిర్వహణలో బాధ్యతారాహిత్యమా? సంబంధిత అధికారులు కాంట్రాక్టర్లతో చేతులు కలిపి పరస్పర సహకారంతోనే కుంభకోణానికి పాల్పడ్డారా? అని ఆరా తీస్తున్నారు.
ఆలస్యంగా మేలొన్న అధికారులు
కోట్ల రూపాయల ప్రజాధనం పకదారి పడుతున్నా ఇన్నాళ్లూ నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించిన అధికారులు.. సాఫ్ట్వేర్ అప్డేట్తో అసలు రంగు బయటపడటంతో దిద్దుబాటు చర్యలకు దిగారు. డబుల్ పేమెంట్స్ పొందిన కాంట్రాక్టర్ల జాబితాను రూపొందించి అంతర్గత విచారణకు ఆదేశించారు. అదనపు సొమ్మును తక్షణమే తిరిగి జీహెచ్ఎంసీ ఖజానాలో జమ చేయాలని, లేదంటే బ్లాక్‌లిస్ట్‌లో పెట్టడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ఫైనాన్స్ విభాగంలో ఏండ్ల తరబడిగా తిష్ట
ఈ కుంభకోణం వెనుక జీహెచ్ఎంసీ ఫైనాన్స్, అకౌంట్స్ విభాగాల్లో ఏండ్ల తరబడిగా తిష్టవేసిన అధికారులే ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ పేమెంట్ల వెనుక కాంట్రాక్టర్లతోపాటు జీహెచ్ఎంసీ ఫైనాన్స్, అకౌంట్స్ విభాగాల్లో ఏళ్ల తరబడి ఒకే చోట తిష్టవేసిన అధికారులు ఉన్నట్లు తెలుస్తున్నది. ఒకే సెక్షన్లలో ఐదు నుంచి పదేండ్ల పాటు పాతుకుపోయిన అధికారులు, సిబ్బంది అండదండలు లేకుండా కాంట్రాక్టర్లు డబుల్ పేమెంట్లు పొందడం అసాధ్యమనే వాదనలు వినిపిస్తున్నాయి. బిల్లులు స్రూటినీ చేయాల్సిన అధికారులు, చెక్ పవర్ ఉన్న స్థానాల్లో ఉన్నవారు కమీషన్ల కకుర్తితోనే ఈ కుంభకోణానికి ఊతమిచ్చారని తెలుస్తోంది. ఏకంగా ముఖ్యమంత్రి పరిధిలోని శాఖలోనే ఈ స్థాయిలో అవినీతి పెచ్చుమీరిపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. తూతూమంత్రంగా డబ్బులు రికవరీ చేసి చేతులు దులుపుకోకుండా, ఈ వ్యవహారంపై సమగ్ర విజిలెన్స్ విచారణ జరిపి దోషులైన అధికారులను కూడా సర్వీసు నుంచి డిస్మిస్ చేయాలని నగరు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.