RSP | హైదరాబాద్ : ఎలక్ట్రిక్ వాహనాల గురించి మీరు మాట్లాడితేనేమో ఒప్పు.. అదే విషయం కేటీఆర్ మాట్లాడితే తప్పు ఎట్లయితది..? అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూటిగా ప్రశ్నించారు. హైటెక్ సిటీలోని సీఐఐ గ్రీన్ బిజినెస్ సెంటర్లో సీఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశాన్ని రేవంత్ రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. ఇతర దేశాల్లోని నగరాలతో ఫ్యూచర్ సిటీ పోటీ పడుతుందని, హైదరాబాద్‌ను కాలుష్య రహితంగా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు.
నాడు కేటీఆర్ తలపెట్టిన మొబిలిటీ వ్యాలీ ఐడియాను కవర్ పేజీ మార్చి రేవంత్ రెడ్డి భలే తస్కరించారు అని ఆర్ఎస్పీ విమర్శించారు. ఇవాళ నిర్వహించిన సీఐఐ సమావేశంలో ఆద్యంతం ఎలక్ట్రిక్ వాహనాల గురించే మీరు మాట్లాడారు. నిజానికి ఐదేండ్ల క్రితమే కేటీఆర్ వీటి గురించి జీవోలు తీసుకొచ్చారు. ఇండస్ట్రీలో ఆ బజ్ సృష్టించడానికే ఫార్ములా-ఈ రేసులను తీసుకొచ్చారు. దాన్ని మీరు అవినీతి అని అంటున్నారు. ఏలాంటి చర్చకు కూడా మీరు సిద్ధంగా లేరు. ఎందుకు..? అని రేవంత్ రెడ్డిని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.
అసలు మీ ఫ్యూచర్ సిటీకి, మొబిలిటీ వ్యాలీకి తేడా ఏమిటో చెప్పండి అని రేవంత్‌కు ఆర్ఎస్పీ సవాల్ విసిరారు. ఈ రోజు మీ మాటల్లో కొన్ని .. ఫ్యూచర్ సిటీని కాలుష్య రహిత నెట్ జీరో సిటీగా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 3,200 ఈవీ బస్సులను ఆర్టీసీలోకి తీసుకువస్తున్నాం. ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్, రోడ్డు పన్నును తొలగించాం. భారతదేశంలోనే ఎలక్ట్రిక్ వాహనాలు అత్యంత వేగంగా అమ్ముడవుతున్న రాష్ట్రం తెలంగాణ. ఓఆర్ఆర్, ట్రిపుల్ ఆర్‌లను అనుసంధానించే రేడియల్ రోడ్లు కూడా నిర్మించబోతున్నాం. ఓఆర్ఆర్, ట్రిపుల్ ఆర్ మధ్య ప్రాంతం తయారీ రంగానికి కేంద్రంగా ఉండబోతుంది. ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్, ఈవీలు, సోలార్ వంటి పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటు కాబోతున్నాయి. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు మాతో కలిసి రండి.. కలిసి అద్భుతాలు సృష్టిద్దాం.. భారతదేశంలోనే కాదు… ప్రపంచంలోనే అత్యున్నత వ్యాపార సౌలభ్యాన్ని నేను మీకు అందిస్తాను అని రేవంత్ వ్యాఖ్యానించినట్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గుర్తు చేశారు.
మీరు మాట్లాడితేనేమో ఒప్పు, అదే విషయం కేటీఆర్ మాట్లాడితే తప్పు ఎట్లయితది? అసలు ఇందులో నేరమెక్కడున్నది..?మీరూ రోజూ కక్ష సాధింపులు చేస్తూ ప్రభుత్వ పాలసీలన్నింటి మీద అక్రమ కేసులు పెడుతూ పోతే ఏ అధికారి పనిచేస్తడు, ఏ కంపెనీ పెట్టుబడులు పెడ్తది..? చెప్పండి..? అని ఆర్ఎస్పీ నిలదీశారు. మీ బంధువులకు, బినామీలకు అప్పజెప్పినంత ఈజీ కాదు పారిశ్రామిక అభివృద్ధి రేవంత్ రెడ్డి. రాత్రింబవళ్లు నిద్రాహారాలు మాని కష్టపడాల్సి ఉంటది. ఇందులో ఎన్నో నిరాశలు తిరస్కారాలు ఉంటయి. మీ పక్కన ఉన్న అధికారులను అడగండి చెబుతారు అని సీఎం రేవంత్ రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచించారు.
ఇవి కూడా చదవండి..
Aarogyasri | రూ. 1200 కోట్ల బకాయిలు.. ఆరోగ్య శ్రీ, ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ సేవలు నిలిపివేత
Lovers Suicide | సింగూరు ప్రాజెక్టు వద్ద హరిత హోటల్లో ప్రేమజంట ఆత్మహత్య
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.. మాజీ ఉప రాష్ట్రపతి అట..!