Aarogyasri | హైదరాబాద్ : మాది ప్రజా పాలన అంటూ ప్రగల్భాలు పలుకుతున్న రేవంత్ సర్కార్.. ఈ రాష్ట్రంలోని పేదలు, ఉద్యోగులు, జర్నలిస్టుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుంది. రాజీవ్ ఆరోగ్య శ్రీ సాయం రూ. 10 లక్షలకు పెంచుతున్నట్లు కాంగ్రెస్ సర్కార్ ప్రకటనలు చేసింది తప్ప.. ఆచరణలో మాత్రం అమలుకు నోచుకోవడం లేదు. ఒక్క ఆరోగ్య శ్రీనే కాదు.. ప్రభుత్వ ఉద్యోగులకు అందించే ఎంప్లాయి హెల్త్ స్కీం, జర్నలిస్టులకు సంబంధించిన జర్నలిస్ట్ హెల్త్ స్కీం పథకాలు అటకెక్కాయి. ఈ మూడింటికి సంబంధించిన పెండింగ్ బకాయిలను రేవంత్ సర్కార్ చెల్లించకపోవడంతో.. ఈ సేవలను నిలిపివేస్తున్నట్లు తెలంగాణ ఆరోగ్య శ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ సభ్యులు శుక్రవారం ప్రకటించారు. ఈ నిలిపివేత తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ. 1200 కోట్ల బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహాకు అసోసియేషన్ సభ్యులు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ వీ రాకేశ్ మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ కింద రోగులకు సేవలు అందిస్తున్నప్పటికీ.. బిల్లుల చెల్లింపులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. ఆయా జిల్లాల్లోని ఆస్పత్రులన్నీ ఈ సమస్యలను ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఆరోగ్య శ్రీ సేవలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వం.. పెండింగ్ బకాయిలను చెల్లించకపోవడం, ఆరోగ్య శ్రీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించకపోవడం ఇబ్బందిగా మారిందన్నారు.
ఆరోగ్య శ్రీ, ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ స్కీంల కింద అందిస్తున్న వైద్య సేవలకు గానూ నెలకు దాదాపు రూ. 100 కోట్ల బిల్లులను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. సంవత్సరానికి అయితే రూ. 1200 నుంచి రూ. 1300 కోట్ల బిల్లులు చెల్లించాలి. ఏడాదికి సంబంధించిన రూ. 1200 కోట్ల బిల్లులు చెల్లించడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తున్న కారణంగానే ఆరోగ్య శ్రీ, ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ సేవలను నిలిపివేయాల్సి వచ్చిందని డాక్టర్ రాకేశ్ పేర్కొన్నారు.
ఆరోగ్య శ్రీ సీఈవో శివశంకర్, నెట్ వర్క్ ఆస్పత్రుల మధ్య గురువారం జరిగిన సమావేశంలో నెల రోజులకు సంబంధించిన వైద్య బిల్లులను కవర్ చేసే రూ. 100 కోట్ల టోకెన్‌ను ప్రభుత్వం అందించింది. ఈ టోకెన్ అమౌంట్‌ను అసోసియేషన్ సభ్యులు తిరస్కరించారు. పెండింగ్ బిల్లుల చెల్లింపులో జాప్యం జరిగినప్పుడల్లా.. రూ. 100 కోట్ల టోకెన్ అమౌంట్‌ను విడుదల చేయడం అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. ఈ అమౌంట్‌తో ప్రయివేటు ఆస్పత్రులు దారిలోకి వస్తాయని ప్రభుత్వం అనుకోవడం పొరపాటు అని అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో పెండింగ్ బిల్లులను చెల్లించాల్సిందేనని వారు డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.. మాజీ ఉప రాష్ట్రపతి అట..!
Lovers Suicide | సింగూరు ప్రాజెక్టు సమీపంలో ప్రేమజంట ఆత్మహత్య