RS Praveen Kumar | హైదరాబాద్ : టీజీ జెన్కోలో కొలువుల భర్తీకి సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయి నాలుగు నెలలు గడుస్తున్నా.. ఇప్పటికీ ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో జెన్కో రాతపరీక్షలో ఉత్తీర్ణత సాధించి, సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిన అభ్యర్థులంతా.. నియామక పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిన్న జెన్కో కార్యాలయం వద్ద నిరసనకు దిగిన విషయం తెలిసిందే. జెన్కో అభ్యర్థుల ఆందోళనలపై బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు.
టీజీ జెన్కోలో ఏం జరుగుతుంది..? అపాయింట్మెంట్ లెటర్స్ ఎందుకివ్వడం లేదు? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూటిగా ప్రశ్నించారు. జెన్కోలో ఏఈ, కెమిస్ట్ పరీక్ష రాసి, ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు ఎంతకాలం ఎదురుచూపులు చూడాలని ఆర్ఎస్పీ నిలదీశారు.
టీచర్లు, స్టాఫ్ నర్సులు, డిగ్రీ కాలేజీ లెక్చరర్లు, ఫిజికల్ డైరెక్టర్లు, గ్రూప్ 4 అభ్యర్థులందరికీ నియామక పత్రాలు ఇచ్చి, వీరికి మాత్రమే ఎందుకు ఇవ్వడం లేదు? అని అడిగారు. సీఎండీ, ఇతర అధికారులేమో ప్రభుత్వం ఇవ్వాలి.. మా చేతిలో ఏం లేదంటరు.. సంబంధిత మంత్రి గారేమో నాలుగు సార్లు కలిసినా పట్టించుకోరు. పరీక్ష నిర్వహిస్తారు.. ఫలితాలు విడుదల చేస్తారు.. వెరిఫికేషన్ చేస్తారు.. ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకుంటరు.. ఆఖరికి బాండ్ పేపర్ కూడా రాయించుకోని రోడ్ల మీద వదిలేస్తరా..? వాళ్లు ఏం పాపం చేసిండ్రు..? వీళ్లు తెలంగాణ ప్రాంతీయులు కాదా..? లేదంటే వీల్లు కూడా నాలుగువేల మంది సర్వ శిక్ష అభియాన్ టీచర్ల మాదిరిగా, రోడ్ల మీద టెంట్లు వేసుకొని ధర్నాలు చేయాలా? ఆలస్యం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? ఇదేనా ప్రజా ప్రభుత్వం అంటే??? ఇట్లనే ఉంటే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని పారదోలడం ఖాయం అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
RS Praveen Kumar | ఇలా చేస్తే పోలీసుల ఆత్మహత్యలను ఆపవచ్చు.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక సందేశం
DSC 2008 | ప్రజా భవన్లో 2008 డీఎస్సీ అభ్యర్థుల ఆందోళన
Savitribai Phule | ఫూలే దంపతులకు భారతరత్న ఇవ్వాలి : ఎమ్మెల్సీ మధుసూదనాచారి