Savitribai Phule | హైదరాబాద్ : తెలంగాణ భవన్లో సంఘ సంస్కర్త సావిత్రి బాయి ఫూలే జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సావిత్రి బాయి ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, తుల ఉమతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
మహిళా విద్య కోసం సావిత్రి బాయి ఎంతో కృషి చేశారు. ఎన్నో నిర్బంధాల మధ్య మహిళలకు విద్య అందించాలని సావిత్రి బాయి తపించి సొంత వనరులతో విద్యాలయాలు స్థాపించారు. ఆధునిక భారత తొలి మహిళా టీచర్‌గా అవతరించారు. ఫూలే దంపతుల స్ఫూర్తితో కేసీఆర్ రాష్ట్రంలో వందలాది గురుకులాలను స్థాపించారు. ప్రతికూలతలను ఎదిరించి బడుగు బలహీన వర్గాలకు విద్య నందించిన ఫూలే దంపతులను ఆదర్శంగా తీసుకుని వారి స్ఫూర్తితో పని చేయాలి. ఫూలే దంపతులకు భారతరత్న ఇచ్చి గౌరవించుకోవాలి. అదే వారికిచ్చే సముచిత గౌరవం. దేశం అన్ని రంగాల్లో బాగుపడాలంటే చదువే ముఖ్యమైన ఆయుధం.
– ఎమ్మెల్సీ మధుసూదనాచారి
దేశంలో అట్టడుగు వర్గాలకు విద్యావకాశాలకు నాంది పలికింది ఫూలే దంపతులే. రిజర్వేషన్ల కోసం, సామాజిక న్యాయం కోసం, మహిళలకు విద్యావకాశాల కోసం విశేషంగా కృషి చేశారు. తొలి మహిళా టీచర్‌గా బాలికల విద్యాభివృద్ధి కోసం సావిత్రి బాయి ఎంతో కృషి చేశారు. కేంద్రంలో ఓబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి. బీసీ గణన దేశవ్యాప్తంగా చేపట్టాలి. రాష్ట్రంలో బీసీలకు నాలుగు మంత్రి పదవులివ్వాలి.
– మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
మా లాంటి మహిళలం రాజకీయాల్లో రాణిస్తున్నామంటే సావిత్రి బాయి స్ఫూర్తే కారణం. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం పోరాడిన యోధురాలు సావిత్రి బాయి. కాంగ్రెస్ ప్రకటించిన బీసీ డిక్లరేషన్ అమలు చేయాలి.
– తుల ఉమ
సావిత్రి బాయి ఫూలే జీవితం అందరికీ ఆదర్శ ప్రాయం. బీసీలకు విద్యనందించడంలో సావిత్రి బాయి పాత్ర ఎనలేనిది. విద్యతోనే ఏదైనా సాధ్యమని సావిత్రి బాయి ఆచరణలో నిరూపించారు.
– దేవీప్రసాద్