RS Praveen Kumar | హైదరాబాద్ : తెలంగాణలోని నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన గురుకుల పాఠశాలలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. తెలంగాణ భవన్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు.
గురుకుల వ్యవస్థపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అవగాహన లేదని ఆర్ఎస్పీ తీవ్రంగా విమర్శించారు. అందుకే 21 నియోజకవర్గాల్లో ఇంటిగ్రెటేడ్ స్కూళ్లను నిర్మిస్తున్నామని చెబుతున్నార న్నారు. కేవలం రూ. 25 కోట్లతో 2560 మంది విద్యార్థులకు ఓకేచోట భవనాలు ఎలా నిర్మిస్తారు? స్కూళ్లేమైనా కోళ్ల ఫారాలు అనుకుంటున్నారా? విద్యార్థులను కోడిపిల్లలనుకుంటున్నారా? అసలు మీరెప్పుడైనా గురుకుల విద్యార్థుల వద్దకు వెళ్లారా? అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నల వర్షం కురిపించారు.
కేసీఆర్ ప్రభుత్వం సకల హంగులతో గురుకులాలను నిర్మించి అన్ని వర్గాల పిల్లలకు చదువుకొనే అవకాశం కల్పించిందని ఆర్ఎస్పీ గుర్తు చేశారు. ఒక్కో విద్యార్థికి ఏడాదికి రూ. 10 లక్షలు వెచ్చించిందని తెలిపారు. కానీ కేసీఆర్ను బద్నాం చేసేందుకు గురుకులాల్లో సామాజిక న్యాయం పాటించలేదని, 666 స్కూళ్లల్లో కనీస వసతులు కల్పించలేదని సీఎం రేవంత్ అబద్ధాలు ఆడుతున్నారని విమర్శించారు. ఆయనకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే 662 గురుకులాల్లో మరమ్మతులు, సౌకర్యాల కల్పనకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ హయాంలో ఉన్నత చదువుల కోసం విద్యార్థులు విమానమెక్కితే.. ఇప్పుడేమో ముఖ్యమంత్రే 28 సార్లు స్పెషల్ ఫ్లైట్లలో ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. మంచి ఫ్యాకల్టీ కావాలని విద్యార్థులు అధికారులకు విజ్ఞప్తులు చేస్తున్న తరుణంలో 2000 మంది ఉపాధ్యాయులను రాత్రికిరాత్రే తొలగించారని గుర్తుచేశారు. నిజంగా ఈ ప్రభుత్వానికి విద్యారంగం అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే ఇంటిగ్రెటేడ్ స్కూళ్లపై అఖిలపక్షం నిర్వహించాలని, మేధావులు, నిపుణులతో చర్చించాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
KTR | కాంగ్రెస్ గ్యారెంటీలు అబద్దమని హర్యానా ప్రజలు గ్రహించారు : కేటీఆర్