Dasoju Sravan | హైదరాబాద్ : ముఖ్యమంత్రి హోదాలో విదేశాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు విదేశాలకు వెళ్లినప్పుడు అత్యంత బాధ్యతాయుతంగా మాట్లాడాలని రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ సూచించారు. దేశ, రాష్ట్ర ప్రతిష్ఠను అంతర్జాతీయంగా ఇనుమడింపజేయాలి.. కానీ సీఎం రేవంత్ రెడ్డి దావోస్‌లో మాట్లాడిన మాటలు తెలంగాణ ప్రతిష్టను దిగజార్చాయని దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. తెలంగాణ భవన్లో దాసోజు శ్రవణ్ మీడియాతో మాట్లాడారు.
తెలంగాణలో పని చేస్తున్న ఐటీ ఉద్యోగులను సీఎం రేవంత్ రెడ్డి కించపరిచారు. ఐటీ ఉద్యోగులు సంపద సృష్టిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. దేశ జీడీపీలో ఐటీ రంగం వాటా పది శాతం పైనే ఉంది. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేలా ఫ్యూడల్‌లా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఐటీ ఉద్యోగులు చెమటోడుస్తూ దేశ ప్రగతికి తోడ్పడుతున్నారు. రేవంత్ రెడ్డి దావోస్‌లో చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలి.. ఐటీ ఉద్యోగులకు క్షమాపణ చెప్పాలి అని దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు.
కేటీఆర్ మీద అక్కసు ఉంటే వేరే రకంగా తీర్చుకోవచ్చు.. ఐటీ ఉద్యోగులు ఏం తప్పు చేశారు అని శ్రవణ్ నిలదీశారు. శ్రమ గురించి రేవంత్ రెడ్డికి తెలియదు. అందరి శ్రమతోనే రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. ఐటీ ఉద్యోగుల శ్రమను రేవంత్ రెడ్డి అవమానించారు. ఐటీ ఉద్యోగులను వర్కర్స్ అని రేవంత్ రెడ్డి అంటున్నారు. మార్టిన్ లూథర్ కింగ్, మహాత్మ గాంధీ అన్ని రకాల శ్రమలకు గుర్తింపునిస్తూ గొప్ప మాటలు చెప్పారు. వారు చెప్పిన వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి ఓ సారి చదువుకోవాలని శ్రవణ్ సూచించారు.
కేటీఆర్ డాటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేయలేదు. ఓ సంస్థ అమెరికా మార్కెటింగ్ విభాగానికి అధిపతిగా పని చేశారు. కేటీఆర్‌ను చులకనగా మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి ఎక్కడ్నుంచి వచ్చారు? పెయింటర్‌గా ఉన్న రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. కేటీఆర్ ప్రతిభతోనే లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.. లక్షలాది ఉద్యోగాలు వచ్చాయి. రేవంత్ రెడ్డికి దావోస్‌లో ఉన్న చంద్రబాబు అయినా గడ్డి పెట్టాల్సి ఉండే. ఐటీ సంస్థలు రేవంత్ రెడ్డిని క్షమాపణ కోరాలి. చైనా ప్లస్ వన్ కలిస్తే హైదరాబాద్ అని రేవంత్ రెడ్డి అంటున్నారు.. అదేమిటో ఎవ్వరికి అర్థం కాలేదు. సీఎం రేవంత్ రెడ్డి వెంట ఎవరుంటున్నారో ఏ సలహాలు ఇస్తున్నారో అర్ధం కావడం లేదు. రేవంత్ రెడ్డి రాష్ట్ర పరువును ప్రతి వేదిక మీద మంటగలపడం దుర్మార్గం అని దాసోజు శ్రవణ్ మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి..
Ethanol factory | ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు కోసం రైతుల రిలే నిరాహార దీక్షలు
Adilabad | ఆదిలాబాద్ జిల్లాలో విషాదం.. ఖోఖో ఆడుతూ ప్రాణాలు కోల్పోయిన విద్యార్థి